cloudfront

Advertisement


Home > Politics - Political News

లగడపాటి కోయిల..ముందే కూసింది!

లగడపాటి కోయిల..ముందే కూసింది!

'ప్రతి సారీ నేను చెప్పిందే నిజం కావాలని లేదు  కదా..' అన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. తన మీద భారీ అంచనాలు ఏమీ పెట్టుకోవద్దని ఈ ఆంధ్రా ఆక్టోపస్ తేల్చి చెప్పారు ఈ మాటతో. ఎగ్జిట్ పోల్స్ రేపు వెల్లడించుకోవచ్చు. అయితే ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ తో ప్రచారం పొందే ప్రయత్నంలో ఉన్న లగడపాటి ఈ రోజే ముందుకు వచ్చేశారు. 'తొందరపడి ఓ కోయిల.. ముందే కూసింది..' అనే పాటను గుర్తు చేసేస్తూ తెలుగుదేశం పాటనే పాడాడు లగడపాటి.

ఏపీ జనాలు సైకిల్ ను ఎంచుకున్నారని ఈయన వ్యాఖ్యానించారు. తద్వారా రేపు తను ఏం చెప్పబోతున్నట్టో ఈ రోజే తెలియచెప్పారు. 'తెలంగాణ రాష్ట్రం పరిస్థితి దర్జాగా ఉంది అక్కడ ప్రజలు కారును ఎంచుకున్నారు. ఏపీ రాష్ట్ర పరిస్థితి బాగోలేదు కాబట్టి అక్కడి ప్రజలు సైకిల్ ను ఎంచుకున్నారు…' అన్నట్టుగా పెద్ద తత్వవేత్తలా చెప్పారీయన.

అయితే ఇది ఈ విశ్లేషణ ఏ మాత్రం వాస్తవానికి దగ్గరగా లేదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు  అని చంద్రబాబు నాయుడు ఎక్కడా ఫీలవ్వలేదు. ఇష్టానుసారం విలాసాలకు పోయారు. విమానాలు, విదేశీ పర్యటనలకు కొదవలేదు. ఆయన కుటుంబం బస ఐదుకు మించిన నక్షత్రాల హోటల్లో. ఆ విషయాలు అన్నీ ప్రజలకు తెలియనివీ ఏమీ కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు.. చంద్రబాబు నాయుడే దాన్ని ఉద్ధరిస్తున్నాడు అనే ఫీలింగ్ ఐదేళ్ల పాలనలో ఎక్కడా కలగలేదు!

రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా చంద్రబాబు నాయుడు విలాసాలకు పోతున్నాడు అనే భావనే సర్వత్రా కలిగింది. పోలింగ్ ముగిసిన ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పార్టీ గెలవబోతోందని చెప్పడానికి వేరే రీజన్లను ఏమైనా చెప్పుకోవచ్చు. తెలుగుదేశమే గెలుస్తోందని లగడపాటి చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి దానికి వేరే రీజన్లు చెప్పుకోవచ్చు. తెలుగుదేశం వాళ్లు చెబుతున్నట్టుగా ఏ 'పసుపు- కుంకుమ' రక్షిస్తుందని చెప్పవచ్చు. అదెలా ఉంటుందో ఫలితాలతో తేలిపోతుంది.

అంతే కానీ.. లగడపాటి చెబుతున్న సెంటిమెంట్ తత్వం మాత్రం ఉత్తమాటే! ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసింది రెండే పనులు. మొదటి బీజేపీ భజన. రెండోది బీజేపీతో గొడవ. అన్ని అంశాల విషయంలోనూ ఈ రెండు రకాల రచ్చలే చేశారు చంద్రబాబు. 

అలాంటి ఆయన రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తున్నాడు అని అనుకుంటే వాళ్లు  లగడపాటి లాగా చంద్రబాబు సొంత సామాజికవర్గం వారు అయ్యుండాలి తప్ప..వేరే వాళ్లు ఎవరూ అలా అనుకోలేదు. ఆల్రెడీ లగడపాటి సర్వేలకు ఉన్న విశ్వసనీయత ఏ పాటిదో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడే తేలిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే.. ఏపీ ఎన్నికలతో వైట్ వాష్ కాబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.