Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ మేన‌మామ బాధ్య‌తా రాహిత్యం!

జ‌గ‌న్ మేన‌మామ బాధ్య‌తా రాహిత్యం!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మేన‌మామ‌, క‌మ‌లాపురం ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి బాధ్య‌తా రాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. 

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌తో గొడ‌వ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. సాధ్య‌మైనంత వ‌ర‌కూ పంచాయ‌తీల‌ను ఏక‌గ్రీవం చేయాల‌నే దృఢ సంక‌ల్పంతో ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది.

అయితే ప్ర‌భుత్వ ఆశ‌యాన్ని, సీరియ‌స్‌నెస్‌ను ముఖ్య‌మంత్రి మేన‌మామే తుంగ‌లో తొక్కుతున్నార‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా ఉన్నాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పంచాయ‌తీ స‌ర్పంచ్ అభ్య‌ర్థుల ఎంపిక బాధ్య‌త‌ను వైసీపీ మండ‌ల అధ్య‌క్షుల‌కు అప్ప‌గించ‌డంపై గ్రామ‌స్థాయి నాయ‌కులు, కార్య‌క‌ర్తలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు రెండో విడ‌త‌లో వ‌చ్చే నెల 13న జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే ఆదేశాల మేర‌కు వైసీపీ మండ‌లాధ్య‌క్షులు గ్రామాల వారీగా ఆశావ‌హులెవ‌రో చెప్పాలంటూ కోర‌డంతో పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు.

ఇదే త‌ల‌నొప్పిగా మారింది. దీనివ‌ల్ల వైసీపీలోనే గ్రూపుల ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించిన‌ట్ట‌వుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ్రామాల్లో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్న ఒక‌రిద్ద‌రిని ఎమ్మెల్యే పిలిపించుకుని ఎంపిక చేస్తే స‌రిపోతుంద‌ని, అందుకు విరుద్ధంగా ఒక్కో గ్రామం నుంచి 10 నుంచి 15 మంది పేర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం వ‌ల్ల కొత్త స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయంటున్నారు.

క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు, విడ‌వ‌మంటే పాముకు కోపం అనే రీతిలో క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి త‌యార‌వుతోంద‌ని చెబుతున్నారు. వైసీపీ మండ‌లాధ్య‌క్షుల‌కు ఎమ్మెల్యే పెత్త‌నం ఇవ్వ‌డం వ‌ల్ల గ్రామాల్లో తామే పోటీకి ఉసిగొలిపిన‌ట్ట‌వుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఉదాహ‌ర‌ణ‌కు ఒక గ్రామంలో ప‌ది మంది పేర్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని, చివ‌రికి ఒక‌రి పేరు ప్ర‌క‌టిస్తే మిగిలిన వారికి కోపం వ‌చ్చే ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు. ఆ కోపం మిగిలిన వారంద‌రినీ ఏకం చేసి, నామినేష‌న్ వేసేందుకు దారి తీస్తుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదే ఎమ్మెల్యే స్వ‌యంగా జోక్యం చేసుకుని ఒక‌రిద్ద‌రి పేర్ల‌ను ప‌రిశీలించి, ఫైన‌ల్‌గా ఒక‌రిని ఎంపిక చేసి, మ‌రొక‌రికి స‌ర్ది చెబితే ఏ స‌మ‌స్యా ఉండ‌దంటున్నారు. 

ఇప్ప‌టికైనా ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి జోక్యం చేసుకుని స్వ‌యంగా అభ్య‌ర్థుల ఎంపిక చేప‌డితే పార్టీకి, ప్ర‌భుత్వానికి ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌నే అభిప్రాయాలు క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్తలు వెల్ల‌డిస్తున్నారు. క‌నీసం ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఎన్నిక‌ల‌కైనా స‌మ‌యం కేటాయించ‌నంత‌గా ప‌నులేం ఉంటాయ‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. 

అయ‌న లాంచ్ చేశారు..హిట్టయింది

జ‌గ‌న్..అర్జంటుగా చుట్టూ ఉన్న బ్యాచ్ ను మార్చేయ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?