Advertisement


Home > Politics - Political News
పవన్ కు అంత ఖరీదైన భూమి ఎలా వచ్చింది?

కొన్ని రోజులగా పవన్ పై తన విమర్శలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కత్తి మహేష్ ఇవాళ్టి నుంచి మరోసారి జనసేనానిపై విమర్శలు ఎక్కుపెట్టాడు. మరీ ముఖ్యంగా మంగళగిరి వద్ద ఉన్న కాజాలో పవన్ కల్యాణ్, తన ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేసిన కొన్ని గంటలకే కత్తి మహేష్ విమర్శలు ప్రారంభించాడు.

ఈసారి తన ట్వీట్స్ లో పవన్ ను అతడి ఆస్తులపై సూటిగా ప్రశ్నలు సంధించాడు కత్తి మహేష్. రెండు దశాబ్దాల కెరీర్ లో సొంత ఇల్లు, కారు అమ్ముకున్న పవన్... రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అతికొద్ది కాలానికే ఇంటి నిర్మాణం ఎలా చేపట్టారని ప్రశ్నించారు. ఇంత తక్కువ టైమ్ లో పవన్ కు అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది, మరీ ముఖ్యంగా అత్యంత ఖరీదైన అమరావతి ప్రాంతంలో పవన్ కు 2ఎకరాలు ఎక్కడ్నుంచి వచ్చాయనేది కత్తి మహేష్ ప్రశ్న.

పవన్ కల్యాణ్ కు ఇచ్చిన ల్యాండ్ డీల్ తనకు కూడా ఇస్తే, పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేసిన భూమి పక్కనే తను కూడా ఓ ప్లాట్ తీసుకొని అమరావతికి షిఫ్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నట్టు సెటైర్ వేశాడు కత్తిమహేష్.

తన విమర్శల్లో భాగంగా పవన్ స్థాపించిన జనసేన పార్టీపై కూడా కత్తిదూశాడు కత్తిమహేష్. ఆ పార్టీలోనే బానిసత్వం ఉందని సంచలన ప్రకటన చేశాడు.

"జనసేన పార్టీ ఆరంభంలోనే బానిసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పంథాలోనే జీహుజూరి ఉంది. పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి ఉంది. ఇది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదు. ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజం." యథాతథంగా కత్తిమహేష్ ట్వీట్ ఇది.