Advertisement

Advertisement


Home > Politics - Political News

జనసేన నోట తేదేపా పాట

జనసేన నోట తేదేపా పాట

కోవర్డు లాంటి నెగిటివ్ పదాలు వాడడం అనవసరం కానీ, మన వాయిస్ ను మన వైరిపక్షంలో వినిపించగలిగే ఏర్పాటు వుండడం చాలా అవసరం. రాజకీయ పార్టీలు అన్నింటి సంగతి అలా వుంచితే చంద్రబాబు నాయుడుకు ఇలాంటి ఏర్పాటు చేసుకోవడం మొదటి నుంచీ అలవాటు. ఆయన తన మనుషుల్ని చక్కగా వేరే పార్టీలోకి పంపిస్తారని ఆ విధంగా రకరకాల అవసరాలు నెరవేర్చుకుంటారని ఎప్పటి నుంచో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

తెలంగాణ ఉద్యమనేపథ్యంలో కూడా ఇలాంటి వ్యవహారాలు చేసారని, కొందరి చేత వేరేపార్టీ పెట్టించడం, తెరాసలోకి కొందరిని పంపించడం చేసారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా బాబుగారి మనిషే అంటారు. ఇక భాజాపాలోకి ఇటీవల జంప్ అన్న చాలా మంది లీడర్లు బాబుగారు పంపితేనే వెళ్లారు అంటారు. అంతెందుకు కామినేని శ్రీనివాస్ ను ఆయనే భాజపాలోకి పంపి,టికెట్ ఇప్పించి, గెలిచాక పొత్తు ధర్మం అంటూ మంత్రిని చేసారంటారు.

సరే ఇవన్నీ ఇలా వుంటే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికీ అనుమానాలు వున్నాయి. ఆయన బాబుగారి ఇలాకాలో మనిషే అనే కిట్టనివారో, నచ్చనివారో అంటూ వుంటారు. ఆయన వ్యవహారశైలి కూడా అలాగే వుంటూ వుంటుంది ఒక్కోసారి. 2014 నుంచి 2018 వరకు పవన్ కళ్యాణ్ దాదాపు చంద్రబాబు కు విశ్వాసపాత్రమైన మిత్రుడుగానే వున్నారు. పవన్ కాలు కదపాలంటే బాబుగారు సకల ఏర్పాట్లు చేసేవారు. ప్రత్యేక విమానాలు, మంత్రుల స్వాగతాలు ఇలా వుండేది వ్యవహారం. 

కానీ చిత్రంగా మరి బాబుగారే ప్రభుత్వ వ్యతిరేక ఓటును అటు మళ్లించే ఆలోచనతో చేసారో, పవన్ కళ్యాణ్ నే వేరయ్యారో ఇద్దరూ వేరు వేరు అయ్యారు. కానీ జనం మాత్రం పవన్ ను నమ్మలేదు. ఎన్నికల టైమ్ లో లోపాయకారీ వ్యవహారాలను పసిగట్టారు. సింపుల్ గా పక్కన పెట్టారు. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా కూడా మంగళహారతి పాడేసారు.

ఆ తరువాత పవన్ అధికారికంగా భాజపాతో పొత్తు పెట్టుకున్నారు. సుజనా చౌదరి అండ్ 'దేశాన్ని' వీడి భాజపాకు వెళ్లడం వెనుక బాబుగారు వున్నారనే గ్యాసిప్ ల్లాగే ఇక్కడా ఆయనే వుండి వుంటారనే అనుమానాలు కూడా వున్నాయి. అదేమో కానీ పవన్ వైఖరి అప్పుడప్పుడు అదే నిజమనిపించేలా వుంటూ వుంటుంది. మొన్నటికి మొన్న ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వైఖరి చూసిన వారికి, రెండు చోట్లా జనం నాడి తెలిసినా పవన్ మారలేదు అని క్లారిటీ వచ్చేసింది. 

లేటెస్ట్ గా మూడు రాజధానుల వ్యవహారం మీద హైకోర్టుకు జనసేన తన అఫిడవిట్ ను సమర్పించింది. ఇది పేరుకు జనసేన అఫిడవిట్ అయినా తెలుగుదేశం ఆఫీసులో తయారైంది అని అనిపించేలా వుంది. అమరావతికే కట్టుబడి వున్నామని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, వికేంద్రీకరణ కన్నా స్థిరమైన అభివృద్ధి ముఖ్యమన్నది తమ విధానం అని జనసేన అఫిడవిట్ దాఖలు చేసింది. 

పైగా అక్కడితో ఆగలేదు..'' ప్రతీకారం ధ్యేయంగా, ద్వేషమే ప్రాతిపదికగా సాగే పాలన, విభజించి పాలించే కుట్రలు నాగరిక సమాజానికి తగవు.ఒకే రాజధానితో 13 జిల్లాలు అభివృద్ది సాధించాలి. ప్రభుత్వాలు మారినపుడల్లా ప్రభుత్వాలు ప్రభుత్వ విధానాలు మార్చకూడదు. పాలనా వికేంద్రీకరణ చట్టం, సిఆర్డీఎ రద్దు చట్టం రాజ్యంగ విరుద్ధమని ప్రకటించాలి' అంటూ జనసేన తన అఫిడవిట్ దాఖలు చేసింది. 

ఈ వాదన ఎవరిదో? జనాలకు తెలిసిందే. ఇదే ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న వాదన కూడా. ఇప్పుడు జనసేన అఫిడవిట్ కూడా ఇదే. కానీ అదే జనసేన పొత్తు పెట్టుకున్న భాజపా ఐడియాలజీ వేరుగా వుంది. అమరావతి రాజధానే అంటోంది కానీ కర్నూలులో హైకోర్టు కావాలంటోంది. పైగా వీలయింత న్యూట్రల్ గా వుంటోంది. మరి అదే పార్టీతో పొత్తు పెట్టుకుని పవన్ మాత్రం తేదేపా ఐడియాలజీ వల్లెవేస్తున్నారు. 

దీనికి కోవర్టు లాంటి నెగిటివ్ పదాలు వాడడం అనవసరం. మన వాయిస్ ను అక్కడ వినిపించే మిత్రుడు లాంటి పాజిటివ్ పదాలు వాడుకుంటే చాలు. 

ఆర్వీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?