Advertisement


Home > Politics - Political News
ఉందిలే పొత్తుల కాలం ముందుముందునా...

ఏపీలో జనసేన పార్టీ ఏ పార్టీతో లేదా పార్టీలతో పొత్తు పెట్టుకుంటుంది? ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని ఇప్పటివరకు అందరూ అనుకున్నారు. జనసేనతో పొత్తుకు కమ్యూనిస్టులు కూడా ఎప్పటినుంచో ఆసక్తి చూపిస్తున్నారు. ఆ పార్టీతో పొత్తు ఉంటుందని సీపీఐ చాలాసార్లు చెప్పింది. జనసేన విధానాలను బట్టి పొత్తుపై ఆలోచిస్తామని సీపీఎం అన్నది. కాని జనసేనతో కలిసే పోటీ చేయాలనేది రెండు పార్టీల ఆలోచన.

ఇప్పటివరకు పలు పోరాటాల్లో, కార్యక్రమాల్లో జనసేన, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పనిచేశాయి. పవన్‌, ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు పలుమార్లు చర్చలు జరిపారు. అయితే పవన్‌ కమ్యూనిస్టులతో కచ్చితంగా పెట్టుకుంటానని ఎప్పుడూ చెప్పలేదు. ఒంటరిగా పోటీ చేస్తామని కొన్నిసార్లు చెప్పాడు. పొత్తుల కోసం ఇప్పటివరకు తలుపులు తెరవలేదని జనసేన తాజాగా ప్రకటించింది. వెయిట్‌ అండ్‌ సీ అంటోంది.

ఎన్నికల ముందుండే రాజకీయ పరిస్థితినిబట్టి నిర్ణయం తీసుకుంటామని జనసేన నేతలు చెప్పారు. ఏ పార్టీనీ తాము వ్యతిరేకించడంలేదని, వైకాపా, ఇతర పార్టీలనూ పరిగణనలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలపై ఆలోచిస్తామంటున్నారు. ఇప్పుడే పొత్తుల గురించి ఆలోచించడం తొందరపాటు అవుతుందంటున్నారు. ఇక జనసేన మేనిఫెస్టో తయారవుతోంది. దాంట్లో విద్య, ఆరోగ్యం, ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తాను ప్రతిపాదించిన ఏడు సిద్ధాంతాలను జనంలో ప్రచారం చేయాలని పవన్‌ నాయకులకు చెప్పాడు.

జనసేన పార్టీ మూల సిద్ధాంతాలంటూ కొన్ని అభిప్రాయాలు చాలాకాలం క్రితం ట్విట్టర్‌ ద్వారానే తెలియచేశాడు పవర్‌స్టార్‌. క్లుప్తంగా నీతిసూత్రాల్లా ఉన్న ఈ సిద్ధాంతాలు సామాన్యులకు అర్థమవుతాయా అనే సందేహం కలుగుతోంది. పవన్‌ సిద్ధాంతాలివి: 1.కులాలను కలిపే ఆలోచనా విధానం 2.మతాల ప్రసక్తిలేని రాజకీయం 3.భాషలను గౌరవించే సంప్రదాయం 4.సంస్కృతులను కాపాడే సమాజం 5.ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. 6.పర్యావరణ పరిరక్షణ 7.అవినీతి నిర్మూలనకు రాజీలేని పోరాటం. ఇవి పార్టీకి పునాదులని, మూల సిద్ధాంతాలన్నారు.

భాషలను గౌరవించడం, సంస్కృతులను కాపాడటం, అవినీతి నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, జాతీయవాదం.. ఇవి బాగానే ఉన్నాయి. కులాలను కలిపే ఆలోచన విధానం ఏమిటి? కుల నిర్మూలన, కులరహిత సమాజం అనే కమ్యూనిస్టు పార్టీల సిద్ధాంతం అర్థమవుతోంది. కాని కులాలను కలపడం ఏమిటి? ఇది కూడా కుల నిర్మూలనకు సంబంధించిందేనా? మతాల ప్రసక్తిలేని రాజకీయం అన్నారు. ఇదేమిటి? కులాల, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టకూడదు. వారిని రెచ్చగొట్టకూడదు. కాని ఈ కాలంలో కులాల, మతాల గురించి ఆలోచించకుండా, వాటి ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యమా?

కుల మతాల రహితంగా ఎలాంటి రాజకీయాలు చేయదల్చుకున్నాడో పవన్‌ వివరించాలి. ఇప్పటి రాజకీయమంతా ఓటు బ్యాంకు చుట్టూ తిరుగుతుండటం చూస్తున్నాం. ఎన్నికల్లో అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడంలో, పార్టీలో పదవులు ఇవ్వడంలో, అధికారం వస్తే మంత్రి పదవులు ఇవ్వడంలో.. ఇలా అనేక విషయాల్లో కులాలను, మతాలను పరిగణనలోకి తీసుకోవల్సివస్తుంది. పవన్‌ తన సిద్ధాంతాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలిగితే ప్రయోజనం ఉంటుంది.