Advertisement


Home > Politics - Political News
కేసీఆర్ వ‌ర్సెస్ ప్ర‌తిప‌క్షాలు.. మ‌ధ్య‌లో పోలీసులు

ఏ రాజ‌కీయ పార్టీ అధికారంలో ఉన్నా పోలీసుల‌ను త‌మ తొత్తులుగా చేసుకుని అవ‌స‌రానికి త‌గ్గట్టు వాడుకోవ‌డం మ‌న రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటే. అలాగే పోలీసులు కూడా త‌మ ప్ర‌యోజ‌నాల కోసం అధికార పార్టీ నేత‌లు తానా అంటే తందానా అంటూ వారు చెప్పిన‌దానికి త‌లూపుతుంటారు కూడా. అయితే రాజ‌కీయ నాయ‌కులు, పోలీసుల మైత్రిలో వారి వారి హ‌ద్దులు సూచిస్తూ ఒక చిన్న రేఖ ఉంది. అదిగో ఆ రేఖ దాటిన‌ప్పుడే  ఇలాంటి త‌ల‌నొప్పులు..

హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ ద‌గ్గ‌ర‌ ధ‌ర్నాచౌక్ అని ప్ర‌జ‌లు త‌మ నిర‌స‌న‌లు తెలుపుకునే ప్రాంతం ఒక‌టుంది. అయితే వాస్త‌వానికి ఈ ధ‌ర్నాచౌక్ గ‌తంలో స‌చివాల‌యానికి ఎదురుగానే ఉండేది. అయితే నిర‌స‌న‌కారులు చీటికీ మాటికీ స‌చివాల‌య ముట్ట‌డి అని బ‌య‌లుదేరుతుండ‌డంతో రోజూ ఇదేం పోడు రా బాబూ అని తీసుకెళ్లి ఎక్క‌డో ఇందిరా పార్క్ ద‌గ్గ‌ర ప‌డేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అస‌లు అక్క‌డ కూడా ధ‌ర్నాచౌక్ ఎందుకుండాలి, ప్ర‌జ‌లు ధ‌ర్నాలు చేయ‌కుండా బ‌త‌క‌లేరా అని త‌ల‌చి ఇందిరా పార్క్ నుంచి దాన్ని ఊర‌వ‌త‌లికి త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నించాడు.

ధ‌ర్నాల‌తో స్థానికులు ఇబ్బందిప‌డుతున్నార‌ని, వారి డిమాండ్ మేర‌కే ధ‌ర్నా చౌక్ త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాము త‌ప్ప అందులో మా ప్ర‌మేయం ఏమీ లేద‌ని వంక‌పెట్టాడు.

దీనిపై మండిప‌డ్డ ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మై సోమ‌వారం ధ‌ర్నాచౌక్ వ‌ద్ద భారీ ధ‌ర్నాకు పిలుపునిచ్చాయి. దీనికి ప్ర‌తిగా ప్ర‌భుత్వం కూడా స్థానికుల చేత ధ‌ర్నా చౌక్ కు వ్య‌తిరేకంగా ఒక స్పాన్స‌ర్డ్ ధ‌ర్నాను నిర్వ‌హించ‌బోయి న‌వ్వుల‌పాలైంది.

ఈ ప్ర‌భుత్వ స్పాన్స‌ర్డ్ ధ‌ర్నాకు జ‌నం రాక‌పోవ‌డంతో ఏకంగా కొంత‌మంది పోలీసుల‌నే యూనిఫాం ఇప్పేసి సివిల్ డ్ర‌స్‌లో ఆ ధ‌ర్నాలో ప్ల‌కార్డులు ప‌ట్టుకోమ‌ని పుర‌మాయించింది. అందులో ఒకామె హైద‌రాబాద్‌లోని హుస్సేన్‌సాగ‌ర్‌లో ఎవ‌రూ దూక‌కుండా, నెక్లెస్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్‌లు చేయ‌కుండా క‌ట్ట‌డి చేసే లేక్‌పోలీస్ స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్‌. ధ‌ర్నాచౌక్‌ను తొల‌గించండి..స్థానికుల ఇబ్బందుల‌ను తీర్చండి అంటూ ప్ల‌కార్డు ప‌ట్టుకున్న ఈమెకు గుర్తుప‌ట్టిన ఫోటోగ్రాఫ‌ర్లు ఆమె ఫోటోల‌ను తీసి ఎంచ‌క్కా ముద్రించారు. దీంతో అంతో ఇంతో ఉన్న పోలీసు డిపార్ట్‌మెంట్ ప‌రువు కాస్త‌ హుస్సేన్‌సాగ‌ర్‌లో క‌లిసిపోయింది.

చేసిన వ‌క్ర‌ప‌ని బ‌య‌ట‌ప‌డే స‌రికి ప్ర‌భుత్వం డ్యామేజీ కంట్రోల్ చ‌ర్య‌ల‌కు దిగింది. బాధ్య‌త గ‌ల పోలీసుగా ఉంటూ ధ‌ర్నాలు చేస్తావా అంటూ తిరిగి స‌ద‌రు సీఐ మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆమెను బ‌దిలీ చేసింది.

ఈ క‌థ‌లో నీతేంటి..రాజ‌కీయ నాయ‌కుల‌కు పోలీసుల‌కు మ‌ధ్య రాజీ ఉండొచ్చు. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు న‌డుచుకోవాల్సి రావ‌చ్చు. కానీ పైన చెప్పిన రేఖ‌ను దాట‌కూడ‌దు. అలా చేస్తే చివ‌రికి న‌ష్ట‌పోయేది, క‌ష్ట‌ప‌డేది పోలీసులే.

ప్ర‌భుత్వ ఒత్తిడి, డిపార్ట్‌మెంట్ ప్రోద్బ‌లం లేక‌పోతే ధ‌ర్నాలు చేయ‌డానికి సీఐకి ఏమి ప‌నిపాటా లేదా. ప్ర‌భుత్వ‌మే ధ‌ర్నా చేయిస్తుంది.. మ‌ళ్లీ అదే ప్ర‌భుత్వం బ‌దిలీ చేస్తుంది. బుర‌ద ప‌డింది.. ప‌రువు పోయింది మాత్రం పోలీసుల‌కు.. అందుకే హ‌ద్దు తెలుసుకోవాలి.. లేక‌పోతే ఇలాగే అభాసుపాల‌వ‌క త‌ప్ప‌దు మ‌రి.

న‌యూం లాంటి గ్యాంగ్‌స్ట‌ర్‌ను త‌యారుచేసిన తెలంగాణ పోలీసుల‌కు ఈ లాజిక్ తెలియ‌ద‌ని కాదు. తెలుసు.. కానీ కొన్ని సార్లు అంతే...