Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ ..తెగేదాకా లాగుతున్నారా?

జగన్ ..తెగేదాకా లాగుతున్నారా?

ఆంధ్రలో ఉద్యోగస్తుల ఆందోళన మెలమెల్లగా మొదలయింది. అది ఎలాగూ రాజుకుంటుంది. వెనుక మీడియా మద్దతు వుంది కనుక హడావుడి గట్టిగానే వుంటుంది. ఇదంతా తెలిసి కూడా సిఎమ్ జగన్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎన్నికల ఓటింగ్ లో ఉద్యోగస్తుల ప్రభావం ఆయనకు తెలియంది కాదు? మరి తెలిసి కూడా ఎందుకు పంతానికి పోతున్నారు? 

కేవలం నెలనెలా భరించలేని ఆర్ధిక భారం పడుతుంది అనేనా? లేక మరేమైనా వుందా? జగన్ ప్రభుత్వం మీద పడుతున్న ఆర్థిక భారాలతో పోల్చుకుంటే ఉద్యోగస్థుల వ్యవహారం మరీ పెద్దది కాదు. అలాగే ఉపేక్షించేదీ కాదు. మిగిలిన నగదు బదిలీ స్కీముల మాదిరిగా భరించాల్సిన భారమే.

కేవలం ఇది మాత్రమే అయి వుంటే జగన్ పళ్ల బిగువన రెండేళ్లు బండి నెట్టుకు వచ్చి వుండేవారు. ఇదికాక ఆయన స్ట్రాటజీ మరేదో వుంది. కిందిస్థాయి ప్రజలు తమ వైపు వున్నారని జగన్ కు గట్టి నమ్మకం. ఆ ప్రజలకు ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగుల మీద సింపతీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే కామన్ మాన్ కు ఎందుకో చిన్న కినుక వున్నమాట వాస్తవం.

ప్రభుత్వ ఉద్యోగులకు ముకుతాడు వేసిన హీరోగా తనను జనం చూస్తారని జగన్ అనుకుంటున్నారా? కానీ అలా అనుకోవడం వల్ల జగన్ కు వచ్చిన అదనపు లాభం ఏమీ వుండదు. కానీ భారీ ఓటు బ్యాంక్ ను మాత్రం దూరం చేసుకున్నట్లే అవుతుంది.  నిజానికి నాన్ ప్లానింగ్ ఎక్స్ పెండిచర్ అలా అలా పెరిగిపోతున్న మాట వాస్తవం. బడ్జెట్ లో సింహ భాగం దానికే పోతోందన్న మాట కూడా వాస్తవం. 

కానీ ఇక్కడ పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అన్నదే కీలకం. అలా కట్టిన వారే బలవుతారు. ఇప్పుడు జగన్ ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నారా? లేదా చాలా విషయాల్లో ఆయనను సైడ్ ట్రాక్ పట్టిస్తున్నట్లే, ఇక్కడ కూడా ఎవరైనా జగన్ ను రాంగ్ రూట్ లోకి మళ్లిస్తున్నారు. ఎవరు మళ్లించినా, మళ్లినవాడితే తప్పు అవుతుంది.

ఇదిలా వుంటే వైకాపా నాయకులు కూడా ఇది మంచి పరిణామమే అని అనుకుంటున్నారు. ప్రతీ దానికీ మరీ మొండితనానికి పోకూడదు అని జగన్ కు చెప్పాలని వుంది. కానీ వారు చెప్పలేకపోతున్నారు. ఈ వ్యవహారంలో అయినా జగన్ కు కాస్త బొప్పి కడితే లైన్లోపడతారని వారు గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు ఇక చకచకా సమీపించేసేలాగే వుంది కదా పరిస్థితి చూస్తుంటే. 

జాతీయ స్థాయిలో జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఫేవర్ బుల్ గా వుంటే భాజపా ఏ నిర్ణయం అయినా తీసుకోచవ్చు. అప్పుడు జగన్ కు అన్నీ సర్దుకునేంత టైమ్ వుండకపోవచ్చు. అప్పుడు చేతులు కాలిపోతున్నాయని గమనించి ఆకులుపట్టుకున్నా ఫలితం వుండదు. ఉద్యోగులకు జగన్ ఇస్తే అది వరం అవుతుంది. వారు పోరాడి సాధించుకుంటే విజయం అవుతుంది. ఆ తేడా, ఈ పరిస్థితి జగన్ గమనిస్తారో లేదో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?