Advertisement


Home > Politics - Political News
ఇదే పాటా ప్రతి చోటా...!

ఏపీ టీడీపీ ఎంపీల్లో ఇద్దరు ముగ్గురు 'వీడు తేడా' అనే సినిమా టైటిల్‌ మాదిరిగా తేడాగా ఉంటారు. వీరిలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరీ తేడాగా ఉంటారు. ఆయన ఎవరినైనా పొగిడినా, తిట్టినా చాలా పీక్‌ స్టేజ్‌లో ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి కూడా ఇలాగే మాట్లాడతారు. అయినా బాబుగాని, ఇతర నాయకులుగాని ఏం కామెంట్‌ చేయరు. ఆయనంతే అన్నట్లుగా వదిలేస్తుంటారు.

ఆయనతో పెట్టుకుంటే పరిస్థితి మామూలుగా ఉండదని వారికి తెలుసు. ఒక్కోసారి చంద్రబాబును విపరీతంగా పొగుడుతారు. ఒక్కోసారి విమర్శలు చేస్తారు. జేసీ ప్రత్యేకత ఏమిటంటే పొగిడినా విమర్శించినట్లుగానే ఉంటుంది. మంచో చెడో ఉన్న విషయం మొహం మీదనే చెప్పేస్తారు. ఇక తాను ఏదైనా విషయం నమ్మితే దాన్ని వదిలిపెట్టకుండా చెబుతూనే ఉంటారు. విచిత్రంగా అవి నిజమవుతూ ఉంటాయి. 'ఇదే పాట ప్రతిచోటా ఇలాగే పాడుకుంటాను' అని పాత సినిమాలో ఓ పాట వుంది. జేసీ ఇదే టైపు.

ఇదివరకు 'ప్రత్యేక హోదా రాదు' అని పలుమార్లు చెప్పారు. అదే నిజమైంది. ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు విలువలేదని చాలాసార్లు చెప్పారు. అదీ వాస్తవమేనని కనబడుతూనే ఉంది. ఈ విషయం తాజాగా మరోసారి నొక్కి వక్కాణించారు. రైల్వేజోన్‌ విషయంలో టీడీపీ ఎంపీలు ఏమీ చేయలేరని కుండ బద్దలుకొట్టారు. 'వీళ్లు కూరలో కరివేపాకులాంటోళ్లు. చెయ్యెత్తమంటే ఎత్తాలి, దింమంటే దించాలి' అని బహిరంగంగానే అన్నారు.

రైల్వేజోన్‌ విషయంలో ఎంపీలు చేసేది ఏమీలేదన్న జేసీ మాటలు వింటే ఇది శూన్యహస్తమేననే అభిప్రాయం కలుగుతోంది. 'మనిషికి కొంచెం భయముంటే అన్నీ వస్తాయి. భయం లేకపోతే విచ్చలవిడితనం పెరుగుతుంది' అన్నారు. అంటే ప్రధానికి చంద్రబాబంటే భయంలేదని అనుకోవాలా? లేదా చంద్రబాబు బీజేపీతో పొత్తు వదులుకోరు కాబట్టి భయపడక్కర్లేదని అనుకుంటున్నారా?

పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ప్రభుత్వాన్ని దబాయించి మాట్లాడతారని, కాని టీడీపీ ఎంపీలకు ఆ అవకాశం లేదన్నారు. బీజేపీ మిత్రపక్షం కాబట్టి మాట్లాడొద్దని బాబు తమ నోరు నొక్కేస్తున్నారని కొంతకాలం క్రితం చెప్పారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు అసలు విలువ లేదన్నారు. టీడీపీ సర్కారులో ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాదు, మంత్రులకు సైతం ఎలాంటి అధికారాలూ లేవన్నారు. రైల్వేజోన్‌ రాదనే జేసీ అభిప్రాయం నిజమయ్యే సూచనలున్నాయి.

ప్రత్యేక హోదా విషయం అసలు చర్చలోనే లేదని విశాఖపట్నం ఎంపీ హరిబాబు తాజాగా మీడియాకు చెప్పారు. రైల్వేజోన్‌ విషయం పరిశీలనలో ఉందన్నారు. గత మూడున్నరేళ్లుగా ఇదే మాట మీద ఉంది బీజేపీ, మోదీ సర్కారు. బయటకు పరిశీలనలో ఉందని చెబుతున్న హరిబాబు ఆఫ్‌ ది రికార్డుగా రైల్వేజోన్‌ రాదనే సంకేతాలిస్తున్నారని ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ తెలియచేసింది. విశాఖకు రైల్వేజోన్‌ ఇచ్చేందుకు ఒడిశా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని హరిబాబు చాటుగా చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో అక్కడ గెలవాలనుకుంటున్న బీజేపీ జోన్‌ వ్యవహారం పరిశీలనలో ఉందంటూ నాటకాలాడుతోంది. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏపీ సర్కారు గట్టిగా పోరాటం చేసిందీ లేదు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు రైల్వేజోన్‌ ఊసే లేదు. రైల్వేజోన్‌ గురించి దాదాపు అందరూ మర్చిపోయిన పరిస్థితిలో రైల్వేశాఖ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఓ కబురు అందిందని వార్త వచ్చింది.

విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయలా? వద్దా? అనే విషయం అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రైల్వేజోన్‌ విషయం ఏమైందంటూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఈమధ్య అడిగినప్పుడు నివేదిక అందిందని సర్కారు సమాధానం ఇచ్చింది. ప్రస్తుతానికి దీని కథ ఇక్కడ ఆగింది. రైల్వేజోన్‌ ఏర్పాటవుతుందా? కాదా? అనేది భవిష్యత్తులో తేలాల్సిందే. ఆ నివేదిక ప్రస్తుతం పరిశీలనలో ఉందట...! అది పరిశీలించి అందులో ఏముందనేది చెప్పేలోగా ఎన్నికలు రావొచ్చు.