Advertisement

Advertisement


Home > Politics - Political News

తొలి అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై కొణిజేటి రోశయ్య లౌక్యం

తొలి అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై కొణిజేటి రోశయ్య లౌక్యం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి లోక్‌ సభతో పాటు జరిగిన 2009 ఏప్రిల్‌–మే సాధారణ ఎన్నికల సమయానికి– ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్యగారు అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారిని ఒప్పించి శాసనమండలికి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో మాదిరిగా ఈసారి చీరాల నుంచి అసెంబ్లీకి పోటీకి దిగి, ప్రచారంలో తిరిగే ఓపిక తనకు లేదనడంతో రోశయ్యకు ఆ అవకాశం ఇచ్చారు వైఎస్‌. నేను సాక్షి దినపత్రిక ఎన్నికల స్పెషల్‌ పేజీల కోసం పనిచేస్తున్న రోజులవి. 

ప్రతిరోజూ ఏపీ ఎన్నికల సమరం పేజీల్లో ఓ రాష్ట్ర నేత రాజకీయ జీవిత విశేషాలు ఇచ్చేవాళ్లం. సీసీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్సులు కె. నారాయణ, బీవీ రాఘవలుతోపాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల గురించి కూడా ఆసక్తికర రీతిలో వారి ప్రొఫైల్స్‌ను సీనియర్‌ రిపోర్టర్లు వారిని కలిసి రాసుకొచ్చేవాళ్లు.  ఈ క్రమంలోనే రోశయ్య గురించి కూడా రాసిన కాపీని ఓసారి చూడాలని– అప్పటి ఎన్నికల డెస్క్‌ ఇన్‌చార్జి సరికొండ రత్నచలపతిరావు గారు నాకు ఇచ్చారు. ఆ కాపీలో రోశయ్యగారి రాజకీయ ప్రయాణంలో కీలక మలుపులన్నీ చక్కగా రాశారు. మొదట 1968లో ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్‌ కు (కౌన్సిల్‌)కు ఎన్నికయ్యారని, తర్వాత ఎప్పుడెప్పుడు ఏఏ చట్టసభలకు గెలిచిందీ వరుసలో రాశారు.

అయితే, గోగినేని రంగనాయకులు (ప్రొ. ఎన్‌ జీ రంగా)గారి రాజకీయ శిష్యరికంలో ఎదిగారని చెప్పే ఈ వైశ్య నాయకుడు తన ఎన్నికల పోరాటాన్ని ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా 1960ల చివర్లో (1967లోనా లేక అంతకు ముందా అనేది నాకు గుర్తు లేదు) ఆయన గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారని చదివాను. బాగా గుర్తుంది. ఈ విషయం రాయలేదేంటి? అని ఆ సాక్షి రిపోర్టరును అడిగాను. ఆతను వెంటనే, ‘ఉండండి, రోశయ్యగారినే అడిగి విషయం తెలుసుకుంటా? ఆయనైతే  తన తొలి ఓటమి గురించి నాకు వెల్లడించ లేదు,’ అంటూ ఆ విలేఖరి పక్కకెళ్లి రోశయ్యతో తన మొబైల్‌ నుంచి మాట్లాడి రెండు నిముషాల్లో నా దగ్గరకు వచ్చాడు నవ్వుతూ. 

‘‘రోశయ్య గారికి మీరు చెప్పిన ఆయన 1967 నాటి తొలి అసెంబ్లీ ఎన్నికల ఓటమి విషయం గుర్తులేదంటండీ. ‘నాకైతే ఆ సంగతి గుర్తులేదు. ఈ విషయం చెప్పిన మీ సీనియర్‌ జర్నలిస్టుకు మంచి జ్ఞాపకశక్తి ఉంటే గనక ఆయన చెప్పిన విధంగానే నా ఓటమి సంగతి అందులో చేర్చండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.  మొదటి ఎన్నికల్లోనే నేనోడిపోయినట్టు నాకు నిజంగా జ్ఞాపకం లేదు,’ అని రోశయ్య గారు చెప్పారు,’’ అని ఆ రిపోర్టురు రోశయ్యగారి తొలి ఓటమి ముచ్చట గురించి వివరించాడు. ఎన్నెన్నో ఆర్థిక విషయాలు గణాంకాలు సహా చెప్పే రైతు–వ్యాపారి–పారిశ్రామికవేత్తగా లోక్‌ సభ సభ్యుల వివరాలలో తనను తాను వర్ణించుకున్న రోశయ్యగారు ఎంత లౌక్యం ప్రదర్శించారు? 

అబద్ధమాడకుండా, తన నోట చెప్పకుండా తన ఓటమి గురించి ముఖ్యమంత్రి కొడుకు పత్రికలో వచ్చేలా రాయడాన్ని అనుమతించిన తీరు మాకు మొదట ఆశ్చర్యం కలిగించింది. వెంటనే రోశయ్య గారి తొలి ఎన్నికల పరాజయం విషయం అందులో చేర్చాము. అప్పటికి ఆయన 76 ఏళ్లకు దగ్గరలో ఉన్నారు. మతి మరుపు కూడా రాలేదు. అయినా, ‘ఈనాడు’ వంటి కాస్త పద్ధతి గల దినపత్రికలో సైతం పెద్ద నాయకుల రాజకీయ విశేషాలు రాస్తున్నప్పుడు వారి తొలి ఎన్నికల ఓటముల ప్రస్తావన తీసుకురాకుండా (సదరు నేతలు ఆయా విలేఖరులను అడగకపోయినా) వారి గెలుపుల గురించే రాయడం ఈ రోజుల్లో ఆనవాయితీగా మారిపోయింది.

నాంచార‌య్య మెరుగుమాల‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?