cloudfront

Advertisement


Home > Politics - Political News

బాబుకు అది పిక్నిక్ స్పాట్ గా మారింది

బాబుకు అది పిక్నిక్ స్పాట్ గా మారింది

పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశం చంద్రబాబుకు కలలో కూడా లేదని విమర్శించారు జగన్. పోలవరం ప్రాజెక్టును కేవలం తన ప్రచారానికి, డబ్బులు దండుకోవడానికి మాత్రమే వాడుకుంటున్నారని.. వీటికి తోడు ఇప్పుడు కొత్తగా పోలవరాన్ని తన కుటుంబానికి పిక్నిక్ స్పాట్ గా కూడా మార్చేశారని జగన్ విమర్శించారు. 

"పోలవరం పనులు నత్తనడకన సాగడానికి కారణం చంద్రబాబు దగ్గరుండి చేస్తున్న అవినీతి. ఈ నాలుగున్నరేళ్లలో పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదల్లేదు. పోలవరం పూర్తయి గోదావరి నీళ్లు విశాఖకు ఎప్పుడు చేరతాయి. రైవాడ, తాటిపూడి నీటిని రైతులు ఎప్పుడు వాడుకుంటారు. అంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు."

ప్రతివారం డ్రామాల కోసమే పోలవరంపై సమీక్ష నిర్వహిస్తారని, కుటుంబంతో కలిసి పోలవరం ప్రాజెక్టుకు విహార యాత్రకు వెళ్తారని జగన్ ఎద్దేవా చేశారు. కేవలం డబ్బులు పిండుకోవడం కోసమే పోలవరం ప్రాజెక్టును వాడుకుంటున్నారని ఆరోపించారు.

"ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రతి వారం డ్రామానే. అక్కడికి వెళ్లి షో నడిపిస్తాడు. మొన్ననే మనందరం చూశాం, డ్రామాలో భాగంగా పోలవరం ప్రాజెక్టు వద్దకు ఫ్యామిలీని పిక్నిక్ కు కూడా తీసుకెళ్లారు. పోలవరం డిజైన్లు కూడా ఫైనలైజ్ కాని పరిస్థితి ఉంది. రైతులకు మేలు చేయడం కోసం ప్రాజెక్టు పూర్తిచేయాలనే ఆలోచన చంద్రబాబులో ఏ కోశానా లేదు. కేవలం తన అవినీతి కోసం ప్రాజెక్టు పనుల్లో రేట్లు పెంచేసి, కావాలనే నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నారు."

చంద్రబాబు అవినీతి చేయకపోతే లక్షల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు జగన్. ఏపీలో ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్ని కొన్నట్టు కొనడానికి చంద్రబాబుకు వందల కోట్ల రూపాయలు ఎక్కడ్నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

"చంద్రబాబు ఎస్.కోట నియోజకవర్గానికి వచ్చినప్పుడు వేలికి ఉంగరం, మెడలో గొలుసు, చేతికి వాచీ కూడా లేవన్నారు. తనంత నీతిపరుడు ప్రపంచంలోనే లేడన్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కోట్ల రూపాయల డబ్బు ఇస్తూ ఆడియో-వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. ఏపీలో 23 మంది వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 20 కోట్ల నుంచి 30 కోట్లు లంచం ఇచ్చి సంతలో పశువుల్ని కొన్నట్టు కొన్నారు. ఇవన్నీ చేయడానికి మాత్రం చంద్రబాబు దగ్గర డబ్బులుంటాయి."

రెండెకరాల భూమితో రాజకీయ జీవితం మొదలుపెట్టిన చంద్రబాబుకు 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. అడుగడుగునా ఇన్ని హెరిటేజ్ షాపులు ఎలా తెరిచారో చెప్పాలన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసలో లక్షలాది మంది ప్రజలు తరలిరాగా, భారీ బహిరంగ సభలో ప్రసంగించిన జగన్.. ఇలా చంద్రబాబు అవినీతి అవతారాన్ని ప్రజల ముందుంచారు.