cloudfront

Advertisement


Home > Politics - Political News

భలేగా దొరికేశావ్‌ కన్నా.!

భలేగా దొరికేశావ్‌ కన్నా.!

ఆంధ్రప్రదేశ్‌కి నరేంద్రమోడీ ప్రభుత్వం చెయ్యాల్సినదానికన్నా ఎక్కువే చేసేసిందని భారతీయ జనతా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడంటే టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రాన్ని ప్రశ్నించేస్తున్నారుగానీ.. కొన్నాళ్ళ క్రితం వరకూ ఆయన సైతం, 'చెయ్యాల్సినదానికంటే ఎక్కువే చేశారు.. కొత్తగా ఇంకా ఏం అడగగలం.?' అని కథలు చెప్పిన విషయాన్ని ఎలా కాదనగలం.? నిజమేనా, కేంద్రం - ఆంధ్రప్రదేశ్‌కి అన్నీ చేసేసిందా.!

తాజాగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రధాని నరేంద్రమోడీని కలిసి, ఓ వినతి పత్రాన్ని అందజేశారు. అందులో కొన్ని అంశాల్ని కన్నా లక్ష్మినారాయణ ప్రశ్నించారు. రైల్వే జోన్‌ సహా పలు అంశాలున్నాయందులో. ఎటూ బీజేపీ, ప్రత్యేక హోదాకి వ్యతిరేకం గనుక.. ఆ ఒక్క అంశాన్నీ మాత్రం ప్రస్తావించలేదు కన్నా లక్ష్మినారాయణ. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తొలిసారి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన కన్నా లక్ష్మినారాయణ, భేటీ పూర్తయ్యాక మీడియా ముందుకొచ్చి ఏవేవో కథలు చెప్పారు.

'చంద్రబాబు మనల్ని మోసం చేసినాసరే.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నాం' అని ప్రధాని నరేంద్రమోడీ, కన్నా లక్ష్మినారాయణతో చెప్పారట. ఇదీ కన్నా, మీడియాతో చెప్పిన మాట. అదే నిజమైతే, కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో, ప్రధాని నరేంద్రమోడీకి వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం ఏంటట.? ఈ లెటర్‌తో కన్నా లక్ష్మినారాయణ అడ్డంగా దొరికేశారు. 'ఏపీకి కేంద్రం ఒక్క పైసా కూడా బాకీ లేదు..' అని ఈ మధ్యనే విజయవాడలో కన్నా నాయకత్వంలో పెద్ద ధర్నా చేసిన బీజేపీ నేతలు తెగేసి చెప్పిన విషయం విదితమే. మరి, ఇప్పుడు కన్నా లక్ష్మినారాయణ వినతి పత్రంలో పేర్కొన్న 'బాకీ' అంశాల మాటేమిటి.?

గడచిన నాలుగేళ్ళలో విశాఖ రైల్వే జోన్‌ అంశం ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఒరిస్సా అభ్యంతరాలు కావొచ్చు, ఇతరత్రా రాజకీయ కారణాలు కావొచ్చు.. విశాఖ రైల్వే జోన్‌ మాత్రం వచ్చే అవకాశమే కన్పించడంలేదు. బీజేపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటేస్తున్నాయి. విశాఖ రైల్వే జోన్‌ వచ్చి తీరుతుందని అంటున్నారు. అయితే, కొన్నాళ్ళ క్రితమే రైల్వే జోన్‌ విషయంలో 'మేం ఓడిపోయాం' అని అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చేసిన వ్యాఖ్యల్ని అందరికీ గుర్తుండే వుంటాయి.

ఇక, ఏపీలో పార్టీ పరిస్థితిపై ప్రధానికి వివరించిన కన్నా లక్ష్మినారాయణ.. తాను పేర్కొన్న విషయాలపై వీలైనంత త్వరగా చర్యలు చేపడితే తప్ప, రాష్ట్రంలో పార్టీ మనుగడ సాధించే అవకాశమే లేదని తేల్చి చెప్పేశారన్న ప్రచారమూ జరుగుతోంది. కానీ, అంత నిక్కచ్చిగా ప్రధానితో మాట్లాడేంత సీన్‌ కన్నా లక్ష్మినారాయణకు వుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

రాజధాని విషయంలో చంద్రబాబు 'గ్రాఫిక్స్‌'ని పక్కన పెడితే, పోలవరం ప్రాజెక్ట్‌ బాధ్యత కేంద్రానిదే. ఆ ప్రాజెక్ట్‌ విషయంలో కేంద్రం, చంద్రబాబు సర్కార్‌ అసమర్థతను సాకుగా చూపడమంటే, సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ తన అసమర్థతను చాటుకున్నట్లే అవుతుంది. చిత్రమేంటంటే కన్నా లక్ష్మినారాయణ విజ్ఞాపన పత్రంలో పోలవరం ప్రాజెక్ట్‌ అంశం ప్రస్తావించకపోవడం.