Advertisement

Advertisement


Home > Politics - Political News

జనాలను కోవిడ్ కు వదిలేసారు

జనాలను కోవిడ్ కు వదిలేసారు

సరిగ్గా ఏడాది క్రితం కరోనా అనే పేరు చెబితే ఉలికిపాటు. కరోనా పేషెంట్ అంటే టెర్రరిస్ట్ అంత భయం. కనిపించిన వారిని కనిపించినట్లు అర్జెంట్ గా కోవిడ్ సెంటర్లకు తరలింపు. వారికి అక్కడ బలవర్థక ఆహారం. కోవిడ్ సెంటర్లకు రామన్న వాళ్లను బలవంతగా ఈడ్చుకు వెళ్లడం, రోడ్డు మీద కనిపిస్తే గొడ్డును బాదినట్లు బాదేయడమే. వీధిలోనో, ఇంటిలోనో ఒక్క కేసు వుంటే చాలు కంటైన్మెంట్ జోన్లు. బ్యారికేడ్లు. ఇవన్నీ చాలక లాక్ డౌన్..ఆ బాధలు..ఆ వ్యవహారాలు వేరే.

కట్ చేస్తే ఏడెనిమిది నెలలకు అంతా సద్దు మణిగింది. జనజీవనం మళ్లీ మామూలయింది. కానీ మళ్లీ నాలుగు నెలల్లో అంతా మారిపోయింది. సీన్ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రపంచంలోనే ఇప్పుడు రెండో స్థానంలో వుంది భారత్ కోవిడ్ కేసుల లెక్కల్లో. తెలుగు రాష్ట్రాల్లో అధికారిక లెక్కల ప్రకారం మూడు నుంచి నాలుగు వేల కేసులు నిత్యం నమోదు అవుతున్నాయి. ఇవి కాక, లెక్కల్లోకి రానివి అంతకు మించి వున్నాయని టాక్ వుంది.

కానీ...పరిస్థితి మాత్రం భలే చిత్రంగానే వుంది. మూతికి మాస్క్ లు తప్ప మరే మార్పు లేదు. జనాలు యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. ప్రభుత్వం కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయక ప్రయివేటు ఆసుపత్రులు హ్యాపీగా దోచేసుకుంటున్నాయి. కీలకమైన మందులు బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోయాయి. మేళాలు, పండగలు, ఎన్నికలు, ఊరేగింపులు, సినిమాలు, స్పెషల్ షో లు, అన్నీ మామూలే. పక్కింట్లో కరోనా వున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.

పైగా మీడియా కూడా ఇప్పుడు ఎన్నికలు, రాజకీయాల వార్తలతో బిజీగా వుంది. కోవిడ్ సెంటర్లే లేవు. వున్న సెంటర్లలో ఏం జరుగుతోందో దృష్టి పెట్టే తీరుబాటులేదు. ఇదిలా వుంటే ప్రభుత్వాలు కూడా కావాలని కోవిడ్ పై హడావుడి చేయడం లేదు అనిపిస్తోంది. ఎందుకంటే కోవిడ్ హడావుడి జరిగి, లాక్ డౌన్ కు దారితీస్తే ప్రభుత్వాల ఆదాయాలు పడిపోతాయి. అసలే ప్రభుత్వాలు అన్నీ అప్పుల మీద నడుస్తున్నాయి. జీతాలు ఇవ్వడానికే కిందా మీదా అయిపోతున్నాయి. 

ఈ మధ్యనే జిఎస్ టి వసూళ్లు రికార్డు స్థాయిలో వచ్చాయని సరదా పడ్డాయి. పెట్రోలు రేట్లు భయంకరంగా పెరిగి దాని మీద వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో లాక్ డౌన్ పెడితే ఇవన్నీ ఆగిపోతాయి. పైగా జనాలకు ఆదాయం కూడా ఆగిపోతే ప్రభుత్వాలే ఆదుకోవాలి. ఇవన్నీ గతంలో జరిగినవే. తలుచుకుంటేనే ప్రభుత్వాలకు గాబరా. అందుకే మోడీ గారు గతంలో చెప్పిన సుద్దులు అన్నీ మరిచిపోయారు. పళ్లాలు వాయించడాలు,  లైట్లు వెలిగించడాలు ఇవన్నీ వదిలేసారు. 

కేవలం వ్యాక్సినేషన్..వ్యాక్సినేషన్. కానీ గమనించాల్సింది ఏమిటంటే ఇప్పటికిప్పుడు వ్యాక్సినేషన్ వేయించినా ఫలితం వుండదు. ఎందుకంటే అది పని చేయడానికి టైమ్ పడుతుంది. ఈలోగా కరోనా రావడం అన్నది లాటరీ. చాలా మందికి ఫస్ట్ డోస్ వేయించుకున్నాక వస్తోంది. కొన్ని సార్లు రెండు డోస్ లు వేయించుకున్నా వస్తోంది. ఇంకా చిత్రమేమిటంటే గతంలో కరోనా వచ్చిన వారికి కూడా ఇప్పుడు కరోనా వస్తోంది. 

మరి ఇలాంటి నేపథ్యంలో కేవలం వ్యాక్సినేషన్ మీద దృష్టి పెట్టి ప్రయోజనం ఏమిటి? వ్యాక్సీన్ ప్రయోజనం నెరవేరాలంటే పాక్షిక లాక్ డౌన్ లాంటిది అవసరం. బార్లు బార్లానే వున్నాయి. థియేటర్లు అలాగే వున్నాయి. ఎక్కడా ఏమీ తేడా లేదు. మరి కరోనా వ్యాపించకుండా ఎలా వుంటుంది? వ్యాక్సినేషన్ ఖర్చు వృధా కాకుండా వుండాలంటే వ్యాక్సీన్ వేసుకున్నవారు కనీసం రెండు వారాలు వీలయినంత జాగ్రత్తగా వుండాల్సి వుంది.

కానీ పరిస్థితులు అలా లేవు. అందుకు సహకరించడం లేదు. మొత్తం మీద జనాలను కోవిడ్ కు ప్రభుత్వాలు వదిలేసాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?