Advertisement

Advertisement


Home > Politics - Political News

భ‌విష్య‌త్ రాజ‌కీయంపై క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్!

భ‌విష్య‌త్ రాజ‌కీయంపై క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్!

బీజేపీని చిత్తు చేశామ‌ని... కాంగ్రెస్ వాళ్ల‌కు, భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్య‌తిరేక ప్రాంతీయ పార్టీల నేత‌ల‌కు త‌న ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో పెద్ద పీట‌లు వేయ‌డం ఏమీ చేయ‌లేదు! సోనియానో, మాయ‌వ‌తినో, దేవేగౌడ‌నో..లేక చంద్ర‌బాబునో పిలిచి..పేరంటంలా ప్ర‌మాణ స్వీకారోత్స‌వం చేసుకోలేదు. బీజేపీని ఓడించామ‌ని.. ఇక బీజేపీ వ్య‌తిరేక కూట‌మ‌నో లేక ఆప్ దేశ వ్యాప్తంగా బీజేపీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటుంద‌నే ప్ర‌క‌ట‌న‌లు కూడా ఏవీ చేయ‌లేదు! ప్ర‌మాణ స్వీకారోత్స‌వాన్ని పూర్తిగా రాజ‌కీయంతో నిమిత్తం లేన‌ట్టుగా పూర్తి చేశారు ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్. 

సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ముందు ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ ఓడిపోతే అక్క‌డ‌కు ఆ పార్టీ వ్య‌తిరేక నేత‌లంతా ఈగ‌ల్లా వాలారు. క‌ర్ణాట‌క‌లో కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో చంద్ర‌బాబు నాయుడు, మాయ‌వ‌తి, మ‌మ‌త‌, సోనియా, రాహుల్.. వీళ్లంతా హ‌డావుడి చేశారు. ఆ త‌ర్వాత ఏమైందో అంద‌రికీ తెలిసిందే. తామంతా క‌లిసి బీజేపీని ఓడిస్తామంటూ వీరు ప్ర‌గ‌ల్బాలు ప‌లికారు. క‌ట్ చేస్తే ఎన్నిక‌ల్లో వీళ్లు చిత్తు అయ్యారు. మోడీ మ‌రోసారి ప్ర‌ధాని అయ్యారు.

చంద్ర‌బాబు లాంటి వాళ్ల‌కు ఛాన్స్ ఉండి ఉంటే.. ఇప్పుడు కూడా ఆప్ గెలుపును అలాగే సెల‌బ్రేట్ చేసే వాళ్లేమో. అయితే చంద్ర‌బాబే ఇప్పుడు బీజేపీ ప్రాపకం కోసం ఆరాట‌ప‌డుతూ ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇలాంటి వాళ్లంద‌రూ కేజ్రీవాల్ పిలిచినా వెళ్లే ప‌రిస్థితుల్లో లేరు. కేజ్రీవాల్ కు కూడా త‌త్వం బోధ‌ప‌డింది. అన‌వ‌స‌ర‌మైన హ‌డావుడి లేకుండా.. ప్ర‌మాణ స్వీకారోత్స‌వం విజ‌యోత్స‌వంలా కాకుండా, బీజేపీని చిత్తు చేస్తామ‌నే మాట‌లు  లేకుండా పూర్తి చేసుకున్నారు. 

పైపెచ్చూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఆహ్వానించారు కేజ్రీ. దేశంలో మ‌రే రాజ‌కీయ ప్ర‌ముఖుడినీ, ఏ రాష్ట్ర సీఎంను ఈ కార్య‌క్ర‌మానికి పిల‌వ‌లేదు. కేవ‌లం మోడీని మాత్ర‌మే, ప్ర‌ధానిని మాత్ర‌మే ఆ హోదాలో పిలిచారు. ఆయ‌న హాజ‌రు కాలేద‌నుకోండి. బీజేపీ చిత్తు అయిన నేప‌థ్యంలో మోడీ హాజ‌రు కాలేరు స‌హ‌జంగానే. కేజ్రీవాల్ మాత్రం హుందాగా వ్య‌వ‌హ‌రించి, త‌న రాజ‌కీయ ప‌ర‌ప‌తి ప్ర‌ధానంగా ఢిల్లీకే ప‌రిమితం అయిన విష‌యాన్ని గ్ర‌హించిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఇలా త‌న భవిష్య‌త్ రాజ‌కీయ ప‌య‌నం మీద కూడా ఆయ‌న స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్టుగా అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?