Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ -అన్నీ అరకొర పనులే?

జగన్ -అన్నీ అరకొర పనులే?

ఆంధ్ర సిఎమ్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ అవన్నీ అంతలోనే అబేయన్స్ లో పడుతున్నాయి. సరైన నిర్ణయాలే అని కొంత మంది అనుకంటే, కాదని అడ్డం పడేవారు మరికొంత మంది. దాంతో జగన్ ఆ నిర్ణయాలను అక్కడే అలా వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది.

జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాల పేర్లు ప్రకటించారు. మరి అక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. రెండేళ్ల బట్టి ఇదిగో..అదిగో అంటూనే వున్నారు. తప్ప అంతకు మించి లేదు. జిల్లాల సరిహద్దుల నిర్ణయం అన్నది ఏ దశలో వుందో ఎవరికీ తెలియదు. ముందుగా సరిహద్దుల నిర్ణయం జరగాలి. నోటిఫికేషన్ రావాలి. అభ్యంతరాలు రాకూడదు. ఇలా చాలా వుంది వ్యవహారం. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తున్న దాఖలా అయితే లేదు. 

జిల్లాకో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్నారు. వర్చ్యువల్ గా శంకుస్ధాపనలు చేసేసారు. ఇదంతా జరిగి ఆర్నెలు దాటిపోతోంది. ఒకటి రెండింటికి మాత్రమే టెండర్లు పిలిచారు. మిగిలిన వాటి సంగతి అతీ గతీ లేకుండా వుంది. నిజానికి కొత్త జిల్లాలు ఏర్పాటై, కొత్త కలెక్టర్లు, ఎస్పీలు వస్తే, కొత్త మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు వస్తే రాష్ట్రం రూపు రేఖలే వేరుగా వుంటాయి.

ఈ రెండు నిర్ణయాలకన్నా ముందే మూడు రాజధానులు ప్రకటించారు. కానీ విశాఖలో కనీసం సిఎమ్ క్యాంప్ ఆఫీసు అయినా ఏర్పాటు చేయలేకపోయారు. కర్నూలు న్యాయ రాజధాని సంగతి సరేసరి. నెలకో వారం రోజులు అయినా జగన్ విశాఖలో క్యాంప్ చేయలేకపోతున్నారు. నిజానికి అలా చేయడానికి కోర్టు అడ్డంకులేమీ లేవు. స్వంత భవనం వుండాలని ఆయనకు పట్టింపు వుందేమో తెలియదు.

రెండున్నరేళ్లకు మంత్రులను సమూలంగా మారుస్తామని గతంలోనే చెప్పారు. కొన్ని రోజల క్రితం నుంచి ఈ విషయమై వార్తలు ముమ్మరంగా వినిపించాయి. కానీ ఇప్పుడు చటుక్కున సద్దుమణిగాయి. మరి ఏం జరిగిందో, ఏం జరగబోతోందో జగన్ కే తెలియాలి. మంత్రులు అందరినీ తీసేసి కొత్తవాళ్లను పెట్టడం అన్నది అంత ఈజీ టాస్క్ కాదు. చాలా రిస్క్ కూడా. అయినా ఇవన్నీ ఆలోచించకుండానే జగన్ మాట అనేసారా? తెలియదు మరి. 

రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేపడతామని చెప్పారు. అలాగే ఎమ్మార్వో ఆఫీసుతో అవసరం లేకుండా పలు సేవలు గ్రామ సచివాలయాల్లోనే జరిగేలా చూస్తామన్నారు. అవీ కార్యరూపం దాల్చడం లేదు. 

దశలవారీ మద్యనిషేధం అనీ, షాపుల సంఖ్య క్రమేపీ తగ్గిస్తామని జగన్ ఏనాడో మాట ఇచ్చారు. కానీ ఆ మాట మాటగానే వుండిపోయింది. దుకాణాల సంఖ్య తగ్గడం లేదు. ఇలా జగన్ తలపెట్టి వదిలేసినవి, చెప్పి కూడా చేసే ప్రయత్నం చేయనవి ఇంకా చాలా అంటే చాలానే వున్నాయి. వీటిలో ఉద్యోగుల వ్యవహారాలు కూడా వున్నాయి.

మరి జగన్ ఆలోచన ఏమిటో? సమస్య ఏమిటో? అడ్డంకులు ఏమిటో? అసలు ఆయన మనసులో మాటేమిటో ఆయనకే తెలియాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?