cloudfront

Advertisement


Home > Politics - Political News

ఇంత అనుబంధం దేశంలోనే రికార్డు...!

ఇంత అనుబంధం దేశంలోనే రికార్డు...!

సాధారణంగా రాజకీయాల్లో ఉండేవారు చాలా తెలివితేటలతో ఉంటారు. తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులై ఉంటారు. సాధారణ రాజకీయ నాయకులే ఇలా ఉంటే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురించి చెప్పేదేముంది? అసాధారణమైన తెలివితేటలు ఆయన సొంతం. రాజకీయపుటెత్తుగడల్లో ఆయన్ని మించినవారు లేరనిపిస్తుంది. ఎక్కడ ఎవరితో ఎలా వ్యవహరించాలో బాగాతెలుసు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే కేసీఆర్‌ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను మేనేజ్‌ చేస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంటుంది. వీరిద్దరూ గవర్నర్‌, ముఖ్యమంత్రిలా (ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనుకోండి) కాకుండా జిగ్రీ దోస్తుల్లా మారిపోయారు. నిన్న వినాయక చవితి రోజు కూడా కేసీఆర్‌ రాజభవన్‌కు వెళ్లి గవర్నర్‌కు శుభాకాంక్షలు చెప్పివచ్చారు. ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు. నిజానికి ఈ విషయాల గురించి తెలియదనుకోలేం.

అది కేసీఆర్‌కూ తెలుసు. అయినా కాసేపు ఆయనతో మాట్లాడితే అదో రకమైన మర్యాదగా, ప్రయోజనకరంగా ఉంటుంది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ముందస్తు ఎన్నికలు ప్రకటించేవరకు గవర్నర్‌ను కలుసుకోవడంలో రికార్డు సృష్టించారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి గవర్నర్‌తో ఇన్నిసార్లు భేటీ అయిన దాఖలాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు ప్రతి పది రోజులకోసారి కేసీఆర్‌ గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఆయనతో చక్కటి సంబంధం నెలకొల్పుకున్నారు.

కేసీఆర్‌ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తిరిగి రాగానే వెంటనే రాజ్‌భవన్‌కే వెళ్లేవారు. గవర్నర్‌ కూడా ఇదే విధంగా వ్యవహరించేవారు. ఆయన ఢిల్లీ వెళ్లి రాగానే కేసీఆర్‌తో సమావేశమయ్యేవారు. సమస్యలను పరిష్కరించాల్సి వచ్చినప్పుడు కేసీఆర్‌ తప్పనిసరిగా గవర్నర్‌ సలహా తీసుకునేవారు. నరసింహన్‌కు ప్రధాని మోదీతో మంచి సంబంధాలున్నాయి కాబట్టి కేసీఆర్‌కు, మోదీకి మధ్య మిత్రత్వం కుదిర్చింది గవర్నరే అంటారు. రాజకీయంగా బీజేపీ టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షం కాదు.

కాని మోదీ, కేసీఆర్‌ మధ్య చక్కటి సంబంధాలున్నాయి. దీనివెనక గవర్నర్‌ కృషి ఉందని చెప్పకతప్పదు. ముందస్తు ఎన్నికల్లో రెండుపార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే కాంగ్రెసును తిట్టిపోస్తున్న కేసీఆర్‌ బీజేపీపై విమర్శలు చేయడంలేదు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి గవర్నర్‌తో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే భేటీ అవుతుంటాడు. మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు, స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌ డే, ముఖ్యమైన బిల్లుల విషయంలో...ఇలాంటి కొన్ని సందర్భాల్లో భేటీ అవుతుంటారు.

కాని కేసీఆర్‌, నరసింహన్‌ స్నేహితుల మాదిరిగా కలుసుకుంటూ ఉంటారు. ఇదే వీరి ప్రత్యేకత. సాధారణంగా ముఖ్యమంత్రులు గవర్నర్‌తో పాలన విషయాలు తప్ప మాట్లాడరు. కాని కేసీఆర్‌, నరసింహన్‌ రాజకీయ వ్యవహారాలు గురించి కూడా ముచ్చటిస్తారని టీఆర్‌ఎస్‌ నాయకులు కొందరు చెబుతుంటారు. గతంలో ఏపీ టీడీపీ నేతలు, మంత్రులు గవర్నర్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయనకు తెలంగాణకు మాత్రమే గవర్నర్‌లా వ్యవహరిస్తున్నారని అనేవారు.

ఏపీ సమస్యలను పట్టించుకోవడంలేదని, చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన చెందేవారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా అనేకసార్లు గవర్నర్‌ పక్షపాత వైఖరిని విమర్శించారు. విభజన సమస్యల పరిష్కారంలో నరసింహన్‌ తెలంగాణ పట్లనే మొగ్గు చూపిన దాఖలాలు ఉన్నాయి. కేసీఆర్‌ చెప్పిందానికి ఇచ్చినంత ప్రాధాన్యం చంద్రబాబు విజ్ఞప్తులకు ఇచ్చావారు కాదు. ఏది ఏమైనా కేసీఆర్‌ రాజకీయ చాతుర్యానికి గవర్నర్‌తో అనుబంధం చక్కటి నిదర్శనం.