Advertisement


Home > Politics - Political News
జనసేన 'అధికారిక' న్యూస్ ఛానెల్ ప్రారంభం

లెఫ్ట్ పార్టీలకు తెలుగులో మొన్నటివరకు 2 న్యూస్ ఛానెల్స్ ఉండేవి. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 10టీవీ నడవగా, సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో 99 టీవీ ఉండేది. ఇప్పుడీ రెండూచేతులు మారాయి. కమ్యూనిస్టుల నుంచి వేరే వ్యక్తుల చేతుల్లోకి మళ్లాయి. రీసెంట్ గా 10టీవీ డీల్ పూర్తయింది. ఈరోజు 99టీవీ కూడా వేరే వ్యక్తుల హస్తగతమైంది.

99టీవీని తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. ఈరోజు అధికారికంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఈయన జనసేన పార్టీలో ఉన్నారు. పవన్ కు అత్యంత సన్నిహితుడు. స్వయంగా పవన్ తెరవెనక పావులు కదిపి చంద్రశేఖర్ ద్వారా 99 టీవీని కొనుగోలు చేయించారట. 

పవన్ తల్లిపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదాన్ని ఓ ఛానెల్ పదేపదే ప్రసారం చేసింది. దీనిపై అప్పట్లో పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు, తన పార్టీకి సొంతంగా ఓ ఛానెల్ ఉండాలనే ఆలోచన అప్పుడే పవన్ కు తట్టింది. ఆ వెంటనే పావులు కదిపిన పవన్, వ్యూహాత్మకంగా వామపక్షాలకు మద్దతిచ్చారు. ఆ వెంటనే తెరవెనక ఈ కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. 
99టీవీ ఇలా చేతులు మారిందో లేదో అలా ఛానెల్ లో జనసేన ప్రమోషన్ మొదలైంది. నిజానికి పవన్ కొనాలనుకున్న ఛానెల్ ఇదికాదు. ఆయన 10టీవీని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించారు. ఈ మేరకు నిమ్మగడ్డ ప్రసాద్ ను కూడా రంగంలోకి దించారు. కానీ ఆర్థిక లావాదేవీల్లో లీగల్ సమస్యలు ఎదురుకావడంతో.. ఆ వెంచర్ నుంచి తప్పుకున్న పవన్, చంద్రశేఖర్ ద్వారా 99టీవీని దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 

99ఛానెల్ ను అధికారికంగా కొనుగోలు చేసిన చంద్రశేఖర్ కు ఇప్పటికే పలు వెబ్ ఛానెల్స్ ఉన్నాయి. వాటిలో జనసేన ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు టీవీ ఛానెల్ కూడా జనసేనకు అందుబాటులోకి వచ్చింది. పేరుకు ఇది చంద్రశేఖర్ ఛానెల్ అయినప్పటికీ.. అనధికారికంగా జనసేనదే. రాబోయే ఎన్నికల్లో ఈ ఛానెల్ జనసేనకు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.