cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జనాలను కరోనాకు వదిలిన జగన్

జనాలను కరోనాకు వదిలిన జగన్

కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అని లేదు. దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాలు అలాగే వున్నాయి. కానీ కరోనాను హ్యాండిల్ చేయడంలోనే ఒక్కో రాష్ట్రం ఒక్కోలా వ్యవహరిస్తున్నాయి. 

కరోనా ఫస్ట్ ఫేజ్ లోకేంద్రం టోటల్ కంట్రోల్ ను తన చేతిలోకి తీసుకుని రాష్ట్రాలకు డైరక్షన్ ఇస్తూ వచ్చింది. కానీ ఎప్పుడయితే రాష్ట్రాలు నిధుల కోసం కేంద్రం వైపు చూసాయో, అక్కడితో వ్యవహారం మళ్లీ రాష్ట్రాలకు వదిలేసింది. బార్ లు బ్రాందీ షాపులు తీసుకోమని చెప్పేసింది. కేంద్రం అలా చెప్పింది. రాష్ట్రాలు అలాగే చేసి, ఆ అపప్రధ మోసాయి. మోడీ మాత్రం రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చే బాధ నుంచి తప్పించుకున్నారు.

ఫస్ట్ ఫేజ్ లో మొదట ప్యారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ డైలాగును పక్కన పెడితే మిగిలిన వ్యవహారం అంతా జగన్ బ్రహ్మాండంగా చేసారు. టెస్ట్ లు చేయడం కానీ, కోవిడ్ సెంటర్ల నిర్వహణ కానీ, మార్కెట్ ల వికేంద్రీకరణ కానీ అన్నింటా శహభాష్ అనిపించుకున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కన్నా బెటర్ అనిపించుకున్నారు.

ఇప్పుడు సెకెండ్ ఫేజ్ వచ్చింది.గత అనుభవం దృష్టిలో వుంచుకుని కేంద్రం వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా రాష్ట్రాలకు వదిలేసింది. మళ్లీ లాక్ డౌన్ అంటే రాష్ట్రాలు నిధుల సంగతేమిటి? అని అడుగుతాయని, జిఎస్ టీ రిజర్వ్ తీయమంటామని అనుమానం వుండనే వుంది. అందుకే కేంద్రం వ్యవహారాన్ని రాష్ట్రాలకు వదిలేసింది. 

ఇలాంటి టైమ్ లో నిజానికి జగన్ లాంటి ముఖ్యమంత్రి మరింత గట్టిగా ఆదేశాలు జారీ చేసి, తొలిదశ లో పేరు తెచ్చుకున్నట్లే మలి దశలో కూడా మార్కులు సంపాదించాల్సి వుంది. కానీ జగన్ అస్సలు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లే కనిపించడం లేదు. మీటింగ్ లు తప్ప కార్యాచరణ్ గ్రౌండ్ లెవెల్ లో కనిపించడం లేదు. మార్కెట్ లు అన్నీజనాలతో కిటకిట లాడుతున్నాయి. ఏ మార్కెట్ ను వికేంద్రీకరించ లేదు. మరి రైతు బజార్ల విషయంలో మంత్రి కన్నబాబు ఏం చేస్తున్నారో తెలియదు.

లోకల్ గా ఏ సిటీ కి ఆ సిటీలో వ్యాపారులు వారంతట వారు టైమ్ లు సెట్ చేసుకున్నారు తప్ప ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ లేవు. సూళ్లకు సెలవులు ఇచ్చారు తప్ప బార్ లకు కాదు. ప్రభుత్వ మద్యం దుకాణల దగ్గర సోషల్ డిస్టాన్స్ అన్నది కనిపించడం లేదు. వ్యాక్సీన్ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలు చేపల మార్కెట్ ల మాదిరిగా జనాలు ఒకరి మీద ఒకరు పడి కూర్చున్నట్లు కనిపిస్తున్నాయి. 

ట్రైస్,ట్రాక్, ట్రీట్ అనే పద్దతి ని ఫస్ట్ ఫేజ్ లో పాటించారు. ఇప్పుడు అలాంటి వ్యవహారమే లేదు. అధికారులను ఆ దిశగా ఆదేశించడం అన్నది జగన్ మరిచిపోయారు. ప్రత్యేకమైన కోవిడ్ కేంద్రాల ఏర్పాట్లు లేవు. గతంలో కమ్యూనిటీ హాళ్లలో సైతం పడకలు ఏర్పాటు చేసారు. అది కూడా ముందుగా. కానీ ఇప్పుడు అలాంటి జాడలు కనిపించడం లేదు.

అన్నింటికి మించి ఆర్భాటంగా ఓపెన్ చేసిన 104, 108 వాహనాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు. రోడ్ల మీద కుయ్..కుయ్..అన్న సౌండ్ లు వినిపించడం తగ్గిపోయింది. వాటిని కాంట్రాక్టు కు తీసుకున్న అరవిందో సంస్థ ఏం చేస్తోందో తెలియదు. వాటికి బిల్లులు వస్తున్నాయో లేదో తెలియదు.

మొత్తం మీద ఫస్ట్ ఫేజ్ ను అద్భుతంగా హ్యాండిల్ చేసిన సిఎమ్ జగన్ రెండోదశను హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. పైగా లాక్ డౌన్ విధిస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయం పోతుందని చెప్పడం పరాకాష్ట. ఆదాయం ముఖ్యమా, ప్రాణాలు ముఖ్యమా అన్నది కూడా ఆలోచించకపోతే ఎందుకు ఇంక?

ప్రస్తుతానికి రోజుకు పదివేల కేసులకు కాస్త అటు ఇటుగా వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని జనం భయపడుతున్నారు. మరోపక్క ఆసుపత్రుల ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆసుపత్రులు తమ చిత్తానికి వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో జగన్ తన సంక్షేమ పథకాలనే చూసుకుంటారు. వాటి ప్రకటనలకు కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఆ డబ్బులను కోవిడ్ నివారణ చర్యలకు ఖర్చు పెట్టవచ్చు కదా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

సమస్య ఏమిటంటే జగన్ కు ఈ విషయంలో సలహా ఇచ్చేవారు ఎవ్వరూ లేరు. పార్టీ నాయకులు ఎవ్వరికీ అంత సీన్ లేదు. ఎమ్మెల్యేలు లోకల్ గా అసలు కోవిడ్ విషయాలనే పట్టించుకోవడం లేదు. అధికారులు ఏం చేయాలో ఆదేశాలు లేక వారి వారి చిత్తానికి అనుగుణంగా చేస్తున్నారు. మొత్తం మీద కోవిడ్ ఫస్ట్ పేజ్ లో తెచ్చుకున్న క్రెడిట్ ను జగన్ రెండో ఫేజ్ లో కోల్పోతున్నారన్నది వాస్తవం. 

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి