Advertisement

Advertisement


Home > Politics - Political News

కింజరాపు బ్ర‌ద‌ర్స్ అలియాస్ రౌడీస్‌

కింజరాపు బ్ర‌ద‌ర్స్ అలియాస్ రౌడీస్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కింజ‌రాపు అనే ఇంటి పేరు రాజ‌కీయంగా చాలా పాపుల‌ర్‌. కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు టీడీపీ అగ్ర‌నేత‌గా ఓ వెలుగు వెలిగారు. రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. అన్న బ‌తికి ఉండ‌గానే త‌మ్ముడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అన్న చాటు త‌మ్ముడిగా రాజ‌కీయంగా ఎదుగుతూ వ‌చ్చారు. అన్న మ‌ర‌ణానంత‌రం టీడీపీలో ముఖ్య నాయ‌కుడిగా, చంద్ర‌బాబుకు న‌మ్మ‌క‌మైన నేత‌గా అచ్చెన్నాయుడు గుర్తింపు పొందారు. ఆ గుర్తింపే నేడు ఏపీ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి రావ‌డానికి కార‌ణ‌మైంది.

అచ్చెన్నాయుడి నోటి దురుసు ఆయ‌న‌కు స‌మ‌స్య‌లు తెచ్చి పెడుతోంది. ఈఎస్ఐ కుంభ‌కోణంలో ఆయ‌న జైలుపాలు కావాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌మ‌కు వ్య‌తిరేకంగా స్వ‌గ్రామం నిమ్మాడ‌లో స‌ర్పంచ్‌గా నిలిచిన వ‌రుస‌కు సోద‌రుడైన వ్య‌క్తిని బెదిరించిన కేసులో మ‌రోసారి జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. దీన్ని బ‌ట్టి అచ్చెన్నాయుడి కుటుంబంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఓ క‌న్నేసి ఉంచింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ నేప‌థ్యంలో  కొంద‌రు కింజ‌రాపు సోద‌రుల‌తో పాటు అచ్చెన్నాయుడు అనుచ‌రుల‌పై పోలీసులు రౌడీషీట్ తెర‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరివరప్రసాద్, ప్రసాద్‌ కుమారుడు కింజరాపు సురేష్, అనుచరుడు కింజరాపు కృష్ణమూర్తిపై రౌడీషీట్‌ నమోదు చేసినట్లు శ్రీ‌కాకుళం జిల్లా టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, కోటబొమ్మాళి ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.  

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన కింజరాపు హరివరప్రసాద్, కింజరాపు సురేష్, కింజరాపు కృష్ణమూర్తి తదితరులను పలు కేసుల్లో నిందితులుగా గుర్తించి బైండోవర్ చేశామ‌ని, బైండోవర్ నిబంధ‌న‌లు ఉల్లంఘించడంతో రౌడీషీట్‌ తెరిచినట్లు వారు పేర్కొన్నారు.

రౌడీషీట్‌ తెరిచేందుకు కార‌ణ‌మైన ప‌లు కేసుల వివ‌రాల‌ను  టెక్కలి సీఐ, కోటబొమ్మాళి ఎస్‌ఐ వెల్ల‌డించారు. 2008లో నిమ్మా డ‌లో కింజ‌రాపు గ‌ణేష్‌, అత‌ని కుమార్తెపై దాడి, అలాగే 2010లో అదే గ్రామానికి చెందిన మెండ పోత‌య్య‌పై దాడిపై కేసులు న‌మోద‌య్యాయి. 2020లో  స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడకు చెందిన బమ్మిడి లక్ష్మి అనే మహిళ వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్‌ వేశారు. దీంతో కింజరాపు కృష్ణమూర్తి తదితరులు బమ్మిడి లక్ష్మిపై బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

2021లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నియోజకవ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దువ్వాడ శ్రీ‌నివాస్‌, నిమ్మాడ వైసీపీ త‌ర‌పు సర్పంచ్  అభ్య‌ర్థి కింజరాపు అప్పన్నల‌పై హత్యాయత్నంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు భంగం కలిగించిన కింజరాపు హరివరప్రసాద్, ఆయన కుమారుడు కింజరాపు సురేష్‌లపై కేసులు నమోదు చేశారు.

ఈ నేప‌థ్యంలో బైండోవ‌ర్ కేసుల్లో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన కార‌ణంగా రౌడీషీట్ ఓపెన్ చేసిన‌ట్టు పోలీస్ ఉన్న‌తాధికారులు తెలిపారు. భవిష్యత్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు వారిపై రౌడీషీట్‌ నమోదు చేసినట్లు సీఐ, ఎస్‌ఐలు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి కింజ‌రాపు బ్ర‌ద‌ర్స్ ఇప్పుడు శ్రీ‌కాకుళం రౌడీల‌న్న మాట‌. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?