Advertisement


Home > Politics - Political News
మూడో సీటు ఏ కులానికి?

కులాన్ని పక్కనపెట్టి రాజకీయాలు చేయడం ఎంతటి కొమ్ములు తిరిగిన నేతకైనా సాధ్యంకాదని తెలిసిందే కదా. కులరహిత సమాజం ఎలాగైతే ఉండదో, కులరహిత రాజకీయాలు ఉండవు. కులరహిత సమాజమనేది కల మాత్రమే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కులాలను ఎలా మచ్చిక చేసుకుంటున్నారో చూస్తూనేవున్నాం. కులాలవారీగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారు. కార్పొరేషన్లు పెడుతున్నారు. భవనాలు కట్టిస్తామంటున్నారు.  ఇప్పుడు చాలా తక్కువమంది మాత్రమే కులవృత్తులు చేస్తున్నప్పటికీ వాటికి సంబంధించి పథకాలు అమలు చేస్తున్నారు. కుల సమీకరణాలు సమర్థంగా నిర్వహించగలగినవారే ఇప్పటి రాజకీయాల్లో విజయం సాధిస్తారు. కేసీఆర్‌కు ఈ సూత్రం బాగా తెలుసు. 

తన పాలనలో ఆయన చివరి రాజ్యసభ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. నిజానికి ఎదుర్కోవడమంటూ ఏమీలేదు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ముగ్గురిని ఎన్నిక చేయాల్సివుంది. టీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో ఎనభైశాతం బలం ఉంది కాబట్టి మూడు సీట్లు సునాయాసంగా ఆ పార్టీకే దక్కుతాయి. గెలుపు వడ్డించిన విస్తరిలా ఉంది కాబట్టి కుల సమీకరణాలు జాగ్రత్తగా చూసుకొని అభ్యర్థులను ఎంపిక చేయాల్సివుంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి సామాజిక వర్గాలను సరిగా ఎంచుకోకపోతే ఆ ప్రభావం ఎన్నికలపై పడి నష్టం జరిగే ప్రమాదముంది. 

తెలంగాణ కోటాలో సీఎం రమేష్‌ (టీడీపీ), రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ (కాంగ్రెసు) రిటైరవుతున్నారు. మూడో సీటులో ఉన్న పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి (కాంగ్రెసు) మరణించారు. ఈ మూడు సీట్లకూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఎన్నికయ్యే అవకాశముంది. ఏ పార్టీకైనా బీసీలు, ముస్లింలు ప్రధానం కాబట్టి కేసీఆర్‌ ముందుగా ఈ రెండు సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. బీసీల నుంచి యాదవ కులానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. రెండో సీటు ముస్లిం అభ్యర్థికి ఇస్తున్నారు. తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి వారికి తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాల్సివుంది.

రాజ్యసభ ఎన్నికల్లో ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వడానికి మరో కారణం తాను వాగ్దానం చేసిన 12శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం. ఈ అసంతృప్తిని తగ్గించాలంటే రాజ్యసభ సీటు ఇవ్వడం మార్గమనుకున్నారు. రెండు సామాజికవర్గాల నిర్ణయమైపోయింది కాబట్టి అభ్యర్థులెవరో తేలాల్సివుంది. ఇక మూడో సీటు దగ్గరు కసరత్తు సాగుతోంది. దాన్ని వెలమలకు ఇవ్వాలా? రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా? అనే విషయమై తర్జన భర్జన పడుతున్నారు.

2014 రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఒక్క స్థానమే గెలుచుకునే అవకాశం ఉండటంతో దాన్ని బీసీ వర్గానికి చెందిన కే.కేశవరావుకు ఇచ్చారు. 2016 ఎన్నికల్లో ఇద్దరిని ఎన్నిక చేయించుకునే వీలుండటంతో కాంగ్రెసు నుంచి ఫిరాయించిన ధర్మపురి శ్రీనివాస్‌ అలియాస్‌ డీఎస్‌కు (బీసీ), వి.లక్ష్మీకాంతారావుకు (బ్రాహ్మణ) ఇచ్చారు. కొన్నిరోజుల కిందట టీడీపీ నుంచి అధికార పార్టీలో చేరిన ఉమా మాధవరెడ్డి తనకు రాజ్యసభ సీటు కావాలని అడిగినట్లు సమాచారం. మూడో సీటు వెలమలకు ఇవ్వాలనుకుంటే కేసీఆర్‌ తన దగ్గరి బంధువైన జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ పేరు రిజర్వు చేసి వుంచారని నాయకులు చెబుతున్నారు. మరి మూడో సీటు అదృష్టం ఎవరిని వరిస్తుందో....