cloudfront

Advertisement


Home > Politics - Political News

రుణమాఫీ.. ఎన్నికల ముందు రైతులకు మరో టోపీ!

రుణమాఫీ.. ఎన్నికల ముందు రైతులకు మరో టోపీ!

రుణమాఫీ చేసే.. ఎన్నికలకు వెళ్తామని ఇటీవలే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా ప్రకటించారు. అలా భీకరంగా సవాల్ అయితే చేశారు కానీ... అసలు విషయానికి వస్తే ఎన్నికల ముందు మరోసారి రైతులకు టోపీ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ రుణమాఫీ విషయంలో జరిగిన ప్రహసనం రైతులందరికీ తెలిసిందే.

అధికారంలోకి రాగానే మొత్తం రుణమాఫీ అని.. తాకట్టులోని బంగారాన్ని కూడా విడిపించేస్తామని గత ఎన్నికల ముందుహామీ ఇచ్చారు. ఆ ఆశపడే చాలామంది చంద్రబాబును మళ్లీ నెత్తిన పెట్టుకున్నారు. అయితే అధికారంలోకి రాగానే బాబు మాట తప్పారు. బంగారు రుణాలను మాఫీ నుంచి తప్పించేశారు.

ఆ తర్వాత అర్హులను తేల్చే ప్రక్రియను చేపట్టారు. అలా చాలా మందిని అనర్హులుగా చేశారు. అదేమంటే.. వాళ్లంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. ఇక బాబుగారు తేల్చిన మాఫీ అర్హులకు ఒరిగింది ఏమిటి అంటే.. విడతల వారీగా మాఫీ అన్నారు. ఆ విడతల వారీ మొత్తం.. సదరు అప్పులపై వడ్డీలకు కూడా సమానంగా లేకుండా పోయింది.

కనీసం అదైనా వేశారా అంటే ఇప్పటివరకూ మూడు విడతల్లో కొంత కొంత మొత్తాలను జమ చేశారు. ప్రభుత్వమే చెబుతోంది.. నాలుగో విడత మాఫీ సొమ్ము ఇప్పటివరకూ చెల్లించలేదని, ఐదో విడతతో కలిసి చెల్లిస్తామని. దాని గురించినే ఇటీవల అసెంబ్లీలో సవాల్ విసిరారు.

ఇక అసలు విషయానికి వస్తే.. రైతులకు కూడా పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోందట. ఇదీ చంద్రబాబు మార్కు మాఫీ. ఇప్పుడు పోస్టు డేటెడ్ చెక్కులు పంపిణీ చేసి.. తమకు తిరిగి అధికారం ఇస్తేనే అవి చెల్లుతాయనే షరతును పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. బ్యాంకులకు జాబితాలను పంపించమని చెప్పారట.

అవి రాగానే.. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, వాళ్ల ఇళ్లలో వారిచేత రైతులకు పోస్టు డేటెడ్ చెక్కులను పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. పోస్టు డేటెడ్ చెక్కులతో మాఫీ జరిగిపోయిందని చెప్పవచ్చు. తమకు తిరిగి అధికారం ఇస్తేనే.. ఆ చెక్కులు చెల్లుతాయనే భయాన్నీ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ ఓట్లు వేయించుకోవచ్చు. చంద్రబాబు రాజకీయమా మజాకా!