cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఈట‌లా ...నువ్వు అతిగా ఊహించుకోవ‌ద్దు!

ఈట‌లా ...నువ్వు అతిగా ఊహించుకోవ‌ద్దు!

మాజీ మంత్రి ఈట‌ల అన్న‌ట్టుగానే సొంత పార్టీ నుంచే ఎదురు దాడి మొద‌లైంది. నువ్వెంత ...నీ క‌థేంది అనే రేంజ్‌లో ఈట‌ల‌పై మంత్రులు విరుచుకుప‌డ్డారు. నిన్న ఈట‌ల మీడియాతో మాట్లాడుతూ రేప‌టి నుంచి త‌న పార్టీ వాళ్ల‌తోనే త‌న‌పై విమ‌ర్శ‌ల దాడి చేయిస్తార‌ని చెప్పారు. ఆయ‌న అంచ‌నా నిజ‌మైంది. 

మంత్రులు మీడియా స‌మావేశం నిర్వ‌హించి ....నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ స‌హ‌చ‌రుడైన ఈట‌ల‌పై విమ‌ర్శ‌ల గుప్పించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఈట‌ల విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ త‌న‌కు గౌరవం ఇవ్వ‌లేద‌ని ఈటల చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌న్నారు. ఈటలకు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింద‌న్నారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఈటల ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాద‌న్నారు. మూడు, నాలుగేళ్లుగా పార్టీకి వ్యతిరేకంగా ఈట‌ల మాట్లాడుతున్నార‌న్నారు. అయితే ఎందుక‌లా జ‌రుగుతున్న‌దో తెలియ‌ద‌న్నారు.

ఈటల పార్టీలో చేరక ముందే హుజూరాబాద్‌లో పార్టీ బలంగా ఉంద‌న్నారు. ఆ నియోజ‌క వ‌ర్గంలో 21మంది టికెట్లు ఆశించినా పార్టీ ఈట‌ల‌కే పోటీ చేసే అవకాశం ఇచ్చిన‌ట్టు గుర్తు చేశారు. 

ఫ్లోర్ లీడర్‌గా, మంత్రిగా ఈటలకు అత్యంత గౌరవం ద‌క్కింద‌న్నారు. అయితే ఈట‌ల ఆత్మగౌరవం దెబ్బ తిన్నదో అర్థం కావడం లేద‌న్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌పై, పార్టీపై ఇష్టాను సారం మాట్లాడటం క్రమశిక్షణ ఉల్లంఘనే అవుతుంద‌న్నారు.  

అసైన్డ్ భూములను కొన్నానని స్వయంగా ఈట‌లే ఒప్పుకున్నార‌న్నారు. దళిత, పేద వర్గాల గురించి మాట్లాడే మీరు అసైన్డ్ భూములు కొనడం తప్పని తెలియదా? అని ప్ర‌శ్నించారు. వాళ్లకు అవసరం ఉండి అమ్ముకున్నా మీరు ఎలా కొంటారు ? మీ వ్యాపార అభివృద్ధి తప్పా.. దళితుల సంక్షేమం పట్టదా?. అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. 

దేవరాయాంజల్‌లో దేవాలయాల భూములని తెలిసి ఎలా కొన్నారు?. మీ మీద ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి కేసీఆర్ మీద ఆరోపణలు ఎలా చేస్తారు? అని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ నిల‌దీశారు. మీకు మీరు అతిగా ఊహించుకుని మాట్లాడటం సరికాద‌ని హిత‌వు ప‌లికారు.

మ‌రో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ కూడా ఈట‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ఈట‌ల రాజేంద‌ర్ ఒక మేక‌వ‌న్నె పులి అని విమ‌ర్శించారు. బీసీ ముసుగు కప్పుకున్న పెద్ద దొర అని గంగుల కమలాకర్ ఘాటుగా విమర్శించారు. ఈటల హుజురాబాద్‌కు వెళితే బీసీ.. హైద్రాబాద్‌కు వస్తే ఓసీ అవుతార‌ని వెట‌క‌రించారు. 

దేవరాయాంజల్ భూముల కోసం అప్పటి సీఎం వైఎస్‌తో మాట్లాడిన ఈటల.. ముదిరాజ్‌ల కోసం ఎందుకు మాట్లాడలేదని నిల‌దీశారు. నీ వ్యాపార భాగస్వాములు ఎవరైనా బీసీలు ఉన్నారా? అని ప్ర‌శ్నిం చారు. ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా? చీమలు పెట్టిన పుట్టలో పాములా మీరు చేరారని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాము ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్లు మీరు ఎలా సంపాదించారు? అని ప్ర‌శ్నించారు. పార్టీ ఓడితే ఈటల నవ్వుతార‌ని, గెలిస్తే మొహం మాడ్చుకుంటారని ఆరోపించారు. 

ఈటల ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీల నాయకులతో టచ్‌లో ఉన్నార‌న్నారు. అందుకే వారు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను చుల‌క‌న చేసి మాట్లాడ్డం ప‌ద్ధ‌తి కాద‌న్నారు. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×