Advertisement


Home > Politics - Political News
జగన్‌ వెంట జన సంద్రం.. ఇదెలా సాధ్యం.?

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్ని కలిపే రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి జన సంద్రంగా మారిపోయింది. ఇసుకేస్తే రాలనంతమంది జనం. ఇంత మంది జనం గురించి వర్ణించడానికే మాటలు సరిపోవు. పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకుని, తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగు పెట్టేందుకు వైఎస్‌ జగన్‌, కొవ్వూరు నుండి రాజమండ్రికి పయనమయ్యారు. ఈ క్రమంలో ఆయన రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జిని దాటాల్సి వుంది. జగన్‌ రాక కోసం తూర్పు గోదావరి జిల్లాలో భారీ ఏర్పాట్లు జరిగితే, పాదయాత్రీకుడికి ఘన వీడ్కోలు పలికేందుకు పశ్చిమగోదావరి జిల్లాలోనూ అదే స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి.

దాదాపు మూడున్నర కిలోమీటర్ల మేర రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి విస్తరించి వుంటే, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు.. బ్రిడ్జి అంతటా వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడాయి. బ్రిడ్జి మీదనే కాదు, బ్రిడ్జి కింద గోదావరి నదిలోనూ అదే పరిస్థితి. వందలాది పడవల్లో వైఎస్సార్సీపీ అభిమానులు, పార్టీ జెండాలతో జగన్‌ రాక కోసం ఎదురుచూశారు. ఆ క్షణం రానే వచ్చింది. జగన్‌, బ్రిడ్జి మీదకు అడుగు పెట్టారు.. ఆయనతోపాటే, జన ప్రవాహం బ్రిడ్జి మీద అలా అలా ముందుకు కదిలింది.

కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర అడుగు పెట్టినప్పుడూ దాదాపు ఇదే పరిస్థితి. అప్పుడు కృష్ణమ్మ జగన్‌ రాకతో మురిసిపోతే, ఇప్పుడు గోదారమ్మ మురిసిపోయింది. అంతే తేడా.!

పాదయాత్రతో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తారా.? రారా.? అన్నది వేరే విషయం. 2014ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలు ఆశించిన మేర వైఎస్‌ జగన్‌ వెంట నడవని మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఈ రెండు జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్సార్సీపీ. అందుకు తగ్గట్టుగానే పార్టీ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. నేతలు కొందరు పార్టీలు మారినా, జనం మాత్రం తమతోనే వున్నారన్న సంకేతాలు పంపేందుకోసం వైఎస్సార్సీపీ పడ్డ కష్టం ఫలించింది.

కోట్లు ఖర్చు చేస్తే జనాల్ని రప్పించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ, ఇసుకేస్తే రాలనంత జనం.. జనసంద్రాన్ని తలపించేంతటి జన సమూహం కన్పించడం అంత ఆషామాషీ విషయం కానే కాదు. ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో అడుగడుగునా జగన్‌ వెంట జన సంద్రం కన్పిస్తోంది. ఏ జిల్లాలో చూసినా, ఇదే పరిస్థితి. 'మార్నింగ్‌ వాక్‌.. ఈవినింగ్‌ వాక్‌..' అంటూ అధికార పార్టీ చేసే విమర్శలకు జగన్ వెంట నడుస్తున్న జన సమూహాన్నే సమాధానంగా చూపిస్తోంది వైఎస్సార్సీపీ.

ఇదిలావుంటే, అమరావతి, పోలవరం అనే రెండు సినిమాల్ని గ్రాఫిక్స్‌ రూపంలో చంద్రబాబు, రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నారనీ, పుష్కరాల సినిమా కోసం 29మంది ప్రాణాల్ని బలిగొన్నారనీ తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన అనంతరం రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో జగన్‌ ఘాటైన విమర్శలు చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గోదావరిపై కొత్త వంతెన వచ్చిందనీ, చంద్రబాబు రాజమండ్రికి ఏం చేశారని నిలదీశారు వైఎస్‌ జగన్‌.

మరోపక్క, జన సమూహం కారణంగా బ్రిడ్జి కూలిపోతుందంటూ అధికార పార్టీ మద్దతుదారులు పుకార్లు పుట్టించడంతో, పరిస్థితి కొంత గందరగోళంగా తయారయ్యిందనీ, ఆ భయమే లేకుంటే ఇప్పుడు కన్పించిన జనసంద్రానికి రెండింతలు జనసంద్రం కన్పించేదని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఓ చర్చా కార్యాక్రమంలో వ్యాఖ్యానించడం గమనార్హం.