Advertisement


Home > Politics - Political News
చంద్రబాబు మెదడు ఓ క్షుద్ర ప్రపంచం

"రాజ్యాంగం లేదు. చట్టాలు వర్తించవు. అన్ని వ్యవస్థలు అవినీతిమయం. నాలుగేళ్ల కిందట విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రస్తుత పాలనకు సంబంధం లేని విధంగా అబద్ధాలతో పాలన సాగిస్తున్నారు. ఈ చంద్రబాబు నోరు ఓ అబద్ధాల ఫ్యాక్టరీ. చంద్రబాబు మెదడు ఓ పెద్ద క్షుద్ర ప్రపంచం."

ఇలా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు వైఎస్ఆర్సీ అధినేత జగన్. మహాసంకల్ప యాత్రలో భాగంగా అశేష జనవాహిని మధ్య తూర్పుగోదావరి జిల్లాలోకి దిగ్విజయంగా అడుగుపెట్టిన జగన్.. కోటిపల్లి బస్టాండ్ సెంటర్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నోటిని అబద్ధాల ఫ్యాక్టరీగా అభివర్ణించారు జగన్.

తను పాదయాత్ర చేస్తే, ప్రజలంతా ఒకేసారి వస్తే గోదావరి బ్రిడ్జి కూలిపోతుందని చంద్రబాబు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారని.. కానీ కూలిపోయేది బ్రిడ్జి కాదని, త్వరలోనే బాబు సర్కార్ కూలిపోతుందని అన్నారు జగన్. అయినా కూలిపోవడానికి బ్రిడ్జి కట్టింది చంద్రబాబు కాదని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల నుంచి రెండే సినిమాల్ని రిపీట్ చేసి చూపిస్తున్న చంద్రబాబు, ఇంటికెళ్లే టైం వచ్చిందన్నారు.

"నాలుగేళ్లుగా చంద్రబాబు 2అబద్దపు సినిమాలు చూపిస్తున్నారు. అమరావతి అనేది మొదటి సినిమా. 3-6 నెలలకు ఓసారి గ్రాఫిక్స్ చూపిస్తారు. అదిగో సింగపూర్, ఇదిగో రాజధాని అంటారు. నాలుగేళ్లుగా ఇదే సినిమా. ఇక రెండో సినిమా పోలవరం. కాస్త కలెక్షన్లు ఎక్కువ రాబట్టడానికి వారానికోసారి పోలవరం అంటాడు. సోమవారం వస్తే చాలు బాబుకు పోలవరం గుర్తొస్తుంది. ఇలాంటి రెండు అబద్ధపు సినిమాలతో నాలుగేళ్లు కాలం గడిపేశారు చంద్రబాబు."

అమరావతిలో శాశ్వత నిర్మాణం దిశగా ఒక్క ఇటుక కూడా పడలేదని జగన్ విమర్శించారు. ఇక పోలవరం విషయానికొస్తే పునాది గోడ అయిన డయాఫ్రం వాల్ కట్టి పబ్లిసిటీ కోసం జాతికి అంకితం ఇచ్చారని అన్నారు జగన్. ఇల్లు కట్టకుండానే గృహప్రవేశం చేసినట్టు, పోలవరం విషయంలో చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. 

గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మురళీ మోహన్ ఇద్దరూ చంద్రబాబుకు లంచాలిస్తూ ఇసుక మాఫియాను నడిపిస్తున్నారని.. ఈ లూటీలో చినబాబుకు కూడా భాగముందని ఆరోపించారు జగన్.