cloudfront

Advertisement


Home > Politics - Political News

జస్ట్‌ ఆస్కింగ్‌.. ఇదెక్కడి రాజకీయం.?

జస్ట్‌ ఆస్కింగ్‌.. ఇదెక్కడి రాజకీయం.?

సినీనటుడు ప్రకాష్‌ రాజ్‌ కోరుకుంటే ఏదన్నా పార్టీలో చేరి, టిక్కెట్‌ సంపాదించగలడు. కానీ, అలా ఓ పార్టీ ముద్ర తన మీద పడకూడదన్నది ఆయనగారి భావన. మరి, ఏ రాజకీయ పార్టీ ప్రభావం తన మీద పడకుండా వుండాలంటే ప్రకాష్‌ రాజ్‌ ఏం చేయాలి.? ఇండిపెండెంట్‌గా వ్యవహరించాలి. కానీ, ఆ ఇండిపెండెంట్‌ అనేపదాన్ని కేవలం పోటీకి మాత్రమే ఉపయోగించబోతున్నాడు ప్రకాష్‌ రాజ్‌. వివిధ రాజకీయ పార్టీలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయి. అవును, ఆయన రాజకీయ వ్యూహాలు అలాగే కన్పిస్తున్నాయి.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ.. ఇలా చాలా భాషల్లో సినిమాలు చేసిన ప్రకాష్‌ రాజ్‌ అందరికీ సుపరిచితుడే. 'ముక్కుసూటి వైఖరి' అంటూ, పలు అంశాలపై గళం విప్పుతుంటాడు. ఈ క్రమలో కొందరి దృష్టిలో ఆయన 'మూర్ఖుడు' అన్న ఇమేజ్‌నీ సంపాదించేసుకున్నాడు. సినీ పరిశ్రమలో ప్రకాష్‌ రాజ్‌ ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా వార్తల్లోకెక్కుతుంటాడు. ఈ మధ్య రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అవుతున్నాడు.. తేడా అంతే. ఆ రాజకీయ వివాదాలు కూడా, రాజకీయం అనే దోమ కుట్టినప్పటినుంచే. 

కర్నాటక నుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తాడని ఇటీవలే ప్రకాష్‌ రాజ్‌ ప్రకటించేసిన విషయం విదితమే. పలు పార్టీల నుంచి మద్దతు కూడగట్టేందుకు ప్రకాష్‌ రాజ్‌ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో 'మా పార్టీలో చేరొచ్చు కదా..' అన్న ప్రతిపాదనలూ ఆయన ముందుకొస్తున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ అడిగింది, ఆమ్‌ ఆద్మీ పార్టీ కోరింది, కాంగ్రెస్‌ పార్టీ కూడా విజ్ఞప్తి చేసింది. కానీ, ప్రకాష్‌ రాజ్‌ మాత్రం 'నేను ఇండిపెండెంట్‌ని మాత్రమే' అంటున్నాడు.

ఏమో, రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఈక్వేషన్స్‌ ఎలా మారతాయో చెప్పలేం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి, ప్రకాష్‌ రాజ్‌పై ఒత్తిడి కాస్త ఎక్కువగానే వుందట. స్వయంగా రాహుల్‌ గాంధీ తన దూతని ప్రకాష్‌ రాజ్‌ వద్దకు పంపబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. 'ప్రకాష్‌ రాజ్‌ భావజాలం మా పార్టీ భావజాలానికి దగ్గరగా వుంటుంది.. బీజేపీ వ్యతిరేక పోరులో మాతో ఆయన కలిసివస్తే స్వాగతిస్తాం..' అంటూ కర్నాటక కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

కానీ, కాంగ్రెస్‌కి దగ్గరైతే టీఆర్‌ఎస్‌ లాంటి పార్టీలకు ప్రకాష్‌ రాజ్‌ దూరమవ్వాల్సి వస్తుందేమో.! అందుకే, కాస్త తెలివిగా ఆలోచించాడు, ఇండిపెండెంట్‌నని చెబుతున్నాడు ఈ విలక్షణ నటుడు. అయితే, ఇండిపెండెంట్‌గా ప్రకాష్‌ రాజ్‌ అనుకున్నది సాధించగలడా.? కష్టమేనన్నది తాజాగా కర్నాటక కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నమాట. ప్రకాష్‌ రాజ్‌ కాంగ్రెస్‌లో చేరతానంటే, లోక్‌ సభ అభ్యర్థిగా అవకాశమిస్తామనీ, గెలవకపోయినా ఆయన కోరుకుంటే అసెంబ్లీకో, రాజ్యసభకో పంపడానికి సిద్ధమేనని కాంగ్రెస్‌ నేతలు చెబుతుండడం కొసమెరుపు ఇక్కడ.

తనయుడు చనిపోయినా షూటింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?