Advertisement


Home > Politics - Political News
కర్ణాటక: అన్ని సీట్లు గెలిచినా ఆనందం లేదు!

జేడీఎస్‌కు దక్కింది బ్రహ్మాండమైన విక్టరీనే. దాదాపు 40 సీట్లలో విజయం దిశగా సాగుతున్నారు జేడీఎస్ పార్టీ అభ్యర్థులు. గత ఎన్నికలతో పోలిస్తే ఇది జేడీఎస్‌కు బ్రహ్మాండమైన విజయం ఇది. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఈ పార్టీకి ఇన్ని సీట్లు దక్కుతాయని అంచనా వేయలేదు. ముప్పై సీట్ల వరకూ గెలవవచ్చు అని సర్వేలు అంచనా వేస్తే జేడీఎస్ మాత్రం ఏకంగా 40 సీట్లలో విజయం దిశగా సాగుతూ జయకేతనం ఎగరేస్తోంది.

చాన్నాళ్ల తర్వాత దేవేగౌడ పార్టీకి ఇన్ని సీట్లు దక్కాయి. ఇంత హ్యాపీయెస్ట్ న్యూసే వచ్చినా జేడీఎస్‌కు మాత్రం ఆనందంలేదు. ఊహించిన వాటికన్నా ఎక్కువ సీట్లే దక్కినా ఆ పార్టీ వాళ్లు ఆనందంగా లేరు. దానికంతా కారణం.. చక్రంతిప్పే అవకాశం మిస్ కావడమే! హంగ్ తరహా పరిస్థితి ఏర్పడుతుంది, జేడీఎస్ ఎవరికి మద్దతునిస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అని మొదటి నుంచి వార్తలు వచ్చాయి.

అయితే జేడీఎస్ కు సీట్లైతే వచ్చాయి కానీ చక్రంతిప్పే అవకాశం మాత్రం రాలేదిప్పుడు. భారతీయ జనతా పార్టీకి మినిమం మెజారిటీ దక్కినట్టే. ఒకటో రెండో సీట్లు తగ్గినా.. ఇద్దరు స్వతంత్రులను బీజేపీ లాగేస్తుంది. అలాగే రెండు సీట్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నెలాఖరులోనే ఆ ఎన్నికలు ఉంటాయి. ఎలాగూ వాటిల్లో బీజేపీకి అనుకూల ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది. ఏ రకంగా చూసినా బీజేపీ ఎవరి మీదా ఆధారపడకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు.

సో.. జేడీఎస్ సాధించిన సీట్లకు వీసవెత్తు విలువలేదు. ప్రభుత్వ ఏర్పాటులో పాత్రలేనప్పుడు జేడీఎస్ లాంటి ప్రాంతీయ పార్టీకీ ఈ సీట్లతో ప్రయోజనం శూన్యం. ఎలాగూ బీజేపీకి వచ్చింది బోటాబోటీ మెజారిటీనే కాబట్టి.. కాంగ్రెస్ తో చేతులు కలిపి జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు కదా అనొచ్చు. అయితే అది దురాశే. అలాంటి ప్రయత్నమే జేడీఎస్ చేస్తే ఈ పార్టీని బీజేపీ వాళ్లు నిలువునా చీల్చే అవకాశం ఉంది.

ఇప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి, జేడీఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించవచ్చు. రెండు మూడు రోజుల్లోనే కొంతమంది ఇలాంటి పనిచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో.. అనుకున్నంత విజయం సాధించినా జేడీఎస్‌కు ఆనందం లేకుండా పోయిందిప్పుడు.