cloudfront

Advertisement


Home > Politics - Political News

గ్రేట్ ఆంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ః కల్యాణదుర్గం

గ్రేట్ ఆంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ః కల్యాణదుర్గం


అనంతపురం జిల్లాలో బహుముఖ పోటీ ఉన్న నియోజకవర్గం ఇది. కర్ణాటకతో సరిహద్దును పంచుకునే ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తిదాయకంగా ఉన్నాయి. నియోజకవర్గంలో అత్యధిక జనాభా బీసీలదే. కురుబ, బోయ, యాదవ సామాజికవర్గాలు ప్రధానంగా ఉన్నాయి. వీరితో పాటు రెడ్డి , కమ్మ తదితర సామాజికవర్గాలు  కూడా ఉన్నాయి. 

ప్రస్తుత రాజకీయం విషయానికి వస్తే ఇక్కడ స్పష్టమైన చీలికలు, బోలెడన్ని గ్రూపులు కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్లు కూడా ఈ గ్రూపుల వారీగా విడిపోయి కనిపిస్తూ ఉండటం విశేషం. కల్యాణదుర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గింది. హనుమంత రాయచౌదరి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

ఇక ఈ సారి టికెట్ విషయంలో ఈ నియోజకవర్గం పై చంద్రబాబు నాయుడు చాలా కసరత్తే చేశారు. హనుమంతరాయ చౌదరికి టికెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు చాలా సమీక్షలే నిర్వహించారు. అనంతపురం ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గం విషయంలో జేసీ దివాకర్ రెడ్డి జోక్యం కూడా చాలానే ఉంది. హనుమంతరాయ చౌదరికి జేసీ కూడా వ్యతిరేకం.  చౌదరిని మార్చాల్సిందే అని జేసీ పట్టు పట్టాడు. 

చౌదరిపై అంత వ్యతిరేకతకు కారణం… అవినీతి. చౌదరి తనయుడు అత్యంత భారీగా అవినీతి చేశారని, కనబడిన భూమినల్లా కజ్జా చేశారని, ఈ ప్రాంతంలో భారీగా విస్తరించిన గాలిమరల ఏర్పాటు విషయంలో భారీగా లంచాలు తీసుకున్నారని హనుమంత రాయ చౌదరి తనయులపై ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు ఏ ప్రతిపక్షం నుంచినో కాదు.. తెలుగుదేశం వర్గాల నుంచినే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి.

దీంతో చౌదరికి వ్యతిరేక వర్గం తయారు అయ్యింది. ఒకటి కాదు.. చౌదరిపై నాలుగు వ్యతిరేక వర్గాలు లేచాయి నియోజకవర్గంలో. వాళ్లంతా చౌదరికి సహకరించమని చంద్రబాబుకు తేల్చి చెప్పే సరికి ఇక్కడ నుంచి మాదినేని ఉమామహేశ్వర్ కు చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేశారు. ఈయన కూడా కమ్మ వ్యక్తే. చౌదరిపై తిరుగుబాటు చేసిన నాలుగు వర్గాల్లో ఒక వర్గానికి ఈయన అధిపతి. స్థానికంగా రియలెస్టేట్ చేసి భారీగా సంపాదించారు. తెలుగుదేశం పార్టీ నేతగా చలామణి అయ్యారు. అవి ఈయన అర్హతలు.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో సరైన నేతను తయారు చేసుకోలేకపోయింది. ఉష శ్రీ చరణ్ ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. ఈమె కురుబ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. నియోజకవర్గంలో వారి ఓట్లు భారీగా ఉన్నాయి.

ఇక అనూహ్యంగా ఈ సారి మళ్లీ కల్యాణదుర్గం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతున్నారు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం నుంచి రఘువీర విజయం సాధించారు. అయితే విభజన తర్వాత ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు రఘువీరకు ధైర్యం చాల్లేదు.అందుకే పెనుకొండకు వెళ్లారు. అక్కడ మూడో స్థానంలో వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సారి మళ్లీ కల్యాణదుర్గంలో రఘువీర రంగంలోకి దిగుతున్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ పోటీకి దిగుతున్నారు.

ఈ సారి డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఇవే..

-ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు హనుమంతరాయ చౌదరి. అయితే ఈయనకు టీడీపీ టికెట్ నిరాకరించింది. ఉమామహేశ్వర్ కు కేటాయించింది.
-కోలాహలంగా నామినేషన్ వేసిన హనుమంత రాయ చౌదరి వెనక్కు తగ్గేది లేదని అంటున్నారు. స్వతంత్రంగా బరిలో ఉన్నట్టే అని ప్రకటిస్తున్నారు.
-దీంతో తెలుగుదేశం పార్టీలో స్పష్టమైన చీలిక ఉండనుంది. హనుమంతరాయ చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకంటూ ఒక గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు.
-చౌదరి ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటే..తెలుగుదేశం పార్టీకి భారీ ఝలక్ అవుతుంది. ఉమామహేశ్వర్ కు ట్రెడిషనల్ టీడీపీ ఓటు బ్యాంకు తప్ప.. విజయానికి కావాల్సినన్ని ఓట్లను సంపాదించే సత్తా లేదు అని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.
-ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రఘువీర నుంచి భారీ దెబ్బ పడుతోంది. టీడీపీ వ్యతిరేక ఓటుబ్యాంకును భారీగా చీల్చనున్నారు రఘువీర.
-రఘువీరకు ఇక్కడ సొంత సామాజికవర్గానికి చెందిన యాదవులు గట్టి సపోర్ట్ గా నిలిచే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక శక్తి విషయంలో రఘువీరకు ఎవరూ సాటి వచ్చే అవకాశం లేదు.పాతిక కోట్ల  రూపాయలు అయినా ఖర్చు పెడతారని అంచనా!
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఆర్థిక శక్తి విషయంలో అనుమానాలున్నాయి. అలాగే నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేక వర్గం కూడా ఉంది ఆ పార్టీలో!
-కురుబ సామాజికవర్గం ఓట్లు ఆమెకు అనుకూలంగా నిలిచే అవకాశం ఉంది. కనీసం అరవై నుంచి డెబ్బై శాతం కురుబల ఓట్లు పడే అవకాశాలున్నాయి. ఆ మాత్రం సపోర్ట్ దక్కినా, వైఎస్సార్సీపీ ట్రెడిషనల్ ఓటు బ్యాంకు తోడైతే.. ఈమె బలమైన అభ్యర్థే అవుతారు.
-గ్రామీణ ప్రాంతంలో జగన్ పట్ల ఆదరణ కనిపిస్తోంది. కులాలకు అతీతంగా.. జగన్ కు ఒక అవకాశం ఇవ్వాలనే భావన వ్యక్తం అవుతోంది. ఇదే గనుక వేవ్ గా మారితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగుండకపోవచ్చు.

గ్రేట్ ఆంధ్ర సర్వేలో ఓట్ల లెక్క ఇది..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – 40
హనుమంతరాయ చౌదరి-20
రఘువీరారెడ్డి -20
తెలుగుదేశం పార్టీ -20

 
-గ్రామాల్లో ‘కావాలి జగన్.. రావాలి జగన్’ అనే మాట వినిపిస్తోంది. అదే వేవ్ గట్టిగా ప్రభావం చూపితే పై శాతాలు తారుమారు అయ్యి వైసీపీకి భారీ మెజారిటీ ఖాయం. 
-హనుమంతరాయ చౌదరి పోటీ నుంచి విరమించుకోకుంటే సమీకరణాల ఆధారంగా వైసీపీదే విజయం.
-రఘువీరారెడ్డి డబ్బులు భారీగా ఖర్చు చేస్తే వైసీపీకి సమీకరణాల ప్రకారం దెబ్బ పడవచ్చు.