Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ పాల‌న... హేమిటో

జ‌గ‌న్ పాల‌న... హేమిటో

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ పాల‌న ఒక ప‌ట్టాన ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. బాగుందా? అంటే ఔన‌ని, బాగాలేదా? అంటే కాద‌ని చెప్ప‌లేని అయోమ‌య ప‌రిస్థితి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్షేమ ప‌థ‌కాల‌కు ప్ర‌భుత్వ సొమ్మును ప‌ప్పుబెల్లాల మాదిరిగా పంపిణీ చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. మ‌రోవైపు అభివృద్ధి ప‌నుల ఊసే లేద‌ని, ప‌రిశ్ర‌మ‌లు, ఉపాధి క‌ల్ప‌న‌కు ప్ర‌ణాళిక‌లు లేనే లేవ‌ని అంద‌రూ అంగీక‌రించేదే.

ఈ నేప‌థ్యంలో తాజాగా హైకోర్టు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై చేసే వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇదే సంద‌ర్భంలో వైఎస్సార్‌ చేయూత పథకం కింద రాష్ట్ర ప్ర‌భుత్వం నేడు వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించ‌నుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాల‌నేది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. 

ఒక‌వైపు కాంట్రాక్ట‌ర్ల‌కు చెల్లించాల్సిన బిల్లుల‌కు నిధులు లేవ‌ని న్యాయ‌స్థానాల‌కు చెబుతూనే, మ‌రోవైపు ఇబ్బ‌డిముబ్బ‌డికి పందేరం చేయ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌నే ప్రశ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. 2018, 2019లో ఉపాధి హామీ కింద చేపట్టిన పలు పనులకు బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ చిత్తూరు జిల్లాకు చెందిన సీకే ఎర్రం రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆర్‌.శ్రీనివాసరావు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. 

రహదారి పనులు చేసిన తనకు రూ.21.41 లక్షల బిల్లులు ఫైనలైజ్‌ అయినా డబ్బులు చెల్లించడం లేదని ఎర్రం రెడ్డి , అలాగే ఉపాధి హామీ పథకం, ఎస్‌డీఎఫ్‌ పనులకు సంబంధించి రూ. 26.39 లక్షలు చెల్లించలేదంటూ ఆర్‌.శ్రీనివాసరావు వ్యాజ్యం వేశారు. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర నిధులు అందుబాటులో లేనందున పిటిష‌నర్ల‌కు బిల్లులు చెల్లించ‌లేద‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ప్ర‌భుత్వ స‌మాధానంపై  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టుదేవానంద్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాగే ఘాటు వ్యాఖ్య‌లు కూడా చేశారు. ఇది రాష్ట్ర ఆర్థిక స్థితి దయనీయ పరిస్థితిలో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తోందని న్యాయ మూర్తి అన్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోతే, పిటిషనర్లు పనులు చేయడానికి సేకరించిన మెటీరియల్‌తోపాటు కార్మి కులకు డబ్బులు ఎలా చెల్లిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అంతేకాదు... సకాలంలో బిల్లులు చెల్లించకపోతే ప్రతిపాదిత మూడు రాజధానుల నిర్మాణానికి ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించడం గ‌మ‌నార్హం.

ఒక వైపు మూడు నాలుగేళ్ల క్రితం చేసిన ప‌నుల‌కు కేవ‌లం రూ.21.41 ల‌క్ష‌లు, రూ.26.39 ల‌క్ష‌లు చొప్పున బిల్లులు చెల్లించ‌డానికే డ‌బ్బు లేద‌ని వాదిస్తున్న ప్ర‌భుత్వం , సంక్షేమ ప‌థ‌కాల‌కు మాత్రం ఎక్క‌డి నుంచి తెస్తుంద‌నేది ప్ర‌శ్న‌. టీడీపీ హ‌యాంలో చేసిన ప‌నుల‌కు తామెందుకు డ‌బ్బు చెల్లించాల‌నే అభిప్రాయం జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో బలంగా ఉంది. అందుకే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చేసిన ప‌నుల‌కు బిల్లులు చెల్లించ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏవో సాకులు చెప్పి మొండికేస్తోంది.

రూ.50 ల‌క్ష‌ల లోపు బిల్లులు చెల్లించ‌డానికి డ‌బ్బు లేదంటున్న జ‌గ‌న్ స‌ర్కార్‌, నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 – 60 ఏళ్ల వయసు అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున ఎలా ఆర్థిక సాయం అంది స్తోంద‌ని కాంట్రాక్ట‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు.  

కేవ‌లం ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌ను దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌కు మాత్ర‌మే నిధుల‌ను ఖ‌ర్చు పెడుతోంద‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా ఉన్నాయి. ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా, రాష్ట్ర ఆదాయం గ‌ణ‌నీయంగా ప‌డిపోతున్నా ...క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లును ప‌క్కాగా అమ‌లు చేస్తూ పోతోంది.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?