Advertisement


Home > Politics - Political News
కర్ణాటక: కాంగ్రెస్ కొంప ముంచబోతున్న ఆ కులం?

కర్ణాటకలో పార్టీని చూసి ఓటేసే జనాల కన్నా, ఆ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి కులాన్ని బట్టే ఓటేస్తారు అనే విశ్లేషణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామిల పొలిటికల్ ట్రాక్ రికార్డు ఎంత దారుణంగా ఉన్నా, వక్కలిగలు(గౌడ)ల్లో వారికి ఉన్న పట్టు ఏ మాత్రం సడలదు. గౌడల జనాభా గణనీయంగా ఉన్న చోటల్లా జేడీఎస్ అభ్యర్థులు ముందజలో ఉంటారు.

ఇలాంటి నియోజకవర్గాల్లో ఇతర పార్టీలు కూడా గౌడలనే అభ్యర్థులుగా పెట్టినా జేడీఎస్ తరఫున నిలబడే గౌడలకే ఆదరణ ఉంటుంది. మండ్యా, మైసూర్, హాసన్ ప్రాంతాల్లో గౌడల డెన్సిటీ ఎక్కువ. ప్రస్తుత ఎన్నికల్లో మండ్యా జిల్లాలో జేడీఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక మిగతా కులాలు కూడా ఈ అభిమానాలకు విరుద్ధం కాదు. గణనీయంగానే ఉండే కురుబలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. సిద్ధరామయ్య ఒక్క నియోజకవర్గంలో అయినా గెలిచాడంటే అక్కడ కురుబల ఓట్లు భారీఎత్తున ఉండటంతోనే. ఇక లింగాయత్‌లు.. వీళ్లను ఆట్రాక్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది.

అయితే వీరి మొగ్గు బీజేపీ వైపే వెళ్లింది. ప్రత్యేక మతం గుర్తింపును ఇస్తామన్నా కాంగ్రెస్ వైపు చూడకుండా.. యడ్యూరప్పనే చూశారు లింగాయత్‌లు. బీజేపీకే అండగా నిలబడ్డారు. లింగాయత్ బెల్ట్ లో బీజేపీ మంచి స్థాయిలో సీట్లు సాధించడమే దీనికి రుజువు. అయితే అక్కడ కుల సమీకరణాలు ఎన్నికల ముందే కాదు, ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నెగ్గిన లింగాయత్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడే అవకాశాలున్నాయనే షాకింగ్ వార్త షికారు చేస్తోంది.

వీళ్లు యడ్యూరప్పకు మద్దతుగా బీజేపీ వైపు సాగే అవకాశాలున్నాయని అంటున్నారు. యడ్యూరప్ప లింగాయత్ కావడం వీళ్ల జంపింగ్‌కు ఒక రీజన్ అయితే, కాంగ్రెస్ పార్టీ వాళ్లు వెళ్లి కుమారస్వామిని సీఎంగా చేస్తామని అనడం వీరిలో మరింత వ్యతిరేకత పెంచుతోంది. లింగాయత్‌లకు వక్కలిగ(గౌడ)లకు మధ్యన రాజకీయ వైరం ఉంటుంది.

ఇలాంటి నేపథ్యంలో ఈ పరిస్థితిని వాడుకుని కాంగ్రెస్ తరఫున గెలిచిన ఏడెనిమిది మంది లింగాయత్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని టాక్. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు పెద్ద ఝలక్కే!