cloudfront

Advertisement


Home > Politics - Political News

కేసీఆర్‌ స్నేహితుడు కేశవ్‌ గెలిచాడోచ్‌.!

కేసీఆర్‌ స్నేహితుడు కేశవ్‌ గెలిచాడోచ్‌.!

టీడీపీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌, తెలుగుదేశం పార్టీలో కోవర్ట్‌గా పనిచేశారా.? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎప్పటికప్పుడు చేరవేశారా.? అలా చేరవేసిన ముఖ్యమైన విషయాల్ని విశ్లేషించి, కేసీఆర్‌ - వైఎస్‌ జగన్‌కి తదనుగుణంగా వ్యూహాలు మార్చుకోమని సలహాలిచ్చారా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెలుగు తమ్ముళ్ళలో చిత్ర విచిత్రంగా తలెత్తుతున్నాయి.

పయ్యావుల కేశవ్‌ విషయంలోనే ఎందుకిలా.? అంటే, దానికీ ఓ లెక్కుంది. పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ పెళ్ళికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. అప్పట్లో చంద్రబాబుకీ, కేసీఆర్‌కీ మధ్య సత్సంబంధాలున్నాయనుకోండి.. అది వేరే విషయం. అయితే, వెళుతూ వెళుతూ పయ్యావుల కేశవ్‌తో కేసీఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు కూడా. అప్పట్లో పయ్యావుల కేశవ్‌ అలా ప్రత్యేకంగా కేసీఆర్‌తో భేటీ అవడం చంద్రబాబుకీ నచ్చలేదు.

నిజానికి పయ్యావుల కేశవ్‌ టీడీపీకి వీర విధేయుడు. కానీ, ఏం లాభం.? పార్టీలో ఆయనకు చాలా అవమానాలే జరిగాయి. అయినాగానీ, పార్టీనే అంటిపెట్టుకుని వున్నారు. ఓ దశలో ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారమూ జరిగినా, పయ్యావుల అటు వైపుగా కీలకమైన ముందడుగు వేయలేకపోయారు. ఎలాగైతేనేం, ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్‌ గెలిచారు. దాంతో, కేసీఆర్‌ స్నేహితుడు కేశవ్‌ గెలిచాడోచ్‌.. అంటూ సెటైర్లు పడ్తున్నాయి కేశవ్‌ ప్రత్యర్థుల నుంచి.

ఇప్పటికే నిండా మునిగిపోయిన టీడీపీని, ఇంకా ముంచేయడానికి.. టీడీపీలోని అంతర్గత శతృవులే ఇప్పుడు పయ్యావుల కేశవ్‌ లాంటివారి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ చంద్రబాబు అలాంటి గాసిప్స్‌కి ఆస్కారం కల్పించి, పార్టీ నుంచి ముఖ్యనేతల్ని బయటకు పంపేయడంలో దిట్ట గనుక.. కేశవ్‌ పరిస్థితి ముందు ముందు ఏమవుతుందో వేచి చూడాల్సిందే.