cloudfront

Advertisement


Home > Politics - Political News

కోడి కత్తి.. చంద్రబాబూ ఏంటీ సుత్తి.?

కోడి కత్తి.. చంద్రబాబూ ఏంటీ సుత్తి.?

'కోడి కత్తి' కేసు.. అంటూ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద జరిగిన హత్యాయత్నాన్ని నీరుగార్చేందుకు తెలుగుదేశం పార్టీనే కాదు, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తోన్న మీడియా సైతం విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే, 'పచ్చ రాజకీయం' ఎక్కువ కాలం పై చేయి సాధించలేకపోయింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగ ప్రవేశంతో ఒక్కసారిగా ఈ 'కేసు' స్వరూపమే మారిపోయింది. హైకోర్టు సైతం, ఎన్‌ఐఏకి కేసు అప్పగించాలని సూచించడం, అంతకు ముందే కేంద్ర హోంశాఖ స్పందించడంతో విచారణ ఈ స్థాయికి వచ్చిందిగానీ, లేకపోతే.. వైఎస్‌ జగన్‌ మీద జరిగిన హత్యాయత్నం కేసు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేదే. 

ఇప్పటికీ చంద్రబాబు, ఈ కేసుని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. పదే పదే, 'రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడమేంటి.? ఎన్‌ఐఏకి ఈ కేసు విచారణ ఎలా అప్పగిస్తారు.? ఎన్‌ఐఏ విచారణకు మేం ఒప్పుకోం..' అంటూ చంద్రబాబు సర్కార్‌ అహంకారం ప్రదర్శించడం హాస్యాస్పదం కాక మరేమిటి.? 

నిజానికి, జగన్‌పై హత్యాయత్నం జరిగింది విశాఖ విమానాశ్రయంలో.. అక్కడి భద్రత కేంద్రం చేతుల్లో వుంటుంది కాబట్టి, ఆ ఘటనతో తమకు సంబంధం లేదని చంద్రబాబు సర్కార్‌ గతంలోనే ప్రకటించుకుంది. అలాంటప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపితే చంద్రబాబుకి వచ్చిన సమస్య ఏమిటి.? ఏదో వుంది.. ఆ మతలబు ఏంటన్నది విచారణలో తేలుతుంది. 

రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి 'సిట్‌' ఏర్పాటయ్యింది. ఇక్కడా చాలా పెద్ద విచిత్రమే చోటు చేసుకుంది. అదేంటంటే, తొలుత రాష్ట్ర డీజీపీ, వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని చాలా లైట్‌గా చూపేందుకు ప్రయత్నించారు. 'అది పబ్లిసిటీ స్టంట్‌.. సంచలనం కోసం చేసిన దాడిగా భావిస్తున్నాం.. నిందితుడు వైఎస్‌ జగన్‌ అభిమాని' అని ప్రకటించేశారాయన. సాక్షాత్తూ డీజీపీ, ఆ కేసుని అంత లైట్‌గా తీసుకుంటే, సిట్‌ 'లోతుగా' విచారణ జరుపుతుందని ఎలా అనుకోగలం.? 

కేసు ఇప్పుడు ఎన్‌ఐఏ పరిధిలోకి వెళ్ళింది గనుక, ఆ కేసు వివరాల్ని ఎన్‌ఐఏకి అందించాల్సిన బాధ్యత 'సిట్‌'దే. కానీ, 'సిట్‌' అందుకు ససేమిరా అంటోందన్న వార్తలు వెలువడ్తున్నాయి. చేసేది లేక, ఎన్‌ఐఏ కోర్టును ఆశ్రయించింది. ఇంకోపక్క, ఎన్‌ఐఏ విచారణ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, చంద్రబాబు సర్కార్‌ కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే చట్టపరమైన సమస్యలుంటాయా.? అన్న భయం మాత్రం చంద్రబాబు సర్కార్‌ని వెంటాడుతోందనుకోండి.. అది వేరే విషయం. 

తెరవెనుక 'కపట రాజకీయం' లేకపోతే చంద్రబాబు భయపడాల్సిన పనిలేదు. కానీ, భయపడ్తున్నారంటే.. వైఎస్సార్సీపీ అనుమానాలే నిజమనే విషయం స్పష్టమవుతోంది.