cloudfront

Advertisement


Home > Politics - Political News

కర్ణాటకలో గెలిచిందెవ్వరు? ఓడిందెవ్వరు?

కర్ణాటకలో గెలిచిందెవ్వరు? ఓడిందెవ్వరు?

కర్ణాటకలో బీజేపీ తన ఓటమిని ఒప్పుకుంది. యడ్యూరప్ప రాజీనామాతో ఒక అంకం ముగిసింది. ఈ మొత్తం వ్యవహారంలో గెలుపు– కాంగ్రెస్‌, జేడీఎస్‌లతో పాటుగా మీడియాది కూడా. 15వ తేదీ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కర్ణాటక రాజకీయాన్ని పతాక శీర్షికలలోకి తీసుకువచ్చి– బీజేపీ పట్ల సామాన్య మానవుల్లో ఒక విధమైన వ్యతిరేకత తీసుకురావటంలో మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. ఇక రాజకీయంగా చూస్తే– బీజేపీ కష్టాలు తగ్గాయి.. కాంగ్రెస్‌ తలనెప్పులు పెరిగాయి.

తమ సంకీర్ణాన్ని కనీసం 2019 పార్లమెంట్‌ ఎన్నికల ద్వారా కొనసాగించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై పడింది. రకరకాల వైరుద్ధ్యాలు, వ్యక్తిత్వాలు ఉన్న సంకీర్ణాన్ని నడపాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే. ఎందుకంటే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చిన ప్రభుత్వంలో జూనియర్‌ పార్టనర్‌గానే వ్యవహరించాల్సి ఉంటుంది. బహుశా మరో ఆరునెలల దాకా మోదీ, అమిత్‌షా, గవర్నర్‌ జుబయ్‌వాలా త్రయం కర్ణాటక సర్కారును కూలదోయటానికి ప్రయత్నించకపోవచ్చు.

కొత్త ప్రభుత్వాన్ని కూల్చకుండా.. నెమ్మనెమ్మదిగా కాల్చేయాలనే ఆలోచన బీజేపీలో ఉండచ్చు. అంతకన్నా ముందు ఆ పార్టీ తాము మిగిలిన వారికన్నా భిన్నమనే వాదనను బలంగా వ్యాపింపచేయాలి. ఒక ఉన్నత నైతిక విలువలపై తాము నిలబడ్డామని ఈ రోజు నుంచి బీజేపీ అధికార ప్రతినిధులు అన్ని ఛానల్స్‌లోను ఊదరకొట్టవచ్చు. ఇప్పటిదాకా ఏ రాష్ట్రాన్ని వదులుకోవటానికి ఏ విధంగాను ఇష్టపడని మోదీ– అమిత్‌షా ద్వయం వెనకడుగు ఎందుకు వేశారనే విషయాన్ని విశ్లేషించుకుందాం.

‘‘వియ్‌ మే లూజ్‌ ఏ బ్యాటిల్‌.. బట్‌ విల్‌ విన్‌ ది వార్‌..’’ అనే సిద్ధాంతాన్ని పాటించాలనే ఆలోచనకు బీజేపీ అగ్రనాయకత్వం వచ్చినట్లుంది. ఇప్పుడు ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే– గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో విపక్షాలు గొడవ చేస్తాయి. దీనివల్ల రోజూ అల్లరి పాలుకావటం తప్ప బీజేపీకి వచ్చిందేమి లేదు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి అమిత్‌షా సహా పార్టీ అగ్రనేతలు హాజరుకానప్పుడే ఈ విషయం స్పష్టమయింది.

ప్రమాణ స్వీకారం రోజు యడ్యూరప్ప కాషాయరంగు కాకుండా ఆకుపచ్చ రంగు శాలువ కప్పుకున్నప్పుడే ఎక్కడో తేడా వచ్చిందనే విషయం తెలుస్తూనే ఉంది. అయినా రాష్ట్ర బీజేపీ నేతల్లో ఎక్కడో చిన్న ఆశ మినుక్కు మినుక్కుమంటూనే ఉంది. వాస్తవానికి ఐబీ వంటి సెంట్రల్‌ ఏజన్సీల సాయం లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ గట్టెక్కరు. ఈ సారి కేంద్రం ఎమ్మెల్యేల విషయంలో ఐబీని ఎక్కువగా వాడినట్లు లేదు. ఇక బీజేపీ వెనకడుగు వేసింది కాబట్టి కాంగ్రెస్‌ ముందడుగు వేసినట్లే!

ఈ మొత్తం ఘనతంతా రాహుల్‌ గాంధీకే కట్టపెడతారనటంలో ఎటువంటి సందేహంలేదు. కర్ణాటక రాజకీయ వ్యూహంలో కాంగ్రెస్‌ కురువృద్ధుల వ్యూహరచన ఎక్కువగా కనిపిస్తోంది తప్ప రాహుల్‌ పాత్ర నేరుగా ఉన్నట్లులేదు. అయినా రాహుల్‌దే విజయమని అందరూ సంబరాలు చేసుకోవటం కాంగ్రెస్‌ పార్టీలో రివాజే! (రాహుల్‌ అనేకాదు.. పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా అదే సంప్రదాయం). ఇక విపక్షాల గెలుపు ఆంధ్ర, తెలంగాణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని గమనిద్దాం.

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు స్వరాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి ఇబ్బందులు ఉండచ్చేమో కానీ ఢిల్లీలో ఆయనకు అనేకమంది దోస్త్‌లు ఉన్నారు. జేడీఎస్‌, కాంగ్రెస్‌ నేతలు ఆయనతో మాట్లాడిన తర్వాతే కర్ణాటక ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ వచ్చారనేది ఒక కథనం. ఎమ్మెల్యేలకు అవసరమైన భద్రత కల్పిస్తామని.. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోవని హామీ వచ్చిన తర్వాతే వారు హైదరాబాద్‌ వచ్చారని కూడా చెబుతున్నారు.

దీనికి కొన్ని కారణాలున్నాయి. ప్రస్తుతం కేసీఆర్‌ చిన్న పార్టీలను కూడగట్టే పనిలో ఉన్నారు. జేడీఎస్‌తో దోస్తి కూడా ఉంది. ఇప్పుడు ఆ పార్టీకి సాయం చేయటం వల్ల ఆయనకు లాభమే తప్ప నష్టంలేదు. కేసీఆర్‌ సాయం చేయకపోతే ఆ లోటును చంద్రబాబు సహా ఎవరో ఒకరు పూరిస్తారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే– దీనిని బీజేపీపై తమ విజయంగా తెలుగుదేశం తప్పకుండా ప్రచారం చేసుకుంటుంది.

బీజేపీతో జతకడితే ఎలా ఉంటుందనే ఆలోచనలతో ఉన్న జనసేన, వైఎస్‌ఆర్‌సీపీ కూడా ఆచితూచి వ్యవహరిస్తాయి. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితానంతర సంఘటన ప్రభావం ఆంధ్ర బీజేపీపై తీవ్రంగా పడే అవకాశముంది. ఆ పార్టీ నాయకులు కర్ణాటకపై అనేక ఆశలు పెట్టుకున్నారు.15 తర్వాత చుక్కలు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. బయటకు ఎలాంటి ప్రగల్బాలు పలికినా– మనసులో మాత్రం 2019 పరిస్థితి ఏమిటనే బెంగ మాత్రం బలంగా ఉంటుంది.

ఏదీ ఏమైనా కర్ణాటక ఎన్నికలు మనదేశ రాజకీయాలను మరో కొత్త మలుపు తిప్పాయి. రాజకీయాల్లో వగరుపోతుతనం కూడదని మోదీ, అమిత్‌షా ద్వయానికి గుణపాఠం నేర్పాయి. 
-భావన 
(fbackfm@gmail.com)