Advertisement

Advertisement


Home > Politics - Political News

సీఎం పీఠంపై కేటీఆర్..ఫిబ్ర‌వ‌రిలో ముహూర్తం!

సీఎం పీఠంపై కేటీఆర్..ఫిబ్ర‌వ‌రిలో ముహూర్తం!

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఆ రాష్ట్ర మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు బాధ్య‌త‌లు తీసుకోవ‌డం దాదాపు ఖాయ‌మైంద‌నే మాట వినిపిస్తూ ఉంది. ప్ర‌స్తుతం ఈ అంశంపై కేసీఆర్ ఫ్యామిలీ డిస్క‌ష‌న్స్ లో ఉంద‌ని.. అన్నీ కుదిరితే వ‌చ్చే నెల‌లోనే కేటీఆర్ తెలంగాణ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకోబోతున్నార‌ని టీఆర్ఎస్ నేత‌, తెలంగాణ మంత్రి ఒక‌రు ఆఫ్ ద రికార్డుగా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

కేసీఆర్ కు బాగా విధేయుడుగా పేరున్న ఆ మంత్రి ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించ‌డంతో.. కేటీఆర్ సీఎం కాబోతున్నార‌నే అంశం దాదాపు ఖాయ‌మ‌వుతున్న‌ట్టే. కేటీఆర్ ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో చాలా బాధ్య‌త‌ల్లో త‌న‌మున‌క‌లై ఉన్నారు. అటు టీఆర్ఎస్ కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కొన‌సాగుతూ ఉన్నారు.

ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఇప్పుడు కేటీఆర్ కు ముఖ్య‌మంత్రి అనేది హోదా మాత్ర‌మే. 99 శాతం ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌ను కేటీఆర్ స‌మీక్షిస్తున్నార‌నే అభిప్రాయాలున్నాయి. ఇక కేటీఆర్ ను సీఎంగా చేసి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెడ‌తారు అనేది పాత క‌బురే! ప్ర‌స్తుతం  జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ కు ఎంత మేర‌కు అవ‌కాశాలున్నాయ‌నేది ప‌క్క‌న పెడితే.. కేటీఆర్ ను సీఎంగా చేసే ఆలోచ‌న కేసీఆర్ కు ఉంద‌నే ప్ర‌చారం ముందు నుంచి ఉంది. ఇప్పుడు అది కార్య‌రూపం దాల్చ‌బోతోంద‌ని సమాచారం అందుతూ ఉంది.

కేటీఆర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లాంఛ‌న‌మైన ప్ర‌క్రియే అయిన‌ప్ప‌టికీ తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయానికి అది తెర తీస్తుంద‌నేది వేరే చెప్ప‌న‌క్క‌ర్లేని అంశం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో కూడా మార్పు చేర్పులు ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

మంత్రులు ఈటెల‌, త‌ల‌సాని త‌దిత‌రులు కేటీఆర్ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డాన్ని స్వాగ‌తిస్తూ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ కేసీఆరే సీఎం హోదాలో ఉంటే మంచిద‌నేది కొంత‌మంది గులాబీ పార్టీ నేత‌ల మ‌నోగ‌త‌మ‌ట‌. 

ఇక కేటీఆర్ సీఎం సీటును అధిష్టిస్తే అప్పుడు హ‌రీష్ రావు హోదా ఏమిట‌నేది కూడా కీల‌క‌మైన అంశం అవుతుంది. ఇక ఈ అంశంపై స్పందించ‌డానికి కాంగ్రెస్ దాదాపు నిరాక‌రించింది.

ముఖ్య‌మంత్రి మార్పు కేవ‌లం టీఆర్ఎస్ అంత‌ర్గ‌త విష‌య‌మ‌ని కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే కేసీఆర్, కేటీఆర్ లు ఒకే కాయిన్ కు రెండు వైపుల్లాంటి వార‌ని.. కాంగ్రెస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ అన్నారు. పెద్ద తేడా ఉండ‌ద‌న్నారు.

అయితే.. ఇప్ప‌టికే ఉప ఎన్నిక‌లు జీహెచ్ఎంసీ ఫ‌లితాల‌తో వేడెక్కిన తెలంగాణ రాజ‌కీయం.. కేసీఆర్ దిగి కేటీఆర్ సీఎం పీఠాన్ని అధిష్టిస్తే.. మ‌రింత ఆస‌క్తిదాయ‌కంగా మార‌డం ఖాయ‌మే!

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

కామెడీ చెయ్యడం కామెడీ కాదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?