cloudfront

Advertisement


Home > Politics - Political News

కూటమి సైతం మెచ్చని లగడపాటి సర్వే.!

కూటమి సైతం మెచ్చని లగడపాటి సర్వే.!

కూకట్‌పల్లి అసెంబ్లీ టిక్కెట్‌ని ఆశించి భంగపడ్డ టీడీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఈ రోజు వెల్లడించిన సర్వేపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'ప్రభుత్వ అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. ఈ రెండు మాత్రమే తెలంగాణ ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. ప్రభుత్వ అనుకూల ఓటు పనిచేస్తే, టీఆర్‌ఎస్‌ 70కి పైగా సీట్లతో విజయం సాధిస్తుంది. ప్రభుత్వ ప్రతికూల ఓటు పనిచేస్తే మాత్రం, మహాకూటమికి అవకాశం దొరుకుతుంది..' అంటూ ఆయన మనసులో మాట బయటపెట్టేశారు. 

జాతీయ స్థాయిలో ఒకటి రెండు సర్వేలు, టీఆర్‌ఎస్‌కి 70 నుంచి 90 సీట్ల దాకా ఇచ్చాయి. ఓ సర్వే, టీఆర్‌ఎస్‌కి 66 సీట్లను కట్టబెట్టింది. మెజార్టీ సర్వేలు మాత్రం, 50 నుంచి 65 సీట్లను టీఆర్‌ఎస్‌కి కట్టబెట్టాయి. ఏ సర్వేలోనూ మహాకూటమికి 55 సీట్లు మించి కన్పించలేదు. ఒక్క లగడపాటి సర్వే మాత్రమే 65 సీట్లు మహాకూటమికేనని పేర్కొంది. అయితే, ఇక్కడా 'ప్లస్‌ ఆర్‌ మైనస్‌' అంటూ ఓ సన్నాయి నొక్కులు నొక్కారు లగడపాటి. 'విచ్చలవిడిగా జరిగిన ఖర్చు' కారణంగానే ఈ 'పది' తేడా.. అన్నది లగడపాటి వాదన. 

నిజానికి, టీఆర్‌ఎస్‌ 50 సీట్లు దక్కించుకుంటే చాలు, తేలిగ్గా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. మజ్లిస్‌ పార్టీ మద్దతు ఎలాగూ టీఆర్‌ఎస్‌కే వుంటుంది. మరో నాలుగైదు సీట్లు లాక్కోవడం టీఆర్‌ఎస్‌కి పెద్ద కష్టం కాదు. ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేస్తే, మహాకూటమిని ముక్కలు చేయడం, ముక్కలయ్యాక విడివిడిగా అందులోని పార్టీల్ని నిర్వీర్యం చేయడం టీఆర్‌ఎస్‌కి చాలా తేలిక. 

ఇదే అభిప్రాయం, చాలామంది మహాకూటమి నేతల్లో వుంది. అభిప్రాయం కాదది, భయం. చంద్రబాబు స్పాన్సర్‌ చేసిన లగడపాటి రాజగోపాల్‌ సర్వే.. కేవలం మూడు రోజుల ఆనందానికి తప్ప, అంతకు మించి ఆ సర్వేకి విలువ ఇవ్వాల్సిన పనిలేదంటూ ఆఫ్‌ ది రికార్డ్‌గా మహా కూటమి నేతలే చెబుతుండడం గమనార్హం.