cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ పై దొంగదెబ్బే గత్యంతరమా?

జగన్ పై దొంగదెబ్బే గత్యంతరమా?

ఏం చేయడం చాతకానపడు, ఏం చేయలేనపుడు, ఏం చేయడానికి అవకాశం లేనపుడు, ఏం చేయాలో తెలియనపుడు, ఏ గత్యంతరం లేనపుడు తప్పుదారి తొక్కాల్సిందే. ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ను ఏం చేయలేం..ఏం చేయడం మనకు చాతకాదు..ఏం చేసే అవకాశం లేదు. ఏం చేయాలో తెలియదు. 

అందుకే ఈ దారి ఎంచుకున్నారు అని అనాలేమో? ఎందుకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, పబ్లిషర్ అన్నింటికి మించి తెలుగుదేశం పార్టీకి కీలక సలహాదారు అని జనం అనుకునే ఆర్కే ఈవారం తన కొత్త పలుకులో కొన్ని లైన్లు రాసారు. అవి ఏమిటో ఇక్కడ చిత్తగించండి.

''.. తమ ప్రభుత్వంపై గెరిల్లా తరహా యుద్ధం చేస్తున్నారని జగన్‌ వ్యాఖ్యానించారు. శాసనసభలో 151 మంది బలంతో తిరుగులేని అధికారాన్ని సంపాదించుకున్న జగన్‌రెడ్డిపై ఎవరైనా గెరిల్లా తరహా యుద్ధం మాత్రమే చేయాలి. నేరుగా తలపడ్డానికి ప్రతిపక్షాలకు ఉన్న బలం సరిపోదు కదా! దీనికితోడు నిర్వీర్యమైపోయిన వివిధ పాలనావ్యవస్థలు పాలకుడి వద్ద పాలేర్లుగా మారిపోయినప్పుడు ముఖాముఖీ యుద్ధం చేసి ఎవరు మాత్రం నిలవగలరు?..''

ఈ వాక్యాల్లో రెండు, మూడు పాయింట్లు వున్నాయి. మొదటి పాయింట్ 151 మంది బలగం వుంది కాబట్టి జగన్ ను ఢీకొనలేరు. రెండవది ప్రతిపక్షాలకు వున్న బలం సరిపోదు. ఈ రెండు విషయాలను కూడా రాజకీయంగా అంగీకరించే విషయాలు కాదు.

గతంలో అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భయంకరమైన మెజారిటీ వచ్చిన సందర్భాలు వున్నాయి. అయినా ప్రతిపక్షాలు పోరాడిన వైనాలూ వున్నాయి. అలాగే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన సందర్భాలు వున్నాయి. అలా ఓడిపోయినా కూడా తిరిగిపోరాడి అధికారం సంపాదించుకున్న సందర్భాలూ వున్నాయి. 

కానీ ఈ రెండు సందర్భాల్లో కూడా ఇలా 'గెరిల్లా యుద్దమే చేయాలి' అని ఫిక్స్ అయిపోయి, అనైతికంగా వ్యవహరించిన సందర్భాలు మాత్రం లేవు. ఇందిర, జయలలిల, కరుణానిధి, లాంటి హేమా హేమీలు రాజకీయ యుద్దాలు సాగించిన తీరు గుర్తుచేసుకోవాల్సి వుంది. 

రాజకీయ యుద్దాలు జనం బలంతో సాగాలి, వ్యూహాలతో సాగాలి. అంతే తప్ప కుట్రలు కుతంత్రాలతో కాదు. కానీ ఘనత వహించిన ఆర్కే ఏమంటున్నారు? జగన్ లాంటి వాడితో గెరిల్లా యుద్దమే చేయాలి. ఎందుకంటే ఆయనకు మెజారిటీ వుంది. ప్రతిపక్షాలకు బలం లేదు. అందువల్ల గెరిల్లా యుద్దమే శరణ్యం అంటున్నారు. 

అసలు గెరిల్లా యుద్దంలో మూల లక్షణం ఏమిటి?

''...Guerrilla tactics focus on avoiding head-on confrontations with enemy armies...''

అంటే ముఖాముఖి తలబడకుండా, ఎదురుగా ఎదుర్కోకుండా వుండడం అనేగా. చంద్రబాబు లాంటి అనుభవం పండించుకున్న రాజకీయ వేత్తకు గెరిల్లా యుద్దం తప్ప గత్యంతరం లేదని ఆర్కే స్పష్టం చేస్తున్నారా? నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ, అపార కార్యకర్తల బలం వున్న పార్టీ, నాయకుల శ్రేణి వున్న పార్టీ కి గెరిల్లా యుద్దం తప్ప వేరే దారి లేదని ఆర్కే అంగీకరిస్తున్నారా? పైగా ఓ పత్రికాధిపతి వాడిన పదజాలం చూడండి...

''జగన్ లాంటి వాడితో...''

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, కొన్ని కోట్ల ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకుడిని ఆయన 'వాడు' అని సంబోధించడం. రాజకీయ నాయకులు ఇలా మాట్లాడితే సరిపెట్టుకోవచ్చు. ఈ తరం జర్నలిస్ట్ లు తప్పుజారికి కలం వాడితే సరిపెట్టుకోవచ్చు.

కానీ జర్నలిజం విలువలు నేర్పిన తరం నుంచి వచ్చిన ఆర్కే లాంటి సీనియర్ కూడా ఇలా 'వాడు' అని సంబోధించడం అంటే ఏమనుకోవాలి? జగన్ మీద ఆర్కేకు ఎంత అక్కసు వుందనుకోవాలి?

సరే, మళ్లీ వెనక్కు వెళ్లి ఆర్కే అన్న మూడో పాయింట్ చూద్దాం.

''...దీనికితోడు నిర్వీర్యమైపోయిన వివిధ పాలనావ్యవస్థలు పాలకుడి వద్ద పాలేర్లుగా మారిపోయినప్పుడు ముఖాముఖీ యుద్ధం చేసి ఎవరు మాత్రం నిలవగలరు?..''

ఇది ఏమన్నా కొత్త విషయమా? తల అమ్ముకుని బతికే అధికారులు, తమ ప్రమోషన్లు, ఉన్నతులు అన్నీ ప్రభుత్వం చేతిలో వున్న నేపథ్యంలో నేతలు ఎలా చెబితే అలా నడవడం తప్ప వేరు మార్గం లేని అధికారులు, తల వంచుకుని వెళ్లిపోవడం తప్ప మరో ఆప్షన్ వుందా? గతంలో జగన్ విశాఖ విమానాశ్రయంలో దిగినపుడు పోలీసు అధికారులు కనీసం లాంజ్ లోకి కూడా రానివ్వని ఘటన ఆర్కే మరిచిపోయారా? 

చంద్రబాబు అధికారంలో వుండగానే స్ధానిక సంస్థల కాలపరిమితి తీరిపోతే, ఎన్నికల కమిషనర్ ఏం చేసారు? కోర్టులకెక్కి పోరాడలేదేం? నిన్నటికి నిన్న తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులను కలిసి వినతి పత్రం తీసుకోవడానికి కూడా చీఫ్ సెక్రటరీ ముందుకు రాలేదు. ఇవన్నీ దేనికి చిహ్నాలు?

అంత మాత్రం చేత ఇక ప్రతిపక్షాలు అన్నీ ప్రజా పోరాటాలు మానేసి గెరిల్లా యుద్దాలు చేసుకోవాల్సిందే అని ఆర్కే సలహా ఇస్తున్నారా? అసలు జగన్ గెరిల్లా యుద్దం అనే పదాన్ని ఏ సందర్భంలో వాడారో ఆర్కే గమనించగలరా?

హిందూ ఆలయాల మీద దాడి చేసి, ఆ దాడులను జగన్ ఖాతాలో వేసే ప్రయత్నాలు జరుగుతుంటే తనపై గెరిల్లా యుద్దం చేస్తున్నారని జగన్ అన్నారు. అదే శరణ్యం అని ఆర్కే అంటున్నారు. ఇది ఎంతటి దిగజారుడు?

రాజకీయాల్లో ఇలాంటి చర్యలకు ఒడిగట్టడం ఎంతటి దిగజారుడో? అలాంటి వాటిని గత్యంతరం లేని చర్యలుగా సమర్ధించడం అంతకన్నా దిగజారుడు.

-ఆర్వీ

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి