Advertisement


Home > Politics - Political News
ఈయనకు అభిషేకం ఆయనకు నిరసనేనా?

పాలకులను  ప్రశంసించడానికి, తెగనాడటానికి జనం అనేక పద్ధతులు అనుసరిస్తుంటారు. జిందాబాద్‌, ముర్దాబాద్‌ వంటి నినాదాలతో రోడ్లపై తిరగడంకంటే కొన్ని చర్యల ద్వారా ప్రజలు తమ అభిమానాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాలకులకు నిరసన తెలియచేయాలంటే వెంటనే దిష్టిబొమ్మలు తగులబెడతారు. అభిమానం చాటుకోవాలంటే, ప్రశంసించాలంటే విగ్రహాలకో, ఫ్లెక్సీలకో పాలాభిషేకం చేస్తుంటారు.

కొంతకాలంగా పాలాభిషేకం సంప్రదాయంలా మారింది. నిరసన తెలపడానికి కూడా పాలాభిషేకం, పాలతో కడగడంవంటి పనులు చేస్తున్నారు. ఫలానవారి కారణంగా అంబేద్కర్‌ విగ్రహం అపవిత్రమైందంటూ దాన్ని పాలతో కడగడంవంటి పనులు ఎక్కువయ్యాయి. ఉదాహరణగా అంబేద్కర్‌ విగ్రహాన్ని చెప్పుకున్నాంగాని అనేకమంది విగ్రహాలు అభిమానంతోనో, నిరసనగానో పాలతో తడుస్తున్నాయి.

ఇక విషయానికొస్తే..ఈమధ్య ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాల్లో, పట్టణాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బొమ్మకు (ఫ్లెక్సీ) యాదవ సామాజికవర్గంవారు పాలాభిషేకాలు చేశారు. ఇంకా కొన్ని చోట్ల ఈ పని జరుగుతూనే ఉంది. ఇదేంటి? తెలంగాణ సీఎంకు ఆంధ్రాలో అభిషేకం చేయడమేమిటి? 'ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా' ఓ సినిమాలో ఎన్టీఆర్‌ పాడారు. 'రాష్ట్రం విడిపోయినా మన కులం ఒకటేనన్నా' అని పాడుకుంటుండటంవల్ల ఇలాంటి అభిషేకాలు జరుగుతున్నాయి.

రాష్ట్రం విడిపోయేవరకు ఆంధ్రావారికి కేసీఆర్‌ శత్రువులా కనబడ్డారు. విడిపోయాక మంచోడయ్యారు. అందుకే 'ఆంధ్రాకు తరలిరండి' అని చంద్రబాబు పిలుపునిస్తున్నా హైదరాబాదు నుంచి ఎవ్వరూ కదలడంలేదు. ఇదిలావుంటే...ఏపీలో కేసీఆర్‌కు పాలాభిషేకం చేయడానికి కారణం ఆయన యాదవ సామాజికవర్గానికి చెందిన నేతను రాజ్యసభకు పంపుతానని హామీ ఇవ్వడమే కాకుండా నిర్ణయం కూడా తీసుకున్నారు.

దీంతో ఏపీలోని ఆ సామాజికవర్గంవారు సంబరాలు చేసుకుంటున్నారు. ఈమధ్య విజయవాడలోనూ, ఇంకొన్నిచోట్ల పాలాభిషేకాలు చేయగా, తాజాగా సింగరాయకొండలో చేశారు. కేసీఆర్‌ చేసినట్లు చంద్రబాబు నాయుడు కూడా యాదవుల సంక్షేమానికి కృషి చేయాలని యాదవ నాయకులు కోరారు.

కేసీఆర్‌ తెలంగాణలోని యాదవుల కోసం హైదరాబాదులో భవనం నిర్మించేందుకు పదెకరాల స్థలం కేటాయించారని, పది కోట్ల నిధులు విడుదల చేశారని ప్రశంసించారు. ఐదు వేల కోట్లతో, 75 శాతం సబ్సిడీతో ప్రతి పేద యాదవ కుటుంబానికి గొర్రెల యూనిట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆంధ్రాలో పాలాభిషేకాలు చేయించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రాలోనూ లేరని కొందరు నాయకులు చెప్పారు.

కేసీఆర్‌పై తనకు ఎంతో గౌరవముందని, ఆయన పరిపాలన బాగుందని జనసేన ఆవిర్భావ సభలో చెప్పానన్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికీ ఏపీ నిర్వహిస్తున్న జనసేన సమావేశాల్లో ఈ విషయాలు చెబుతున్నానని ఈమధ్యనే మీడియాకు చెప్పారు.  తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ కేసీఆర్‌ పాలనపై విమర్శలు గుప్పిస్తుండగా పవన్‌ మాత్రం పెద్దాయన పాలన బ్రహ్మాండంగా ఉందని పొగుడుతూ ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తున్నారని కితాబు ఇచ్చేశారు.

ప్రగతి భవన్లో గంటకు పైగా ఆయన కోసం ఎదురుచూసి ముచ్చటించిన పవన్‌ కళ్యాణ్‌ సీఎం తీసుకున్న నిర్ణయాలకు మురిసి ముక్కలైపోయారు. ముఖ్యంగా వ్యవసాయానికి ఇరవైనాలుగు గంటల విద్యుత్‌ సరఫరా అద్భుతమన్నారు. ఇరవైనాలుగు గంటల విద్యుత్‌ సరఫరాను దేశమంతా కేస్‌ స్టడీగా తీసుకోవాలన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత ప్రసంగాలకు ఆంధ్రాలో అనేకమంది అభిమానులున్నారు.

గతంలో కొందరు ఆంధ్రా నెటిజన్లు 'మా రాష్ట్ర మంత్రులు నిద్రపోతున్నారు' అని కామెంట్‌ చేశారు. 'కేటీఆర్‌ వంటి మంత్రి ఆంధ్రప్రదేశ్‌లో లేడు' అని  వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ తమ రాష్ట్రానికొచ్చి కొన్నాళ్లు ఉండాలని కొందరు కామెంట్‌ చేశారు. ఏపీలో కొన్ని చోట్ల కేసీఆర్‌, కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలూ జరుపుతున్నారు.