Advertisement

Advertisement


Home > Politics - Political News

కేటీఆర్ కు ఇప్పుడు నొప్పి తెలుస్తోంది

కేటీఆర్ కు ఇప్పుడు నొప్పి తెలుస్తోంది

తెలంగాణా ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ఇప్పుడు నొప్పి తెలుస్తోంది. నొప్పి అంటే కడుపు నొప్పో, తలనొప్పో, ఒళ్ళు నొప్పులో కాదు. మానసిక బాధ. తన తండ్రి కేసీఆర్ ను బీజేపీ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడంటూ ఆవేశంతో ఊగిపోయాడు.

నిన్న ఆయన వరంగల్లో పర్యటించాడు. అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొన్నిపనులకు శంకుస్థాపనలు చేశాడు. కొన్ని పనులకు ప్రారంభోత్సవాలు చేశాడు. ఈ సందర్భంగా బీజీపీ మీద విరుచుకుపడ్డాడు. ఎప్పటి మాదిరిగానే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని మండిపడ్డాడు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి చేసిందేమీ లేదన్నాడు. ఇవన్నీ కాదు. అసలు చెప్పుకోవాల్సిన విషయం బండి సంజయ్ ని కడిగిపారేయడం. 

సంజయ్ గానీ, బీజేపీ నాయకులుగానీ ఇక మీదట సీఎం కేసీఆర్ ను ఏమైనా అంటే ఊరుకునేదిలేదని కేటీఆర్ హెచ్చరించాడు. కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నారని ఆవేదన చెందాడు. ఆయన పదవికి, వయసుకు విలువ ఇవ్వడం లేదని బాధ పడ్డాడు. ఇకనుంచి కేసీఆర్ ను ఏమైనా అంటే మోడీని, అమిత్ షాను ఉతికి ఆరేస్తామన్నాడు. సంజయ్ మాదిరిగా మాట్లాడటం తమకూ వచ్చని చెప్పాడు. ఇదే చివరి హెచ్చరిక అంటూ సంజయ్ కు వార్నింగ్ ఇచ్చాడు.

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇలా వ్యూహాత్మకంగా మాట్లాడాడా ? లేక కేటీఆర్ కు నిజంగానే కోపం వచ్చిందా ? ఆయనకు కోపం రావడం సహజమే. బండి సంజయ్ దాదాపు ప్రతిరోజూ కేసీఆర్ మీద రెచ్చిపోతుంటాడు. చాలా పరుషంగానే మాట్లాడతాడు. గతంలో డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పొలైట్ గానే వ్యవహరించాడు. ఇంతలా ఎప్పుడూ రెచ్చిపోలేదు.

అయితే కేటీఆర్ ఇంతగా బాధపడాల్సింది ఏమీ లేదు. సీరియస్ గా తీసుకోవలసింది కూడా ఏమీ లేదు. ప్రస్తుత రాజకీయాల్లో పరుషంగా విమర్శలు చేయడం, హద్దులు మీరి బూతులు తిట్టుకోవడం చాలా సర్వసాధారణమైంది. పాపం ...కేసీఆర్ ఎప్పుడూ ఎవరినీ బూతులు తిట్టలేదనుకుంటే సంజయ్ మాట్లాడే తీరును తప్పు పట్టాల్సిందే. హెచ్చరించాల్సిందే. కానీ కేసీఆర్ కు బండ బూతులు మాట్లాడిన చరిత్ర ఉంది. తెలంగాణా ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటినుంచి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రత్యర్థులను బూతులు తిట్టారు. 

ఆయన పొలైట్ గా విమర్శలు చేసిన దాఖలాలు దాదాపుగా లేవు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాకు కేసీఆర్, ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రులయ్యారు. అప్పుడు చంద్రబాబును కేసీఆర్ తిట్టిన తిట్లు కేటీఆర్ ఒకసారి గుర్తు చేసుకుంటే సంజయ్ తక్కువే తిడుతున్నాడని చెప్పుకోవాలి. 

చంద్రబాబు కేసీఆర్ కు ప్రత్యర్థి కావొచ్చు. కానీ ఆయన మంత్రివర్గంలో కేసీఆర్ పనిచేశారు. వయసులో, అనుభవంలోనూ చంద్రబాబు పెద్ద. కానీ కేసీఆర్ ఆయనకు ఏం గౌరవం ఇచ్చారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇప్పటికీ చంద్రబాబు ఇతర నాయకుల్లా బూతులు మాట్లాడరు.  ఒక సందర్భంలో  కేసీఆర్ చంద్రబాబును ఉద్దేశించి నువ్వు ఒక అమ్మకు అయ్యకు పుడితే ..అని కూడా అన్నారు.

అప్పట్లో కేసీఆర్ భాషపైన చాలా విమర్శలు వచ్చాయి. అప్పుడాయన తాను మాట్లాడేతీరును తెలంగాణా మొత్తానికి అంటగట్టారు. అవునయ్యా ... మా తెలంగాణా భాషే అంత.   అట్లనే మాట్లాడతాం అన్నారు. తెలంగాణా ఉద్యమంలో సోనియా గాంధీని ఎన్ని తిట్లు తిట్టలేదు ? కేసీఆర్ బూతుల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. సన్నాసులు, దద్దమ్మలు అనకుండా ఆయన మాట్లాడలేరు. 

ఎంతగనం బూతులు తిడితే రాజకీయాలు అంత రక్తి కడతాయనే సూత్రాన్ని కేసీఆరే కనిపెట్టారు. సహజంగానే ఇతర పార్టీల నాయకులు దాన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి తండ్రిని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఇప్పుడు కుమారుడు కేటీఆర్ బాధపడటం అనవసరం. రాజకీయాల్లో గౌరవ మర్యాదలు ఏనాడో మంటగలిశాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?