cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జనం బాగా బిజీ బాబూ

జనం బాగా బిజీ బాబూ

నిత్యం ఏదో ఒక వార్తలను నింపుకుని పత్రికలు జనం ముందుకు వస్తున్నాయి. ఛానెళ్లు కంటెంట్ కోసం కిందా మీదా అవుతున్నాయి. యూ ట్యూబ్ బాబుులు కనీసం హెడ్డింగ్ పెట్టడానికైనా ఏదో ఒకటి దొరుకుతుందా అని చూస్తున్నాయి.

వెబ్ సైట్ లు ప్రతి అయిదు నిమషాలకు ఏదో ఒక అప్ డేట్ ఇవ్వడానికి తెగ తాపత్రయ పడుతున్నాయి. ఇక్కడే మరో గమ్మత్తయిన విషయం ఏమిటంటే చాలా పత్రికలు దాదాపు చేతుల ఎత్తేసాయి. చాలా చానెళ్లు నీరసంగా నడుస్తున్నాయి. చాలా యూట్యూబ్ బాబులు దిగాలు పడ్డారు. చాలా వెబ్ సైట్లు కంటెంట్ లేక కిందకు జారిపోయాయి. 

ఇక్కడ జనం మన కోసం రెడీగా లేరు. బాగా బిజీ అయిపోయారు. కరోనా కల్లోలం తగ్గింది. వ్యాపారాలు నిలెబట్టుకోవాలి. ఉద్యోగాలు సరిచేసుకోవాలి. వ్యవసాయం బాగుంది. సినిమాలే కాదు, ఎంటర్ టైన్ మెంట్ అంటే ఇంకా చాలా వుంది. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ వుంది. ఇప్పటి నుంచీ రాజకీయాలు ఎవరికి కావాలి. అధికారం అందిన వాళ్లు ఎవరి పనుల్లో వారు బిజీ. అధికారం అందని వాళ్లు ప్రస్తుతానికి టైమ్ మనది కాదులే అనే నిరాశ.

మొత్తానికి ఇప్పుడు ఎవరికీ వార్తలు పెద్దగా పట్టడం లేదు. దాని కోసం కొంత మంది వున్నారు. వారు ఎప్పటికీ వుంటారు. ఆ కొంత మంది కోసమే ఇంతమందీ కిందా మీదా కావాలి. వారికి తప్ప మరెవరికీ ఈ వార్తలు పట్టవు. ఈ బ్రేకింగ్ లు పట్టవు. ఈ హడావుడీ పట్టదు. ఎందుకంటే జనం బాగా బిజీ బాబూ. 

ఇప్పుడు వినోదం అరచేతిలోకి వచ్చేసింది. యూ ట్యూబ్, వాట్సాప్, పల్లెల వరకు పాకేసాయి.  

పశువులు కాసుకునేందుకు పొలాలకు వెళ్తున్న పిలగాళ్లు కల్వర్టుల మీద కూర్చుని కంబైన్డ్ గా యూట్యూబ్ విడియోలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ట్రాక్టర్ల మీద దుక్కిదున్నేవాళ్లు యూ ట్యూబ్ మ్యూజిక్ లో పాటలు వింటూ పని చేసుకుంటున్నారు. నాట్లు వేసే ఆడవాళ్లు సైతం, మధ్యలో పని ఆపి, చీర ముడిలో దొపిన సెల్ ఫోన్ తీసి ముచ్చట్లు పెడుతున్నారు. వీరెవ్వరికీ రాజకీయం పట్టడం లేదు. జగన్ ఎక్కడించి అప్పు తెస్తున్నాడో ఆలోచన లేదు. కేవలం తమకు ఏమి ఇస్తున్నాడు అన్నది మాత్రమే కావాలి.

అయితే రాజకీయాలు ఎవ్వరికీ పట్టడం లేదా? అంటే, వున్నారు. ఆ బాపతు కూడా వున్నారు. కానీ రాను రాను ఆ బాపతు జనాల సంఖ్య తగ్గుతోంది. పైగా ఈ బాపతు జనాల్లో వచ్చిన మార్పు ఏమిటంటే అయిదేళ్ల పొడవునా రాజకీయాలను పట్టుకుని వేలాడడం లేదు. నాలుగేళ్లు నచ్చిన పనులు, నచ్చిన వ్యాపకాలు చేసుకుంటూ,. అయిదేళ్లు గడిచాక క్యాండిడేట్ ను బట్టి, పరిస్థితిని బట్టి పార్టీని ఎంచుకుంటున్నారు.

ఎందుకుంటే రాజకీయాలు దేనికి? తమ వ్యాపారాలు, వ్యాపకాలకు ఉపయోగపడడానికి. ఇది అందరికీ అర్థం అయిపోయింది. అందువల్ల ఆ వ్యాపకాలు, వ్యాపారాలు అలా నడిపించుకుంటేనే అయిదేళ్ల తరువాత రాజకీయం చేయగలరు. అలా కాకుండా అయిదేళ్లూ రాజకీయం చేస్తూ కూర్చుంటే, వ్యాపారాలు, వ్యాపకాలు నడవవు. 

పైకి ఎలా మాట్లాడినా, తమ నాయకుడు ఎవరు? అతని మంచి చెడ్డలు ఏమిటి? అతనితో తమ అవసరం ఏమిటి? ఇవన్నీ ఫుల్ క్లారిటీతో వున్నారు. అందువల్ల పత్రికలు, వార్తలు, వ్యాసాలు ఏవీ వీరిని అంత అద్భుతంగా ప్రభావితం చేసేయవు.  అలాంటివి అన్నీ జస్ట్ టైమ్ పాస్ వ్యవహారాలు అయిపోయాయి. ఏవైనా సరే ఇలా చదివి అలా పడేయడం. 'ఈడు ఆ పార్టీరా అలాగే రాస్తాడు అని వాళ్లు, ఆడు ఈ పార్టీరా ఇలాగే రాస్తాడు అని వీళ్లు' అనేసుకోవడం, ఫిక్స్ అయిపోవడం కామన్ అయిపోయింది. మీడియా ద్వారా భయంకరంగా జనాల్ని ప్రభావితం చేస్తాము అని అనుకుంటే భ్రమే. అలా చేయగలిగి వుంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు అతి భయంకరమైన మెజారిటీతో గెలిచేసి వుండాలి.

జనాలకు ఫుల్ క్లారిటీ వుంది. ఎన్ని ఈక్వేషన్ల కారణంగా తాము ఎటు మొగ్గాలో అన్నదాంట్లో వారికి అంతకన్నా క్లారిటీవుంది. అందువల్ల 2024 ఎన్నికల వరకు జనాలను యూ ట్యూబ్, వాట్సాప్ ఎంటర్ టైన్ చేసినట్లు, మీడియా కూడా ప్రయత్నం చేయడమే తప్ప, ఫలితం మాత్రం అంతంత మాత్రమే. 

వాస్తవం చెప్పుకోవాలంటే రాజకీయ వార్తల కన్నా సినిమా వార్తలే కాస్త చర్చలకు అన్నా నోచుకుంటాయి. కుర్రకారు టీ పాయింట్ ల దగ్గరో, బజ్జీల బండి దగ్గరో తమ తమ సినిమా పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఈ వార్తలు బాగానే వాడుకుంటారు. ఈ వార్తలను తమ స్వంత చేసుకుని, సినిమా కబుర్లు తెలియని మిత్రుల దగ్గర తమ స్వంత వంటకం అనే మాదిరిగా బాగానే వండి వారుస్తారు. 

నిజానికి ఏదైనా దినపత్రిక తీసుకుంటే రాజకీయ దుమ్మెత్తి పోసే వార్తలు అన్నీ ఓ దగ్గర పోగు పెడితే మహా అయితే రెండు మూడు పేజీలకు మించవు. మిగిలినపేజీలు అన్నీ రకరకాల సమాచారం అందించేవే. ఎందుకంటే మీడియా సంస్థలకు కూడా తెలుసు.

రాజకీయ వార్తలతో నింపితే తమ పత్రికలను జనాలు పక్కన పెడతారని. అందుకే ఏడెనిదిమిది పేజీల అదనపు సమాచారం చూపించి, వారితో కొనిపించి, వారి ఇంట్లో తెల్లవారుతూనే మూడు పేజీల రాజకీయ మురిగి కుమ్మరించడం అన్నది తమ టెక్నిక్ అని. కానీ జనం కూడా ఆ మురికి అలాగే వదిలేసి, ఈ సమాచారం చప్పరించేసి పత్రికను పక్కన పడేస్తున్నారు. 

అదీ విషయం,.

ఆర్వీ

 


×