cloudfront

Advertisement


Home > Politics - Political News

లోకేష్ లొకేష‌న్ కోసం ఎన్ని అగ‌చాట్లో...

లోకేష్ లొకేష‌న్ కోసం ఎన్ని అగ‌చాట్లో...

సీఎం చంద్రబాబు త‌ర‌చూ అనేమాట‌... దేశంలో త‌నంత సీనియ‌ర్ రాజ‌కీయవేత్త లేర‌ని. త‌న‌ది 40ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ‌మ‌ని, ఏదైనా త‌న‌కే చెబుతారా అని మండిప‌డుతుంటారు. ఆయ‌న మాట‌లు అబ‌ద్ధమ‌ని ఎవ‌రూ అన‌రు. కాని 40ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఆయ‌న ఇంట గెలవ‌లేక‌పోయార‌నే విమ‌ర్శ ఉంది. ఇప్పుడు కుమారుడు లోకేష్‌ను ఎక్కడ నుంచి ప్రత్యక్ష పోరులో నిల‌పాలో అర్థంకాని ప‌రిస్థితి. చంద్రబాబు ప్రత్యర్థి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్‌ను తీసుకురావాల‌నుకోవ‌డ‌మే ఆల‌స్యం. త‌న సొంతజిల్లా క‌డ‌ప పార్లమెంట్ స్థానం నుంచి జ‌గ‌న్‌ను నిలిపి విజేత‌గా నిలిపారు. వైఎస్సార్ దివంగ‌తులైనా ఆ జిల్లా రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి పెట్టని కోట‌లా నిలిచింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

వైఎస్ కుటుంబం క‌డ‌ప‌ను త‌న అడ్డాగా మ‌లుచుకున్నట్టు చంద్రబాబు ఎందుకు చేసుకోలేక‌పోయార‌నేది పెద్ద ప్రశ్న‌. చిత్తూరుజిల్లా చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని నారావారిప‌ల్లె చంద్రబాబు స్వస్థలం. 1978లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఆయ‌న గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నేప‌థ్యంలో 1983 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థి ఎం.వెంక‌ట్రామానాయుడు చేతిలో చంద్రబాబు ఓట‌మిపాల‌య్యారు. ఆ త‌ర్వాత 1989 ఎన్నిక‌ల నుంచి త‌న స్థావ‌రాన్ని కుప్పానికి మార్చుకున్నారు. నాటి నుంచి నేటివ‌ర‌కు ఆరుసార్లు అక్కడి నుంచి గెలుపొందుతూ వ‌స్తున్నారు.

ప్రస్తుతం త‌న కుమారుడు లోకేష్‌ను ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో ఎక్కడి నుంచి పోటీ చేయించాల‌నేది బాబుకు ప్రశ్నార్థక‌మైంది. ముఖ్యంగా కృష్ణాజిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలోని ప‌ల‌మ‌నేరు, చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తార‌నే ప్రచారం బ‌లంగా వినిపిస్తోంది. ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి అమ‌ర‌నాథ‌రెడ్డిని పుంగ‌నూరుకు పంపి అక్కడ లోకేష్‌ను నిలుపుతార‌ని కొంతకాలం ప్రచారం జ‌రిగింది. అయితే ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు పెద్దగా లేర‌ని, దీంతో గెలుపున‌కు భ‌రోసా లేద‌నే ఉద్దేశంతో అక్కడి నుంచి పోటీ ఆలోచ‌న‌ను విరమించుకున్నార‌ని స‌మాచారం.

 ఇక చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తే లోకేష్‌ను నిల‌పాల‌నే ఉద్దేశంతోనే గ‌ల్లా అరుణ‌ను రాజ‌కీయాల నుంచే త‌ప్పించే కుట్ర జ‌రిగింద‌ని ప్రచారం జ‌రుగుతోంది. రాజ‌కీయాల్లో ఆరితేరిన‌, డ‌బ్బుకు కొద‌వ‌లేని గ‌ల్లా అరుణ‌ను 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మ‌ట్టి క‌రిపించారు. ప్రస్తుతం ఆయ‌న ఆ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా బ‌ల‌మైన అభ్యర్థి. వ్యూహ‌, ప్రతివ్యూహాల‌కు ఆరితేరిన కోర్ టీం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సొంతం. వైసీపీ రాష్ర్ట నాయ‌క‌త్వానికి కూడా లేని నెట్‌వ‌ర్క్ చెవిరెడ్డి వ‌ద్ద ఉంది.

అలాంటి చెవిరెడ్డిపై పోటీ చేయ‌డ‌మంటే కొరివితో త‌ల గోక్కోవ‌డ‌మే అని రాజ‌కీయ విశ్లేష‌కులు హెచ్చరిస్తున్నారు. ప్రజ‌ల మ‌న‌సును గెలుచుకోవాలంటే రాజ‌కీయాలు కాదు మాన‌వీయ సంబంధాల‌ను క‌లిగి ఉండాలి. చిత్తూరు జిల్లాతో అలాంటి అనుబంధం చంద్రబాబుకు లేక‌పోవ‌డం వ‌ల్లే కొడుకు కోసం ఊరూరా తిరిగాల్సిన దుస్థితి ఏర్పడింది.
-ఎస్వీఆర్ఆర్‌