cloudfront

Advertisement


Home > Politics - Political News

జగన్‌ వేవ్‌ ఉంటే 120.. వేవ్‌ లేకపోతే 95

జగన్‌ వేవ్‌ ఉంటే 120.. వేవ్‌ లేకపోతే 95

-ఇదే ప్రస్తుత రాజకీయం
-క్షేత్రస్థాయిలో పరిస్థితి చెబుతున్న నిజం ఇది
-రావాలి జగన్‌ - కావాలి జగన్‌ అంటున్న గ్రామీణ ఏపీ
-సమీకరణాల లెక్కలో చూసుకున్నా జగన్‌ విజయం ఖాయమే!
-ఇక మిగిలింది 'ఆ రెండురోజుల' వ్యూహమే

ఎవరు నెగ్గుతారు? ఎన్నిసీట్లు వస్తాయ్‌? ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ఇదే చర్చ! చాలామంది ఈ అంశం గురించి ఆలోచనలతో, చర్చలతో బుర్రలు బద్ధలు కొట్టేసుకుంటున్నారు. ఐదేళ్ల రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుంటున్నారు. ఆఖరి నిమిషంలో మార్పులను గమనిస్తూ ఉన్నారు. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో.. అనే అంశాల గురించి చర్చలు కొనసాగిస్తూ.. ఎవరికి అవకాశం ఉందో... జనాలు ఎటు మొగ్గు చూపుతారో.. అనే అంశాల గురించి వారు చర్చలు సాగిస్తూ ఉన్నారు.

ఇక ఈ అంశం గురించి 'గ్రేట్‌ఆంధ్ర' కూడా పరిశీలనలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల, వర్గాల ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించింది. ఆయా అభిప్రాయాలను తీసుకుని విశ్లేషించింది. రాజకీయ సమీకరణాలు, సీట్ల కేటాయింపులు, గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత రాజకీయ మార్పులు..ఈ అంశాలన్నింటిని బేరీజు వేసుకుంటే.. ఈ అంశంలో ఒక అంచనాకు రానే రావొచ్చు.

ఇది పడక్కుర్చీ విశ్లేషణ కాదు. ప్రాంతాల వారీ ప్రజల అభిప్రాయాలను తీసుకుని వేసిన అంచనా. సశాస్త్రీయమైన అభిప్రాయం. రాజకీయ పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను కలిపి చెబుతున్న అభిప్రాయం. ఒకేమాటలో ఆ విషయాన్ని చెప్పాలంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఏపీలో జగన్‌ వేవ్‌ అనేది బలంగా ఉంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 120 ఎమ్మెల్యే సీట్లు రావడం ఖాయం. ఒకవేళ అలాంటిది లేకపోతే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కనీసం 95 ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉంది. వేవ్‌ ఉండటం అంటే.. 'రావాలి జగన్‌.. కావాలి జగన్‌' అని ప్రజలు కోరుకోవడం. వేవ్‌ లేకపోవడం అంటే.. ప్రభుత్వ వ్యతిరేకత, సీట్ల సమీకరణాలు, త్రిముఖ పోరు.. ఈ పరిణామాలు. గత ఎన్నికల ఫలితాలు వేవ్‌ లేని ఫలితాలు. కేవలం సమీకరణాల ఆధారంగా అప్పుడు జయాపజయాలు నిర్ణయం అయ్యాయి. అలాంటి సమీకరణాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కనీసం 95 సీట్లు ఇచ్చేలా ఉన్నాయి.

ఇక జగన్‌.. జగన్‌.. జగన్‌ వస్తాడు.. అనేమాట ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతంలో బాగా వినిపిస్తూ ఉంది. అది వేవ్‌. అది దూసుకొచ్చింది అంటే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అప్పుడు సమీకరణాలు గట్రా లెక్కలు ఏమీ ఉండవు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనమే. అభ్యర్థులు, ప్రత్యర్థులు, త్రిముఖ పోరులు.. ఇవేవీ ఆ వేవ్‌లో లెక్కలోకి రావు. ప్రభంజనం మాత్రమే ఉంటుంది. రికార్డుస్థాయి మెజారిటీతో జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోవడమే ఉంటుంది. ఇదీ ప్రస్తుత రాజకీయ పరిస్థితి. ఈ రెండే జరిగే అవకాశాలున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏం జరుగుతుంది? అనేదే మరింతగా విశ్లేషించుకోదగిన అంశం

ముందుగా వేవ్‌ గురించినే మాట్లాడదాం..!
ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడి పాలనను ప్రజలు పరిపూర్ణంగా చూశారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఒక అనైతికమైన పాలన చేశారు అనేది నిష్టూరమైన నిజం. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లు ఆయనొక అపర మేధావి అని, ఆయన గొప్ప పాలనాదక్షుడు అని, రాజకీయ చాణుక్యుడు అని ఒకవర్గం మీడియా, ఆయన వర్గం మీడియా గట్టిగా డప్పువేసింది. అయితే ఐదేళ్లలో చంద్రబాబు  నాయుడు పాలనను ప్రజలు గమనించనే గమనించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు లక్కీ బై ఛాన్స్‌ గా  అధికారం దక్కింది.

బీజేపీతో పొత్తు లేకపోయి ఉండినా, పవన్‌కల్యాణ్‌ సపోర్ట్‌ లేకపోయినా, రుణమాఫీ హామీ అనే హామీని ప్రజలు నమ్మకపోయి ఉండినా..ఈ మూడింటిలో ఏ ఒక్కటి కలిసి రాకపోయినా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేవారు కాదు. అవన్నీ కలిసి రావడంతో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు.

ఇక ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్లు అన్నీ ఇన్నీ కావు. తను ఏం చేస్తే అదే నిజం, అదే అవసరం అని జనాలను పూర్తిగా వెర్రి గొర్రెలను చేసే పాలన సాగించారు చంద్రబాబు. ఒకరకంగా ఇది తుగ్లక్‌ పాలన. అయితే తుగ్లక్‌కు అప్పుడు మీడియా అండగా లేకపోయి ఉంటుంది, అందుకే ఆయన పిచ్చి పాలకుడు అయ్యాడు. చంద్రబాబుకు ఆ ప్రమాదం లేదు. అనుకూలంగా మీడియా ఉండింది కాబట్టి.. ఆయన ఏం చేసినా అది గొప్ప అయినట్టుగా డబ్బాకొట్టింది.

ప్రజలతో సంబంధం లేని పాలన సాగింది. రాజధాని అంటూ ఎన్నికబుర్లు చెప్పినా.. ఆ అంశంతో ప్రజలకు కనెక్టివిటీ ఏర్పడలేదు. ఏపీ కోసం చంద్రబాబు నాయుడు ఏదో చేస్తూ ఉన్నారనే భావన మెజారిటీ ప్రజల్లో కలగడం లేదంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా అది తన వాళ్ల కోసం, తన కోసం చేసుకుంటారనే భావన ప్రజల్లో స్పష్టంగా ఏర్పడింది.
ఏ ఎన్నికల్లోనూ నెగ్గని, ఏమాత్రం పటిమలేని తనయుడికి మంత్రిపదవిని ఇచ్చుకోవడం అయితేనేం.. కేవలం రాజకీయ స్వార్థంతో ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపి.. అదే రాజకీయం అన్నట్టుగా వ్యవహరించడం అయితేనేం.. ఫిరాయింపులు అనే అనైతిక చర్యతో అసెంబ్లీ అంటేనే విసుగెత్తిపోయేలా చేయడం అయితేనేం.. ఇవన్నీ బాబు అసలు రూపాన్ని ప్రజలకు చూపించాయి.

ఇక చంద్రబాబు నాయుడు పాలన ఏనాడూ లేనిరీతిలో కులం కంపు కొట్టడం గమనార్హం. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీలో అన్నికులాల నేతలకూ వాయిస్‌ ఉండేది. తెలంగాణలో రెడ్లు, ఆంధ్రాలో కాపులు కూడా తెలుగుదేశం పార్టీ లో కీలకమైన, క్రియాశీల నేతలుగా ఉండేవారు. ఇప్పుడూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు పాలన కమ్మజనరంజకంగా సాగుతూ ఉందనే అభిప్రాయం జనాల్లో బలంగా కలిగింది. ఇదే సమయంలో బాబును అతిగా ఓన్‌ చేసుకుని కమ్మవాళ్లు.. మిగతా కులాలన్నింటినీ విసుగెత్తించాయి!

బాబు పాలన ఇలా డొల్లగా సాగుతూ ఉండగా.. మరోవైపు జగన్‌ జనాల్లోకి వెళ్లారు. బహుశా ఏ ప్రతిపక్ష నేత కూడా చేపట్టనన్ని కార్యక్రమాలతో జగన్‌ జనాల్లోకి వెళ్లారు. జగన్‌ ప్రజలకు చేరువయ్యేందుకు అన్ని అవకాశాలనూ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ప్రత్యేకహోదా అంశంలో బాబు తీసుకున్న యూటర్న్‌లు జగన్‌కు వరప్రదం అయ్యాయి. ప్రతి మలుపులోనూ చంద్రబాబు తీరును ఎండగడుతూ.. బాబును ఒక అబద్ధాల కోరుగా, రాష్ట్ర ప్రయోజనాలు పట్టని ఒక స్వార్థపూరిత రాజకీయ నేతగా ప్రొజెక్ట్‌ చేయడంలో జగన్‌ నిస్సందేహంగా సక్సెస్‌ అయ్యారు. ఇక రైతులు, డ్వాక్రా మహిళలు చంద్రబాబు నాయుడి ప్రధాన బాధితులు. వారికి చేరువకావడంలో జగన్‌ విజయవంతంగా ముందుకు వెళ్లారు. అన్నింటికి మించి సుదీర్ఘ పాదయాత్రను సాగించి.. రాష్ట్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక ఉనికిని చాటుకున్నారు జగన్‌.

ఈ క్రమంలో జగన్‌ ఓక మాస్‌ లీడర్‌గా ఎదిగారు. కేవలం ప్రజలతో మమేకం కావడమే కాదు.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్‌ నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తూ వచ్చారు. బాబు కప్పగంతులు వేస్తూ సాగకా.. జగన్‌ ఒకేమాట, ఒకేబాట అన్నట్టుగా సాగారు. చివరకు జగన్‌ చెప్పిన దాన్నే నిజం అని చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎన్డీయే నుంచి బయటకు రావాలని జగన్‌ అంటే.. మొదట్లో వెకిలి మాటలు మాట్లాడి అధికారాంతమును చంద్రబాబు నాయుడు అదే పనిచేశారు. ప్రత్యేకహోదా విషయంలో జగన్‌ చెప్పిన మాటల విషయంలో మొదట్లో అడ్డగోలుగా మాట్లాడి, చివరకు మళ్లీ జగన్‌ రూట్లోకి వచ్చారు చంద్రబాబు నాయుడు. ఇలా ఒక్కొక్క అంశంలో చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ స్వార్థపరుడిగా మిగిలిపోతే, జగన్‌ తన ప్రత్యేకత ఏమిటో చాటుకొంటూ వచ్చారు.

ఒకవైపు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువకావడం, రెండు తనమాట తీరుతో.. విధానాలతో అందరిలోనూ ఆలోచన రేకెత్తించడం.. వీటి ద్వారానే జగన్‌ నిలిచారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు పాతికమంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నా, మరోవైపు జగన్‌ మీద కేసులనే కుట్ర కొనసాగుతూనే ఉన్నా, జగన్‌నే లక్ష్యంగా చేసుకొంటూ పవన్‌ రెచ్చిపోతున్నా.. ఎన్నికల ముందు కూడా జగన్‌ పార్టీలోకే వలసలు కొనసాగాయి, కొనసాగుతూ ఉన్నాయి.. ప్రతిపక్ష నేతగా జగన్‌ విజయం సాధించారనడానికి మరేం రుజువు కావాలి? ప్రతిపక్ష నేతగా విజయం సాధించి.. ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నాడని చెప్పడానికి ఇంకేం ఆధారాలు కావాలి?

వైఎస్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న జగన్‌!
తనకు అధికారం దక్కితే తన తండ్రి పాలనను మళ్లీ తెస్తానంటూ జగన్‌ ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం విరుచుకుపడితే పడొచ్చుగాక. అయితే ఈ మాటను జగన్‌ ప్రజల మధ్యలోకి వెళ్లి అనగలుగుతూ ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో వైఎస్‌ పాలన గురించి సామాన్యులను, రైతులను ఎంతగా ఆకట్టుకుందో.. అర్థం చేసుకోవడానికి జగన్‌ ఆ మాటను ధైర్యంగా అంటుండటమే రుజువు. 'వైఎస్‌ బాగా చేశారు.. జగన్‌కూ ఒక ఛాన్స్‌ ఇద్దాం.. అలా చేస్తాడేమో..' అనేమాట ఒకటి సామాన్యుల్లో, రైతుల్లో, కార్మికుల్లో, కర్షకుల్లో చర్చగా సాగుతోంది. అదీ వేవ్‌ అంటే! ఆ వేవ్‌ ఉప్పెనలా విరుచుకుపడితే.. అప్పుడు వస్తాయి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి నూటా ఇరవైకి పైగా సీట్లు! ఈ వేవ్‌ను క్షేత్రస్థాయికి వెళితే పరిశీలించవచ్చు. టీవీ మీడియా, ప్రింట్‌ మీడియా, సోషల్‌ మీడియాల్లో ఇది కనపడదు. ఊరవతల పొలాల్లో పనులు చేసుకుంటున్న వాళ్లను కదిలించండి. ఒకరిద్దరే ఉన్నప్పుడు వారితో రాజకీయం గురించి మాట్లాడండి. కులాలకు, మతాలకు అతీతంగా.. వారి పరిస్థితులను వాకబు చేస్తూ.. అప్పుడు అడగండి.. ఆ వేవ్‌ ఎలా ఉంటుందో ఒక తెరకొట్టి వెళుతుంది!

సమీకరణాలూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలమే!
ఆ వేవ్‌ గనుక తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంచలన విజయం సాధిస్తుంది. ఒక ఆ పార్టీ ఎమ్మెల్యేలు సాధించే మెజారిటీలు కూడా అలాగిలాగా ఉండవు. ఇరవై వేలు, పాతికవేల మెజారిటీలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దక్కుతాయి. ఇది ప్రస్తుత రాజకీయంలో నాణెనికి ఒకవైపు!
రెండోవైపూ ఉంది. అదే జరిగినా..వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి అయితే ఢోకాలేదు. ఇది సమీకరణాలకు సంబంధింధించిన విజయం. గత ఎన్నికల పరిణామాలు, ప్రస్తుత పరిణామాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వం, వాదోపవాదాలు.. ముక్కోణపు పోరు.. ఇవన్నీ ప్రభావం చూపించబోతాయి ఇందులో.

గత ఎన్నికల ఫలితాల గురించి ఒకసారి గుర్తుచేస్తే.. తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ, జనసేనలు కలిసి సాధించిన విజయం అది. చంద్రబాబు నాయుడి మందీమార్బలం, మాయ చేసిన మీడియా, మోడీ వేవ్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రచారం... ఇవన్నీ కలిసి సాధించిన విజయం అది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్నా అత్యంత స్వల్పమైన ఓట్ల శాతాన్ని మెరుగ్గా సాధించింది, వివిధ సమీకరణాల మధ్యన కొన్నిప్రాంతాల్లో మాత్రమే ఎక్కువ సీట్లను సాధించగలిగి.. చంద్రబాబు నాయుడు అప్పుడు అధికారాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆ లెక్కలు అప్పటికి మాత్రమే పరిమితం. ఇప్పుడు కథ పూర్తిగా మారిపోయింది. సమీకరణాలు మారాయి. నాడు ఏ సమీకరణాలు అయితే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశాయో.. అవన్నీ ఇప్పుడు అసమీకరణాలుగా మారాయి.

తెలుగుదేశం మైనస్‌ బీజేపీ, మైనస్‌ జనసేన!
ఇదీ ప్రస్తుత ఎన్నికల సమీకరణం. మోడీ వేవ్‌ బాబు చెంతలేదు, పవన్‌కల్యాణ్‌ ఓట్లు తెలుగుదేశం పార్టీ గుర్తుకు అయితే పడవు! ఇక అదనంగా ప్రభుత్వ వ్యతిరేకత బోనస్‌! ఈ ఫలితాలను చంద్రబాబు నాయుడు ఎదుర్కొనాల్సి ఉంది. ఇక ఈ సమీకరణాల్లో జగన్‌ అంటారా, జగన్‌ అప్పుడూ ఒంటరే, ఇప్పుడూ ఒంటరే! అప్పుడు వెంట ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ఫిరాయించారు.వారి స్థానంలో ఆ స్థాయి వాళ్లు వచ్చారు. వారికి తోడుగా.. కాంగ్రెస్‌లో మిగిలిన కొద్దో గొప్పో నేతలు కూడా ఇప్పుడు జగన్‌తో ఉన్నారు. కాబట్టి జగన్‌ జగనే! చంద్రబాబు అంటే.. మోడీ మైనస్‌, పవన్‌కల్యాణ్‌ మైనస్‌ చంద్రబాబు. జగన్‌ అంటే మాత్రం అప్పుడూ ఇప్పుడూ జగనే!

భారతీయ జనతా పార్టీని చంద్రబాబు నాయుడు ఎంత విలన్‌గా చేద్దామని చూసినా.. అది వర్కవుట్‌ కాలేదని స్పష్టం అవుతోంది. బీజేపీకి ఏపీలో సాలిడ్‌గా రెండుశాతం ఓటు బ్యాంకు ఉంటుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అభిమానగణం ఏపీలో ఉంది. బీజేపీ తరఫున ఎంత అనామకులు పోటీచేసినా.. ఆ రెండుశాతం తమ అభిమానాన్ని చాటుతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేనలు కలిసి జగన్‌ పార్టీ మీద సాధించిన అదనపు ఓట్లశాతం ఒకటిన్నర. అయితే ఇప్పుడు బాబు ఓటమిని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీతోనే రెండుశాతం ఓట్లు దూరం అవుతాయి.

ఇక పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు నాయుడు అంతర్గత పొత్తు పెట్టుకున్నారని, ఈ రెండుపార్టీలూ లాలూచీ రాజకీయం చేస్తున్నాయని స్పష్టం అవుతోంది. పవన్‌ పార్టీకి కొన్ని సీట్లలో తెలుగుదేశం సహకరిస్తూ ఉంటే, తెలుగుదేశానికి మరికొన్ని చోట్ల పవన్‌ సహకరిస్తూ ఉన్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాటి సంగతలా ఉంటే.. కనీసం నాలుగైదు శాతం ఓటు బ్యాంకు పవన్‌ కల్యాణ్‌కు ఉంది. ఆ ఓట్లు పవన్‌ పార్టీ గుర్తుకు పడతాయి. వాటిల్లో చంద్రబాబు వ్యతిరేక ఓటు కొంత ఉన్నా, అనుకూల ఓటు కూడా ఉంది. అన్నింటికి మించి.. గత ఎన్నికల్లో పవన్‌ చెప్పాడని సైకిల్‌ గుర్తుకు వోటేసిన జనాలు వాళ్లంతా!

తెలుగుదేశం పార్టీ జేబులోంచి ఆ నాలుగైదు శాతం ఓట్లు ఒక్కసారిగా దూరం అయితే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ వాళ్లు దూరం అయినప్పుడే బాబుకు వచ్చిన మెజారిటీలు ఆవిరి అయిపోయాయి. పవన్‌ ఓట్లు సైడ్‌ పడ్డాకా.. కథ పూర్తిగా మారిపోతూ ఉంది. ఇదే సమయంలో జగన్‌ తన ఓటు బ్యాంకును తను కాపాడుకున్నాడు. పవన్‌ను అభిమానించే వాళ్లు, బీజేపీ వీరాభిమానులు గత ఎన్నికల్లో జగన్‌ను ఉద్ధరించింది ఏమీ లేదు. కాబట్టి.. ఇప్పుడు కొత్తగా వాళ్లతో జగన్‌కు నష్టమూలేదు. వాళ్లు బాబుతో ఉండుంటే.. జగన్‌కు ఇబ్బంది ఎదురయ్యేదేమో, అయితేవారు బాబుతో లేరు కాబట్టి.. ఇప్పుడు జగన్‌దే పెద్దగీత అవుతుంది!

ఇక ఐదేళ్ల పాలనతో చంద్రబాబు నాయుడు కావాల్సిన వ్యతిరేకతను కూడా సంపాదించుకున్నారు. గత ఎన్నికల్లో బాబు హామీలను నమ్మి ఓట్లేసిన వాళ్లు అత్యధికం. బాబు మొహం నచ్చి వాళ్లు ఓటేయలేదు. బాబు రుణమాఫీ చేస్తాడంటే, డ్వాక్రారుణాలు ఎత్తేస్తాడంటే, తాకట్టులో బంగారాన్ని విడిపిస్తాడంటే.. తమకు వ్యక్తిగతంగా లాభం కలుగుతుందనే ఆశతో.. కులాలు, మతాలకు అతీతంగా టీడీపీకి ఓట్లుపడ్డాయి. అయితే ఆ హామీల అమలులో చంద్రబాబు నాయుడు దిగ్విజయంగా విఫలం అయ్యారు. ఎన్నికలకు రెండు మూడునెలల ముందు బాబు ఏవో బిస్కెట్లను వాళ్లకు వేసినా.. గత ఎన్నికల్లో టీడీపీకి ఆ వర్గాల్లో కనిపించిన ఆదరణలో పదోవంతు కూడా ఇప్పుడులేదు. పైపెచ్చూ బాబు తమను మోసం చేశాడనే భావన వారిలో ఉంది. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టిని ముంచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయికి వెళితే ఈ విషయాలను అర్థం చేసుకోవచ్చు. అలా కాదు.. చంద్రబాబు నాయుడు, సింగపూరు, గ్రాఫిక్సు, విజన్‌.. అనే వారికి 2004 ఎన్నికల ఫలితాలను ఒకసారి గుర్తు చేసుకొమ్మని సూచించడమే!

సీట్ల కేటాయింపులో జగన్‌ నేర్పరితనం!
జగన్‌ చాలా క్విక్‌లెర్నర్‌. ఈ విషయం సీట్ల కేటాయింపు విషయంతో స్పష్టం అవుతోంది. గత ఎన్నికల్లో తను ఎందుకు ఓడిపోయినట్టో జగన్‌ బాగా అర్థం చేసుకున్నారు. రాజకీయం అంటే కేవలం ఎమోషనల్‌ జర్నీ కాదు, రకరకాల అంశాలుంటాయని, రాజకీయంలో సాంకేతిమైన విజయాలు కూడా ఉంటాయని, డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో క్రికెట్‌ మ్యాచ్‌ ఫలితాలు మారిపోయినట్టుగా.. రాజకీయంలో ఫలితాలు అటు ఇటూ మారిపోతాయని జగన్‌ బాగా అర్థం చేసుకున్నారు. ఆ విషయం సీట్ల కేటాయింపులోనే అర్థం అయిపోయింది. గత ఎన్నికల్లో తను టికెట్లు ఇచ్చిన వారు ఎమ్మెల్యేలు అవుతున్నారు అని అనుకున్న జగన్‌ ఇప్పుడు ఎమ్మెల్యేలు కాగలిగే వారికే టికెట్లు ఇవ్వాలనే తర్కాన్ని అర్థం చేసుకున్నారు.

సీట్ల కేటాయింపులో సమీకరణాలకు, వాస్తవికతతో కూడిన రిపోర్టులకు ప్రాధాన్యతను ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు సీట్ల కేటాయింపు విషయంలో ఆఖరి నిమిషం వరకూ రచ్చలను తన ఇంటిముందు వరకూ తెచ్చుకున్నారు. ఈ తేడా రేపు ఎన్నికల ఫలితాలను నిర్దేశించబోతోంది. అభ్యర్థుల విషయంలో చాలా నేర్పరితనంతో వ్యవహరించిన జగన్‌, చివరి రెండురోజుల పోల్‌ మేనేజ్‌మెంట్లో, ఆఖరి నిమిషంలోని పరిణామాల విషయంలో కూడా గత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటే.. జగన్‌ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు!