cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మనిషే కాదు... మరణమూ వివాదాస్పదమే..!

మనిషే కాదు... మరణమూ వివాదాస్పదమే..!

'పల్నాటి పులి' కోడెల శివప్రసాదరావు చనిపోయారు. ఇది వాస్తవం. కాని ఎలా చనిపోయారు?... ఇది వివాదాస్పదమైన అంశంగా మిగిలింది. పులి ఆత్మహత్య చేసుకుంటుందా? చేసుకోదు. దాన్ని ఎవరైనా చంపాలి లేదా వయసు మీదపడి కాలధర్మం ప్రకారం మరణించాలి. అంతేకదా. పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడా? ఇదీ ఆయన అభిమానులు వేసుకుంటున్న ప్రశ్న. దేశంలో కోడెలకు మించిన అవినీతిపరులు, పెద్ద పెద్ద కుంభకోణాల్లో కీలకంగా వ్యవహరించిన నాయకులు, హత్యలు చేయించినవారు, ఆ కేసుల్లో ఇరక్కున్నవారు చాలామంది ఉన్నారు. మరి వారు ఆత్మహత్యలు చేసుకోలేదేం?

మాజీ స్పీకర్‌ అభిమానుల్లో సందేహం. కోడెల తనకు తానే చనిపోయారా? చంపేశారా? చనిపోతే ఏ వ్యాధితో చనిపోయారు? చంపితే ఎవరు చంపారు? రాజకీయ ప్రత్యర్థులా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆ పని చేశారా?... ఇలాంటి చాలా ప్రశ్నలు తెరముందుకు వస్తున్నాయి. హైదరాబాద్‌ పోలీసులు కోడెలది అనుమానాస్పద మృతి అంటున్నారు. అదేవిధంగా కేసు బుక్‌ చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అసలు సంగతి తేలుతుందని చెప్పారు. ఈలోగా రకరకాల కథనాలు తెర మీదికి వచ్చాయి.

టీడీపీ అనుకూల మీడియా నెపం జగన్‌ ప్రభుత్వం మీద వేసింది. ఆ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి కోడెలను అనేక విధాలుగా వేధిస్తోందని, కేసులు పెట్టిందని, అవమానకరంగా వ్యవహరించిందని, ఇవన్నీ తట్టుకోలేకనే మనస్తాపంతో డాక్టర్‌గారు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతోంది. ఇదో కోణం. ఇక కోడెల బంధువుల్లో, హార్డ్‌కోర్‌ అభిమానుల్లో కొందరు ఇది హత్య కావచ్చంటున్నారు. ఇందుకు కారణం కుటుంబ ఆస్తుల తగాదాలు.

దీని కారణంగా హత్య జరిగివుంటే ఇంట్లో వారే ఎవరో ఒకరు ఈ పని చేసివుండాలి. ఆ పని ఎవరు చేసుంటారు? ఆయన కొడుకే చేసి ఉంటాడని కోడెల సన్నిహిత బంధువు ఒకాయన అనుమానం. కంచేటి సాయి అనే ఈ బంధువు కోడెల కుమారుడు డాక్టర్‌ శివరామకృష్ణపై సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన హైదరాబాదులో జరిగింది. అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి కోడెల కుమారుడిపై అక్కడే ఫిర్యాదు చేయాలని సత్తెనపల్లి పోలీసులు సలహా ఇచ్చారు. కుమారుడు శివరామ్‌ కోడెలను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆ బంధువు చెబుతున్నాడు.

తనను కుమారుడు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు కోడెల అనేకసార్లు తనకు చెప్పారని బంధువు కథనం. ఆస్తులు తన పేరుతో బదిలీ చేయకపోతే చంపుతానని కుమారుడు కోడెలను బెదిరించాడట. కాబట్టి కోడెల మరణానికి, శివరామ్‌కు లింకు ఉందేమో దర్యాప్తు చేయాలని బంధువు అంటున్నాడు. కోడెల మిత్రులు, అభిమానులు చాలామంది ఇది ఆత్మహత్యంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నారు.

అయితే కోడెల నెల క్రితం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పట్లో ఆయన అల్లుడి ఆస్పత్రిలోనే చికిత్స చేశాక బతికి బయటపడ్డారు. మరి ఈసారి ఎలాగైనా సరే చనిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారా? ఒకప్పుడు కోడెలకు 'బాంబుల శివప్రసాద్‌' అనే పేరుండేది. ఆయన్ని ఇంటర్వ్యూ చేసే మీడియావారు ఈ ప్రస్తావన తప్పనిసరిగా తెచ్చేవారు. తాను ఏ పాపమూ ఎరుగనని ఈయన చెప్పేవారు. అదో కథలెండి.

ఇక రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన ఏపీకి తొలి స్పీకరుగా కోడెల రికార్డులకెక్కారు. బాగానే ఉంది. కాని టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అత్యంత వివాదాస్పదుడిగా చరిత్రకెక్కారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో వైకాపా ఆయనపై ఉధృతంగా పోరాటం చేసింది. ఆరోపణలు గుప్పించింది. స్పీకరుగా ఆయన నిర్ణయాలను, వ్యవహారశైలిని కడిగిపారేసింది. అయినప్పటికీ శివప్రసాద్‌ ఎంతో కూల్‌గా ఉన్నారు. దేనికీ చలించలేదు. పార్టీ ఫిరాయింపుల (వైకాపా నుంచి టీడీపీలోకి) వ్యవహారం, ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌, మహిళలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు, అసెంబ్లీ నిర్మాణ సమయంలో ఆయన వ్యవహారశైలి... ఇలాంటివి ఎన్నో గగ్గోలు రేపాయి.

రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ టీడీపీ నాయకుడిగా పనిచేయడానికి వెనకాడలేదు. సైకిల్‌ యాత్రలో, ఇతర కార్యక్రమాల్లో పార్టీ కండువా వేసుకొని పాల్గొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కోడెలకు సంబంధించి ఏం జరిగిందో తెలిసిందే. ఆయన కుమారుడు శివరామ్‌, కూతురు విజయలక్ష్మి చేసిన అరాచకాలు కోడెల పరువుప్రతిష్టలను దిగజార్చాయి.

ప్రభుత్వ వేధింపుల కారణంగానే ఆయన చనిపోయారనడాన్ని పూర్తిగా నమ్మలేం. కుటుంబ సమస్యలు, సంతానం అరాచకాలు కూడా ఆయన్న వేదనకు గురిచేశాయనేది వాస్తవం. ఏదిఏమైనా  'ప్రజా డాక్టర్‌'గా మంచి పేరు తెచ్చుకున్న కోడెల రాజకీయ జీవితం విషాదాంతంగానే కాదు, వివాదాస్పదంగా ముగిసింది.

గ్రేట్ ఆంధ్ర ఈవారం స్పెషల్ బిగ్ స్టోరీ