cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ నవరత్నాలు.. ఇకపై తెలంగాణలో..?

జగన్ నవరత్నాలు.. ఇకపై తెలంగాణలో..?

2014లో ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. హామీలన్నిటినీ దాదాపుగా నెరవేర్చి.. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయ దుందుభి మోగించారు కేసీఆర్. 

ఎన్నికల హామీలను అటకెక్కించి, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, అమరావతి చుట్టూ పరిభ్రమించి 2019లో ఘోర పరాభవం చవిచూశారు బాబు.

గతంలో చంద్రబాబుతో పోల్చి చూస్తే కేసీఆర్ పాలన బాగుందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు జగన్ పాలనతో పోల్చి చూస్తే తెలంగాణలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే భావన అర్థమవుతోంది. 

దుబ్బాక ఫలితం, జీహెచ్ఎంసీ బొటాబొటి మెజార్టీతో కేసీఆర్ కి తత్వం బోధపడింది. ప్రజా సంక్షేమ పథకాల్లో ఎక్కడో తేడా కొడుతోందనే విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన.. పరోక్షంగా ఏపీతో వస్తున్న పోలికపై కూడా దృష్టి పెట్టారు.

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు, తెలంగాణలో ఇంకా ఆర్టీసీ నష్టాలతోనే కునారిల్లుతోంది. తెలంగాణలో వీఆర్వోలను ఏకపక్షంగా పీకిపారేసి శతృత్వం పెంచుకున్నారు కేసీఆర్, ఏపీలో వీఆర్వోల అవినీతికి సచివాలయాలతో చెక్ పెట్టారు జగన్. 

నవరత్నాల పథకాలు ఏపీలో సూపర్ హిట్. ఇటీవల మొదలైన ఇళ్ల పంపిణీ.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఏపీలో ఏం జరుగుతోందనే  విషయంపై ఆరా తీస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.

ఆర్థిక భారం ఎంత..?

ఏపీతో పోల్చి చూస్తే ఆర్థికంగా తెలంగాణ మెరుగైన స్థితిలో ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంతో తెలంగాణతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగే పరిస్థితి. అలాంటి రాజధాని లేకుండా, రాజధానితో వచ్చే లాభాలు లేకుండానే ఏపీలో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు భారీగా ఖర్చు పెడుతోంది. 

అప్పులు చేస్తున్నారనే అపవాదు ఉన్నా కూడా.. ఆ అప్పులను వృథా చేయడంలేదనే భరోసా అందరిలోనూ భవిష్యత్ పై నమ్మకాన్ని కలిగిస్తోంది. దీంతో ఏపీ పథకాలపై, దానివల్ల రాష్ట్ర ఖజానాపై పడే ఆర్థిక భారంపై అంచనా వేయాలని అధికారులకు సూచించారు కేసీఆర్.

ఏయే పథకాలు అవసరం..?

ఏపీలో రైతు భరోసా లాగే తెలంగాణలో రైతులకు ఆర్థిక సాయం అందించే పథకం అమలులో ఉంది. నేతన్న నేస్తం, ఇతర చేతివృత్తులకు అందిస్తున్న ఆర్థిక సాయం కూడా తెలంగాణలో మరో రూపంలో అందుతోంది.

ప్రధానంగా సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ వంటివి మాత్రం తెలంగాణలో అందుబాటులో లేవు. దీంతో నవరత్నాలలో వేటిని తీసుకోవాలనే విషయంపై కేసీఆర్ ఆదేశాలతో అధికారులు దృష్టి సారించారు.

జమిలి హడావిడి..

జమిలి ఎన్నికలొస్తున్నాయనే కేంద్రం సంకేతాల నేపథ్యంలో.. రాష్ట్రాల్లో హడావిడి మొదలైంది. అందులోనూ వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మరింతగా అప్రమత్తం అవుతున్నాయి. 

అందుకే ఇప్పట్నుంచే జమిలి కసరత్తులు ప్రారంభించారు కేసీఆర్. అందులో భాగంగానే ఏపీ పథకాలపై ఆరా తీస్తున్నారు. మక్కికి మక్కి కాపీ కొట్టినట్టు కాకుండా.. తన మార్కు చూపెడుతూ నవరత్నాల ఆదర్శంతో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి తెలంగాణ నవరత్నాలలో ఏయే పథకాలు ఉంటాయో వేచి చూడాలి.

ఇళ్ల పట్టాలు నిరంతర ప్రక్రియ

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి