cloudfront

Advertisement


Home > Politics - Political News

తనకు తాను అగ్నిపరీక్ష పెట్టుకున్న లగడపాటి!

 తనకు తాను అగ్నిపరీక్ష పెట్టుకున్న లగడపాటి!

ఎలాగూ పోలింగ్ అయిపోయింది.. ఇప్పుడు ఎవరో ఒకరికి అనుకూలంగా సర్వేలను ప్రకటించి కూడా ప్రయోజనాలు ఉండవు. ఇప్పుడు మీడియా సంస్థలు చెబుతున్న ఎగ్జిట్ పోల్స్ కూడా వాటి విశ్వసనీయతకు పరీక్ష అవుతాయి. జనాభిప్రాయానికి భిన్నంగా ఏదైనా పార్టీ పట్ల అభిమానంతో ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేలను ఇస్తే సదరు మీడియా సంస్థలే వెర్రివి అవుతాయి. ఒకరకంగా ఎవరికి వారు తమ విశ్వసనీయతకు పరీక్షలు పెట్టుకున్నట్టు.

తెలంగాణ విషయంలో కూడా జాతీయ మీడియా సంస్థలు తమ తమ ఎగ్జిట్ పోల్ సర్వేలను ప్రకటిస్తూ ఉన్నాయి. వీటిల్లో తెరాస హవా ఉంటుందని స్పష్టం అవుతోంది. ఇండియాటుడే అయితే తెరాస దే స్పష్టమైన హవా అంటోంది. మిగతా వాళ్లు కూడా కారు పార్టీ వైపు మొగ్గుచూపారు.

అయితే వాళ్లందరికీ భిన్నమైన ఫలితాలను ప్రకటించాడు లగడపాటి రాజగోపాల్. మహాకూటమిదే అధికారం అని ఈయన ప్రకటించేశాడు. 65 సీట్లకు పది అటూ ఇటూగా సంపాదించుకుని కూటమి అధికారానికి దగ్గర అవుతుందని లగడపాటి అంటున్నాడు.

తెరాసకు 35 సీట్లకు పది సీట్లు అటూ ఇటూ రావొచ్చని అన్నాడు. ఎంఐఎం ఏడు స్థానాల వరకూ , బీజేపీ ఏడు సీట్ల వరకూ అన్నట్టుగా లగడపాటి ప్రకటించాడు. ముందుగా చెప్పినట్టుగా ఏడు నుంచి తొమ్మిది మంది ఇండిపెండెంట్లు గెలవొచ్చని పేర్కొన్నాడు. ఇదీ కథ.

ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి అనేది ఆంధ్రాలో ఒక సామెత. అంతా తెరాస వైపు నిలబడుతుంటే.. ఇప్పుడు కూడా లగడపాటి కూటమి అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ ఏడు సీట్లలో నెగ్గుతుందని చెబుతున్నాడు. ఇది లగడపాటి తనకు తాను పెట్టుకున్న పెద్ద పరీక్ష. ఇప్పుడు గనుక ఈయన జోస్యం తప్పు అయితే.. ఇక ఆంధ్రా అక్టోపస్ కు ఆ ట్యాగ్ మళ్లీ అతుక్కోదు!