Advertisement


Home > Politics - Political News
జెపి లక్ష్యం ఎన్నికలా? ప్రజాచైతన్యమా?

ఉమ్మడి రాష్ట్రంలో పాపులరైన, హవా కొనసాగించిన రాజకీయ నాయకుల్లో కొందరు రాష్ట్ర విభజన తరువాత తెర చాటుకు వెళ్లిపోయారు. తెర మరుగైనవారంతా అపజయాలు మూటగట్టుకున్నవారే. రాజకీయాల్లో జయాపజయాలు సహజం. ఆ విషయం తెలిసినా ఎందుకో మౌనంగా, క్రియాశూన్యంగా ఉండిపోయారు. ఎన్నికల సమయానికి తెర ముందుకు వస్తారో, అలాగే ఉండిపోతారో తెలియదు.

ఈ మౌన నాయకుల్లో చాలా కాలం తరువాత 'లోక్‌సత్తా' వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే కమ్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ నోరు విప్పారు. ఏదో నామమాత్రంగా మాట్లాడటమో, ఓ ప్రకటన ఇవ్వడమో చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే వంద రోజులపాటు (సుమారుగా మూడు నెలలు) పర్యటిస్తానని చెప్పారు జెపి. ఇది పాదయాత్రా? వాహనంలో తిరుగుతారా? తెలియదు. జెపి యాత్ర లక్ష్యమేమిటి? మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అందుకే ప్రజలను కలుసుకుందామనుకుంటున్నారా? ఆ విషయం స్పష్టం చేయలేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రజలకు విద్య, వైద్యం, ఇతర మౌలిక సౌకర్యాలు అందడంలేదని, ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని జెపి చెప్పారు. దీనికి ఆయన ఓ లెక్క కూడా చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 39లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఏడాదిలో 250 పనిదినాలను, రోజుకు ఎనిమిది పని గంటలను పరిగణనలోకి తీసుకుంటే గంటకు 2వేల కోట్లు ఖర్చవుతున్నాయి.

నిమిషానికి 33కోట్లు ఖర్చవుతున్నాయి. ఇంత ఖర్చు పెడుతున్నా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. జెపి ఉన్నతాధికారిగా పనిచేశారు కాబట్టి ప్రభుత్వాల పనితీరును బాగా విశ్లేషించగలరు. ఇదంతా ప్రజలకు వివరించడానికే ఆయన ప్రజల దగ్గరకు వెళుతున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు పర్యటించాలనుకున్నారు? ఆయన సొంత రాష్ట్రం ఏపీ కాబట్టి. బహుశా అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా?

ఒకసారి హైదరాబాదులోని కూకట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జెపి, మరోసారి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక ఆ తరువాత మౌనంగా ఉండిపోయారు. ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతిని చూసి అసహ్యించుకొని, దాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు జయప్రకాశ్‌ నారాయణ. ఇందుకోసం ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశారు.

లోక్‌సత్తా పేరుతో స్వచ్ఛంద సంస్థను 1996లో ప్రారంభించారు. దాన్ని 2006లో రాజకీయ పార్టీగా మార్చారు. 2008లో తొలిసారిగా ఎన్నికల క్షేత్రంలోకి దిగారు. ఒకసారి తానొక్కడే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. జనతా పార్టీ మాదిరిగా లోక్‌సత్తా పార్టీ కూడా ప్రయోగమే. కాని ఇదీ దెబ్బ తిన్నది.  జెపి ఐఎఎస్‌ అధికారిగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ప్రజలు ఆయన్ని దేవుడిలా చూశారంటే అతిశయోక్తి కాదు.

జిల్లా కలెక్టరుగా, ఇతర పదవుల్లో ఆయన చేసిన సేవలను ఆయా ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఆయన పదవి వదిలేసి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టినప్పుడు ప్రజలు ఆదరించారు. కొత్త రాజకీయాల గురించి, ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆయన చెప్పింది విన్నారు. విలువలతో కూడిన రాజకీయాలంటే ఏమిటో తెలుసుకున్నారు. విద్యావంతులకు, మధ్యతరగతి వారికి, దేశ రాజకీయాలను అసహ్యించుకునేవారికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనుకునేవారికి జేపీ ఆశాకిరణంలా కనబడ్డారు.

లోసత్తాను రాజకీయ పార్టీగా మార్చకముందు అదొక స్వచ్ఛంద సంస్థగా చేపట్టిన కార్యక్రమాలకు యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఎక్కడ చూసినా లోక్‌సత్తా పేరు మారిపోయింది. యువతకు కొత్త విషయాలు తెలిశాయి. కొత్త ఆలోచలను కలిగాయి. ఆ రోజుల్లో లోక్‌సత్తాకు వచ్చిన ఆదరణ చూసిన రాజకీయ పార్టీల నాయకులు ఇదొక ప్రభంజనమై తమ కొంప కొల్లేరు చేస్తుందని భయపడ్డారు.

కాని వారి భయానికి విరుద్ధంగా జరిగింది.  ప్రజలు జేపీని వ్యక్తిగా అభిమానించారు. కాని నాయకునిగా అంగీకరించలేదు. ఆయనకు మాస్‌లో పునాదులు లేవు. చెప్పే కొత్త రాజకీయాలు, విలువలతో కూడిన పాలిటిక్స్‌ విద్యావంతులకు, మధ్యతరగతివారికి అర్ధమయ్యాయేమోగాని అట్టడుగు వర్గాలకు అర్థం కాలేదు. ఇప్పుడు లోక్‌సత్తా  ఉనికి ఏమిటో అర్థం కాకుండా ఉంది. గత ఎన్నికల్లో జేపీ చేసిన విన్యాసాలు ఆయనపై గౌరవం తగ్గించాయి.

మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలవడానికి నానా తిప్పలు పడ్డారు. సినీ హీరో పవన్‌ కళ్యాణ్‌ తమ పార్టీలో చేరితే పగ్గాలు ఆయన చేతికే ఇస్తానన్నారు. బీజేపీని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నించారు. నరేంద్ర మోదీ బొమ్మతో ఎన్నికల ప్రచార ప్రకటనలు వేయించుకున్నారు కూడా. ఆయన ఎంత తాపత్రయపడినా ప్రజలు తిరస్కరించారు. మరి వచ్చే  ఎన్నికలనాటికి ఏమైనా చేయాలనుకుంటున్నారా?