Advertisement


Home > Politics - Political News
కేసీఆర్‌కు ఇది తగిన సమయమా?

తెలంగాణలో కొంతకాలంగా ఒక విచిత్రమైన చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఇది విచిత్రమేం కాదు. రాజకీయాల్లో ఇలాంటి చర్చలు సాధారణమే. ఇంతకూ ఏమిటా చర్చ? వచ్చే ఎన్నికల తరువాత కేసీఆర్‌ తన తనయుడు కమ్‌ ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయవచ్చని, దీంతో హరీష్‌రావుకు అన్యాయం జరుగుతుందని, ఈ కారణంగా పార్టీలో చిచ్చు రగులుతుందని...ఇలా సాగిపోతోంది ఈ చర్చ. తెలంగాణ కాంగ్రెసు నాయకులు తమ పార్టీ కార్యకలాపాలను సైతం పక్కన పెట్టి కేటీఆర్‌,హరీష్‌ గురించే మాట్లాడుతున్నారు. హరీష్‌పై సానుభూతి చూపిస్తున్నారు. ఆయన్ని కాంగ్రెసులోకి ఆహ్వానిస్తున్నారు. ఆ పార్టీలో చేరితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందట....! ఈమధ్య ఏబీఎన్‌ ఛానెల్లో  'ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే' కార్యక్రమంలో హరీష్‌రావు పాల్గొన్నారు. దాంట్లోనూ కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే హరీష్‌రావు స్పందన ఏమిటనే ప్రశ్న వచ్చింది. ఇలా ఈమధ్య కేటీఆర్‌ ముఖ్యమంత్రిత్వం, హరీష్‌రావు తిరుగుబాటు అనే అంశాల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి.

కొంతకాలం మౌనంగా ఉన్న తరువాత కేటీఆర్‌ దీనిపై స్పందించి హరీష్‌రావు కాంగ్రెసులోకి వెళ్లడని, తమ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. తనకు ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని, కేసీఆర్‌ మరో పదేళ్లపాటు సీఎంగా ఉంటారని చెప్పారు. అరవైనాలుగేళ్లంటే రాజకీయాల్లో యంగ్‌ ఏజ్‌ అని కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి మైండ్‌గేమ్‌ ఎప్పటినుంచో ఆడుతూనే ఉన్నాయి ప్రతిపక్షాలు. మేనల్లుడే కేసీఆర్‌కు ఎసరు పెడతాడంటూ తెలంగాణ టీడీపీ నాయకులు ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి మైండ్‌గేమ్‌ ఆడుతూనే ఉంటారని అందరికీ తెలిసిందే. అయితే కేటీఆర్‌-హరీష్‌రావుపై ఇంతలా చర్చ జరుగుతుండటానికి ఏమైనా పునాది ఉందా? అని ఆలోచిస్తున్నవారికి టీఆర్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలున్న ఓ జర్నలిస్టు రాసిన వ్యాసంలో ఆధారాలు కనబడుతున్నాయి. ఆయన చెబుతున్నదాని ప్రకారం...కేసీఆర్‌ దృష్టి జాతీయ రాజకీయాల మీదికి మళ్లింది. అందుకు ఇదే తగిన సమయమని (2019 ఎన్నికలు) ఆయన భావిస్తున్నారట...!

త్వరలో రాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ దానిపై దృష్టి పెట్టాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల గురించి కూడా ఆలోచిస్తున్నాయి. బీజేపీ రాష్ట్రపతి పదవికి తాను ప్రతిపాదించబోయే అభ్యర్థికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక, సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రతిపక్షాల పునరేకీకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు కసరత్తు మొదలైంది. కాంగ్రెసు సహా  బీజేడీ, తృణమూల్‌ కాంగ్రెసు, జేడీయూ, ఆప్‌...ఇంకా పలు ప్రాంతీయ పార్టీలు ఎన్‌డీఏ వ్యతిరేక కూటమిని తయారుచేసే పనిలో ఉన్నాయి. ఇదంతా గమనిస్తున్న కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచన కలుగుతోందట...! అందుకు ఇది తగిన సమయమని భావిస్తున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణం ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడానికేనట...!

ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ, కేంద్రం అంగీకరించవనే విషయం కేసీఆర్‌కు తెలుసు. అయినప్పటికీ మొండిగా ఈ అంశాన్ని మూడేళ్ల తరువాత తెర మీదికి తేవడానికి రెండు కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటిది తాను ఎన్నికల హామీని నెరవేరుస్తున్నానని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని ప్రజలకు అభిప్రాయం కలిగించడం. రెండోది రిజర్వేషన్లకు బీజేపీ అంగీకరించదు కాబట్టి అది ముస్లింలకు అన్యాయం చేసిందని, కేంద్రం తన ప్రయత్నాలను అడ్డుకుందని ప్రచారం చేయడం. కేసీఆర్‌ కేంద్రానికి లొంగిపోయారనే భావవ ఇటీవలి కాలం వరకు ఉంది. కాని ఆయన తాజా వైఖరి బట్టి చూస్తే కేంద్రాన్ని, బీజేపీని గట్టిగా ఎదుర్కోవాలనే ఆలోచన చేస్తున్నట్లుగా కనబడుతోంది.

ముస్లింలకు రిజర్వేషన్లు సాధించే విషయంలో కేంద్రంతో ఎంతకైనా పోరాడతానని, వెనక్కి తగ్గేది లేదని అన్నారు. సో...ఇదంతా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనతోనే చేస్తున్నట్లుగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం. కేసీఆర్‌కు దేశంలోని అన్ని ప్రతిపక్షాల అధినేతలతో పరిచయాలున్నాయి. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా అప్పట్లో అన్ని ప్రతిపక్షాలను కలుసుకొని మద్దతు కోరారు. వాగ్ధాటి ఉండటంతోపాటు హిందీ, ఉర్దూల్లో సైతం ప్రావీణ్యం ఉన్న కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించడం కష్టం కాదు.