Advertisement


Home > Politics - Political News
కరుణ అంత్యక్రియలు.. నాస్తికవాదానికి వెక్కిరింపు!

కరుణానిధి నాస్తికుడు. దేవుడే లేడన్నవాడు. అందరూ అదే నమ్మాలని చెప్పిన వాడు. అయితే ఆయన కుటుంబంలోని వారే ఆ మాటను పట్టించుకోలేదనుకోండి. ఈ నాస్తికవాదులతో ఇదే తలనొప్పి. వీరేమో దేవుడూ లేడు, ఎవరూ లేడంటారు... మీ ఇంట్లో వాళ్లేమో గుళ్లకు వెళ్తారు, పూజలు చేస్తారు.. అంటే, అది వారి వ్యక్తిగతం అని, వారి స్వేచ్ఛ అని చెప్పుకొస్తారు. కరుడుగట్టిన ద్రవిడ ఉద్యమనేతగా పేరు పొందిన కరుణానిధి కూడా అదే బాపతే.

ఇక కరుణ అంత్యక్రియల దగ్గరకు వచ్చేసరికి ఆయన నాస్తికవాదం వెక్కిరింపబడింది. నాస్తికుడు అంటే.. మరణానంతరం ఏమీలేదని నమ్మేవాడు. స్వర్గం, నరకంలేదు అనేవాడు. మనిషి కూడా ఒక జంతువులా పుట్టాడు, చచ్చిపోయి మట్టిలో కలిసిపోతాడు అనేవాడు. అలా మట్టిలో కలిసిపోయేది ఎక్కడైనా ఫర్వాలేదనేవాడు. అయితే కరుణ అంత్యక్రియలు మాత్రం మెరీనా బీచ్ లోనే జరగాలని ఆయన కుటుంబీకులు, ఆయన పార్టీ వాళ్లు పట్టుబట్టి ఆ పని చేయించారు.

అధికారిక లాంఛనలతో కరుణ అంత్యక్రియలను మరోచోట చేస్తామని ప్రభుత్వం వాదించినా.. అక్కడ గాంధేయవాదులు, కాంగ్రెస్ వాదులైన మాజీ సీఎం సమాధులు ఉన్నాయని.. ద్రావిడ సిద్ధాంతకర్త అయిన కరుణానిధి వారి మధ్యలో ఉండలేడని.. అన్నా సమాధి ఉన్న మెరీనాలోనే కరుణానిధిని ఖననం చేయాలని వాళ్లంతా పట్టుబట్టారు.

చనిపోయిన తర్వాత ఏమీలేదు.. అని నమ్మే నాస్తికుడిని పూడ్చడానికి సంబంధించి ఆయన ఫాలోయర్లు ‘సెంటిమెంట్’ను ఫాలో అయ్యారు. కరుణానిధి మృత‌దేహన్ని గాంధేయ వాదుల మధ్య పూడిస్తే ఆయన ప్రశాంతంగా ఉండలేడని, ద్రావిడ వాదుల మధ్యన పూడిస్తే ఆయన సంతోషంగా ఉంటారనే వాదనతో నియమాలను సవరించి కరుణ మృత‌దేహాన్ని మెరీనాలో పూడ్చిపెట్టారు.

ఆఖరికి ఆస్తికవాదులు కూడా మరీ ఇంత సెంటిమెంటును పాటించరు. దేవుడిని నమ్మేవాళ్ల విషయంలో తీసిపోని రీతిలో కరుణానిధి.. మరణానంతర జీవితం విషయంలో ఆయన ఫాలోయర్లు, ఆయన కుటుంబీకులు పోటీపడి సెంటిమెంటును అమలు పరిచారు. నాస్తికవాదాన్ని వెక్కిరించారు. పరమ నాస్తికుడిగా తనను తాను చెప్పుకున్న కరుణానిధి తన మృత‌దేహాన్ని ఏ మెడికల్ కాలేజీకో డొనేట్ చేస్తూ వీలునామా రాసుకోలేదు. 
అలాచేసి ఉంటే కరుణానిధి సమాధి డీఎంకే రాజకీయాలకు భవిష్యత్తులో ఉపయోగపడదేమో అని భయమేమో!