cloudfront

Advertisement


Home > Politics - Political News

కుల నిర్మూల‌న కావాలి ప‌వ‌న్‌

కుల నిర్మూల‌న కావాలి ప‌వ‌న్‌

నా పార్టీ సిద్ధాంతాల్లో కులాల ఐక్యత ఒక‌టి అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌ర‌చూ చెబుతున్నారు. నిజానికి ఆయ‌న‌కు కులాల ప‌ట్ల మోజు ఉంటుంద‌నుకోవ‌డం లేదు. కులాన్ని అడ్డుపెట్టుకుని సొమ్ము చేసుకోవాల‌నే స్వార్థం అంత‌క‌న్నా లేదు. ఆయ‌న్ను కులం అక్కున చేర్చుకుంటోందే త‌ప్ప, కులాన్ని త‌న రాజ‌కీయ భ‌విష్యత్‌కు గొడుగుగా వాడుకోవ‌డం లేద‌నేది వాస్తవం. స‌మాజంలో, రాజ‌కీయాల్లో మార్పుకోసం వ‌చ్చానంటున్న త‌న‌పై కులం ముద్ర వేస్తుండ‌టం ఆయ‌న‌కు ఒకింత ఆవేద‌న మిగుల్చుతోంది. అందుకే ఆయ‌న ప‌దేప‌దే కులాల ఐక్యత గురించి మాట్లాడ‌టం.

మ‌తం మ‌త్తులాంటిద‌ని మార్క్స అన్నారు. కులం కూడా అలాంటిదే. ‘నువ్వు ఏ దిక్కుకి తిరిగినా స‌రే, దారిక‌డ్డంగా నిల‌బ‌డే పెనుభూతం కుల‌వ్యవ‌స్థ‌. ఈ భూతాన్నిచంపి పార‌వేస్తే త‌ప్ప నీవు రాజ‌కీయ సంస్కర‌ణ‌గాని ఆర్థిక సంస్కర‌ణ‌గాని సాధించ‌లేవు’ అని అంబేద్కర్ అన్నారు. ఈ రాష్ర్టమే కాదు, దేశాభివృద్ధికి ప్రధాన అడ్డంకి కుల‌మే. అలాంటి కులాన్ని నిర్మూలించాలే త‌ప్ప ఐక్యం చేయ‌డం ఏంటి? ఈ విష‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అవ‌గాహ‌న‌ను పునఃస‌మీక్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

కుల‌వ్యవ‌స్థను పెనుభూతంగా అంబేద్కర్ అభివ‌ర్ణించారు. అంతేకాదు ఈ భూతాన్ని చంపి పారేయాల‌ని, అప్పుడే రాజ‌కీయ‌, ఆర్థిక సంస్కర‌ణ సాధించ‌వ‌చ్చని అంబేద్కర్ చెప్పిన సారాంశాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ లోతుగా ప‌రిశీలించాలి. ఆ అంశాన్ని జీర్ణం చేసుకోవాలి. ఎందుకంటే త‌న అజెండా రాజ‌కీయ‌, సామాజిక సంస్కర‌ణే కాబ‌ట్టి. ప్రధాన రాజ‌కీయ పార్టీల నేత‌ల్లో లేని సుగుణాలు కొన్ని ప‌వ‌న్‌లో ఉన్నాయి. ఆయ‌న రాజ‌కీయాల్లో విజ‌యానికి బ‌దులు విలువ‌ల‌ను కోరుకుంటున్నారు.

నిజానికి అలాంటి ఆశ‌యాన్ని క‌లిగి ఉండ‌టం ఆశామాషీ కాదు. రాజ‌కీయాలంటేనే ప‌దవులు, డ‌బ్బు సంపాద‌న‌, కీర్తి త‌దిత‌ర అవ‌ల‌క్షణాలుగా నిర్వచ‌నం చెప్పుకుంటున్న రోజులివి. వాటికి భిన్నంగా ప‌వ‌న్ రాజ‌కీయాలు చేస్తానంటూ ప్రజ‌ల మ‌ధ్యకు వ‌చ్చారు. గెలుపోట‌ముల‌ను ప‌క్క పెట్టి, ఒక ఉన్నతాశ‌యంతో కూడిన ఆలోచ‌న‌ను ప్రజ‌ల మ‌న‌సుల్లో మొల‌కెత్తనివ్వండి. ఈ రోజుకాక‌పోతే రేపైనా అది చెట్టుకాక త‌ప్పదు క‌దా.

‘ఒక్క కులాన్ని నమ్ముకుని నేను రాజకీయాల్లోకి రాలేదు. కులాన్ని ఓటు బ్యాంకుగా చూడడంలేదు. సామాజిక న్యాయం కోసమే వచ్చాను. ఇప్పుడున్న పార్టీలు మనుషులను మనుషులుగా కాకుండా ముక్కలుగా, కులాలుగా చూస్తుంటే బాధ కలుగుతోంది’ అని  త‌న అంత‌రంగాన్ని ప‌వ‌న్ ఆవిష్కరించారు.. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరిజిల్లా భీమవరంలో బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, బ్రాహ్మణ సంఘాల నాయకులతో  గురువారం ఆయ‌న మాట్లాడారు.

‘కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడితే బీసీలు దూరమైపోతారని.. వ్యతిరేకంగా మాట్లాడితే కాపులు దూరమైపోతారని లెక్కలు వేసుకుని సమాజాన్ని ముక్కలుగా చీల్చేశారని ఆవేద‌న చెందారు. కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందనేదీ వీళ్లే.. కాపుల వెనక ఉండి రిజర్వేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసేదీ వీళ్లే.. చట్టసభల్లో కూర్చున్న కొందరు నాయకులు మనలో మనకు గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారు’ అని మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి రిజర్వేషన్ల లెక్కలు చూస్తే.. 150శాతం కోటా కావాలేమోనని వ్యంగ్యంగా అన్నారు. కులాల‌ను సొమ్ము చేసుకోవ‌డంపై ప‌వ‌న్ ఈస‌డింపది.

కులం పుట్టిన‌ప్పుడే కుల‌నిర్మూల‌న ఉద్యమం పుట్టిందంటారు. కుల నిర్మూల‌న ఉద్యమానికి సుమారు ఐదువేల చ‌రిత్ర ఉంది. రోజురోజుకూ కుల‌, మ‌త వాస‌న‌లు మ‌రింత‌గా ఘాటెక్కుతూ స‌మాజాన్ని విష‌తుల్యం చేస్తున్నాయి. కులాలు ఉన్నంత వ‌ర‌కు స‌మాజంలోనూ, రాజ‌కీయాల్లోనూ అస‌మాన‌త‌, దోపిడీ ఉంటుంది. కులాల‌ను నిర్మూలించ‌డం వ‌ల్ల మాత్రం అంద‌రికీ మేలు చేసిన‌ట్టవుతుంది.

అణ‌గారిన వ‌ర్గాల‌ను ఆర్థికంగా అభివృద్ధి చేసిన‌ప్పుడే కులాల నిర్మూల‌న సాధ్యమ‌వుతుంది. ఈ విష‌యాల‌న్నింటిని ప‌వ‌న్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ఎందుకంటే కుల‌మ‌నేది చాలా సున్నిత‌మైన అంశం. ఏ మాత్రం బ్యాలెన్స్ త‌ప్పినా తీవ్ర ప‌రిణామాల‌కు దారితీస్తుంది. అత్యంత ప్రజాద‌ర‌ణ క‌లిగిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ కులాల‌ను నిర్మూలించ‌డం త‌న క‌ర్తవ్యంగా భావించి అడుగులు ముందుకు వేయాలి.
-సొదుం ర‌మ‌ణారెడ్డి