Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇలాగైతే....రాదా క‌రోనా?

ఇలాగైతే....రాదా క‌రోనా?

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ల‌క్ష్యం నెర‌వేర‌డం లేదా? అంటే...ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలంగాణ‌లో క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతి నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఎట్ట‌కేల‌కు లాక్‌డౌన్ విధించేందుకు కేసీఆర్ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిన్న‌టి నుంచి ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్‌కు శ్రీ‌కారం చుట్టారు.

ప్ర‌తిరోజూ ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంది. ప్ర‌తి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు నిచ్చింది. దీంతో వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు భారీగా రోడ్లపైకి వస్తున్నారు.  

గుమికూడితే క‌రోనా వ్యాప్తి పెరుగుతుంద‌ని ప్ర‌భుత్వం ఆందోళ‌న చెందుతుంటే, ప్ర‌జ‌ల్లో మాత్రం అది క‌నిపిస్తున్న‌ట్టు లేదు. నాలుగు గంట‌లు మాత్ర‌మే స‌డ‌లింపు ఉండ‌డంతో వివిధ ప‌నులున్న వాళ్లు ఒక్క‌సారిగా పోలోమ‌ని రోడ్ల మీద ప‌డుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే నగరంలోని పలు ప్రధాన కూడ‌ళ్ల‌లో వాహ‌నాల రద్దీ క‌నిపిస్తోంది.

ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు మార్కెట్లు, దుకాణాల వ‌ద్ద జ‌నం బారులు తీరారు. రాంనగర్ చేపల మార్కెట్‌లో ర‌ద్దీ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఉద‌యం 10 గంట‌ల‌క‌ల్లా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తిరిగి ఇళ్ల‌కు చేరుకోవాల‌నే ఆత్రుత‌లో జ‌నం కిక్కిరిస్తున్నారు. దీంతో క‌రోనా వ్యాప్తికి లాక్‌డౌన్ మ‌రింత దోహ‌దం చేస్తోందేమోన‌న్న అనుమానాలు క‌లుగుతున్నాయి. 

క‌రోనా త‌మ వ‌ర‌కూ రాదులే అనే నిర్ల‌క్ష్య‌మే కొంప ముంచుతోంది. ఆ త‌ర్వాత క‌రోనాబారిన ప‌డ్డ వాళ్లు ఆస్ప‌త్రుల్లో బెడ్స్‌, ఆక్సిజ‌న్ దొర‌క‌లేద‌ని ల‌బోదిబోమంటున్నారు. 

మ‌హ‌మ్మారి బారిన ప‌డొద్ద‌నే ఉద్దేశంతోనే ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధిస్తే, ఆశ‌యానికి తూట్లు పొడుస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రీ ముఖ్య‌మైన ప‌నులైతే అర్థం చేసుకోవ‌చ్చ‌ని, ఏదో ఒక సాకుతో రోడ్ల మీద‌కి వ‌చ్చే వారితోనే స‌మ‌స్య అని అంటున్నారు. ఏది ఏమైనా లాక్‌డౌన్ విధింపు కొత్త స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంద‌న్న అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?