cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

సీమ‌లో లోకేశ్ దిద్దుబా(టు)ట‌

సీమ‌లో లోకేశ్ దిద్దుబా(టు)ట‌

టీడీపీ భ‌విష్య‌త్ ర‌థ సార‌థి నారా లోకేశ్‌. ఇందులో రెండో అభిప్రాయానికి స్థానం లేదు. ఎలాగైనా మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌న్న క‌సి, ప‌ట్టుద‌ల లోకేశ్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అధికారాన్ని పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటే త‌ప్ప ఫ‌లితం వుండ‌ద‌నే ఆలోచ‌న నారా లోకేశ్‌లో పుట్టింది. ఈ నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ‌పై ఆయ‌న దృష్టి సారించారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాయ‌లసీమ‌లో టీడీపీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకుంది.

రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ, 8 పార్ల‌మెంట్ స్థానాల‌కు గాను కేవ‌లం 3 ఎమ్మెల్యే సీట్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్ర‌బాబు, అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ నుంచి ప‌య్యావుల కేశవ్‌, హిందూపురం నుంచి నందమూరి బాల‌కృష్ణ గెలుపొందారు. ఇక పార్ల‌మెంట్ సీటు అనే మాటే లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానంగా సీమ‌లో ఎన్టీఆర్ కాలం నాటి పూర్వ వైభ‌వాన్ని సాధించేందుకు లోకేశ్ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే సీమ‌లో లోకేశ్ దిద్దుబాటు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం కొంద‌రు రాయ‌ల‌సీమ యాక్టివిస్ట్‌ల‌తో ఆ ప్రాంత స‌మ‌స్య‌ల‌పై లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాయ‌ల‌సీమ సాగు, తాగునీటి స‌మ‌స్య‌ల‌తో పాటు సాంస్కృతికంగా త‌మ ప్రాంతంపై జ‌రుగుతున్న దాడిని కూడా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌తి విష‌యాన్ని లోకేశ్ శ్ర‌ద్ధ‌గా వింటూ, కొన్నిచోట్ల మ‌రిన్ని వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.  

ప్ర‌ధానంగా లోకేశ్ దృష్టికి సీమ యువ యాక్టివిస్టులు తీసుకెళ్లిన అంశాల గురించి తెలుసుకుందాం.

కృష్ణాన‌దీ యాజ‌మాన్య బోర్డు కార్యాల‌యాన్ని ఏ సంబంధం లేని విశాఖ‌ప‌ట్నంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెడుతున్నార‌ని, క‌ర్నూలులో ఏర్పాటు చేయాల‌నే సీమ ఉద్య‌మ‌కారుల డిమాండ్‌కు మ‌ద్ద‌తు తెల‌పాలి. ప్ర‌ధానంగా టీడీపీ త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఎదుర్కొనేందుకు రాయ‌ల‌సీమ సంస్కృతిని నెగెటివ్‌గా చిత్రీక‌రించ‌డం మొత్తం సీమ స‌మాజాన్ని మాన‌సికంగా కుంగ‌దీస్తోంది.  

రాయలసీమ/పులివెందుల సంస్కృతి, రాయలసీమ/పులివెందుల దౌర్జన్యం, రాయలసీమ ఫ్యాక్షన్, రాయలసీమ గూండాలు అనే విమ‌ర్శ‌ల‌కు ప‌దేపదే పాల్ప‌డుతూ రాయలసీమ ఆస్తిత్వం పై దాడి చేస్తున్నార‌నే బాధ‌, ఆవేద‌న నుంచి టీడీపీపై ఆగ్ర‌హం పుట్టుకొచ్చింది. ఇక మీద‌ట త‌మ ప్రాంతంపై వ్య‌తిరేక అర్థంలో మాట్లాడ‌క‌పోతే బాగుంటుంద‌ని లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాద‌న‌కు లోకేశ్ అంగీక‌రించారు. ఇకపై అలాంటి ఇబ్బందికర, అభ్యంత‌ర‌క‌ర‌ పదాలు రాయలసీమ, పులివెందుల పేరు పై వాడమని మాట ఇచ్చారు.

అలాగే నంద్యాలలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న RARS (Regional Agriculture Research Station) ను మెడికల్ కాలేజీ కోసం తరలిస్తున్నార‌ని, దానికోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలబడాల‌ని లోకేశ్‌ను కోరగా, ఆయ‌న సానుకూలంగా స్పందించారు. శ్రీశైలం 854 అడుగుల నీటిమట్టం మెయిన్‌టెయిన్‌ చేయాలని ప్రభూత్వాన్ని కోరాలని లోకేశ్‌కు సూచించారు.

అయితే ఈ స‌మావేశంలో అత్యంత వివాదాస్ప‌ద‌మైన మూడు రాజ‌ధానుల అంశంపై చ‌ర్చ‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ మొద‌టిసారి రాయ‌ల‌సీమ వాసుల‌తో లోకేశ్ మీటింగ్ కావ‌డ‌మే టీడీపీలో వ‌చ్చిన మార్పున‌కు సంకేతంగా సీమ యాక్టివిస్టులు భావిస్తున్నారు. ఇది రాయ‌ల‌సీమ స‌మాజానికి ఎంతో మేలు చేస్తుంద‌ని, ఆ ప్రాంత న్యాయ‌మైన డిమాండ్లు సాధించిన విజ‌యంగా భావిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ వైసీపీకి ఇదో హెచ్చ‌రిక‌గా చెప్పొచ్చు. సామాజిక‌, రాజ‌కీయ‌, ఇత‌రేత‌ర కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ రాయ‌లసీమలో వైసీపీ బ‌ల‌మైన పునాదులు క‌లిగి ఉంది. 2014లోనూ, 2019లోనే వైసీపీ అధిక సీట్లు సాధించిన విష‌యాన్ని గుర్తించుకోవాలి. అయితే రాయ‌ల‌సీమ వాసుల మ‌నోభావాల‌కు విరుద్ధంగా కృష్ణాన‌దీ యాజ‌మాన్య బోర్డు కార్యాల‌యాన్ని ఏ మాత్రం సంబంధం లేని వైజాగ్‌కు త‌ర‌లిస్తుంటే అంగీక‌రించేంత‌ అమాయ‌కులెవ‌రూ లేర‌ని వైసీపీ గుర్తించాలి.

రాయ‌ల‌సీమ ప్ర‌యోజ‌నాల కంటే వైసీపీ, వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని గుడ్డిగా ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను స‌మర్థించే ఉద్య‌మ‌కారులు లేరు. ఇంత కాలం రాయ‌ల‌సీమ‌పై చంద్ర‌బాబు, లోకేశ్ తదిత‌ర టీడీపీ నేత‌లు అవాంఛ‌నీయ వ్యాఖ్య‌లు చేస్తుండడం, అది రాజ‌కీయంగా వైసీపీకి క‌లిసొస్తోంది.

ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ మ‌నోభావాల‌ను తాము గాయ‌ప‌రుస్తున్నామ‌నే ప‌శ్చాత్తాపం లోకేశ్ మాట‌ల్లో ప్ర‌తిబింబిస్తోంది. దీంతో టీడీపీ, చంద్ర‌బాబు, లోకేశ్ త‌మ‌కు శ‌త్రువులు కార‌నే భావ‌న ఆ ప్రాంత వాసుల మాటల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. కావున అధికార పార్టీ వైసీపీ సీమ మ‌నోభావాల‌ను గుర్తించి, అందుకు త‌గ్గ‌ట్టుగా మ‌స‌లు కోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. 

చివ‌రిగా లోకేశ్‌కు ఓ సూచ‌న‌. ఎటూ రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల‌పై స్ట‌డీ చేసేందుకు ముందుకు రావ‌డం అభినంద‌నీయం. అలాగే కాస్త పెద్ద వాళ్లు, ఉద్య‌మ అనుభ‌వ‌జ్ఞుల‌తో కూడా మాట్లాడితే మ‌రిన్ని విష‌యాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

సొదుం ర‌మ‌ణ‌

గడ్డం పెంచగానే మాస్ లీడర్ అయిపోవు లోకేష్

సాయం చేయడం నా తల్లి నుంచే నేర్చుకున్నా

 


×