cloudfront

Advertisement


Home > Politics - Political News

లోకేష్‌ ఉవాచ: ప్రజాసేవ కోసమే వచ్చాడట.!

లోకేష్‌ ఉవాచ: ప్రజాసేవ కోసమే వచ్చాడట.!

'మా తాత ముఖ్యమంత్రి.. మా నాన్న ముఖ్యమంత్రి.. నేను విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాను.. అన్నీ వదులుకుని, ప్రజా జీవితంలోకి వచ్చాను. ప్రజలకు సేవ చేయడం తప్ప ఇంకో ఆలోచన నాకు లేదు. ఎప్పుడూ నా మీద అవినీతి ఆరోపణలు రాలేదు. నా జీవితం తెరచిన పుస్తకం..' అంటూ సొంతడబ్బా కొట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ పంచాయితీ రాజ్‌ మరియు ఐటీశాఖా మాత్యులు నారాలోకేష్‌. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా.? చంద్రబాబు లానే లోకేష్‌ కూడా ఈ మధ్య ఒకింత బాగానే మాటలు నేర్చినట్టున్నారు.

మామూలుగా అయితే, లోకేష్‌ నోరు తెరవడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలే జీర్ణించుకోలేరు. కారణం అందరికీ తెల్సిందే.. అయ్యగారి ప్రావీణ్యం. కానీ, ఈసారి ఒకింత పక్కాగా స్క్రిప్టుని బట్టి పట్టినట్టున్నారు. అది కూడా, తన తండ్రి నారా చంద్రబాబునాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్‌లా వుంది. తడుముకోకుండా ఒకే కథని అటూ ఇటూగా తిప్పి, దాదాపు అన్ని మీడియా ఛానల్స్‌తోనూ చెప్పేశారు. రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ అన్యాయం చేశారనీ, ఆ అన్యాయాన్ని టీడీపీ నిలదీసినందుకుగాను, వ్యక్తిగతంగా తమ కుటుంబంపై ఆయన నిందలు వేస్తున్నారనీ లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేసేశారు.

ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ధర్మపోరాట దీక్ష పేరుతో పబ్లిసిటీ స్టంట్‌ చేస్తోన్న విషయం విదితమే. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఒకరేమిటి, తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలంతా ఇప్పుడు ఢిల్లీలోనే మోహరించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా.. ఇలా పలువురు జాతీయస్థాయి నేతలు చంద్రబాబుకి సంఘీభావం తెలిపారండోయ్‌.

అంతా బాగానే వుందిగానీ.. ఢిల్లీలో చంద్రబాబు ఇప్పుడెందుకు దీక్ష చేస్తున్నట్టు.? ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని తొలుత ప్రకటించింది చంద్రబాబు, ప్రత్యేకహోదా సంజీవని కాదని చెప్పిందీ ఆయనగారే. ప్రత్యేక హోదాతో నష్టమే తప్ప లాభం లేదనీ చంద్రబాబే సెలవిచ్చారు. ఇప్పుడు అదే చంద్రబాబు, ప్రత్యేకహోదా కోసం నినదిస్తున్నారు.. అదీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి విభజనతో నష్టం చేసిన కాంగ్రెస్‌ పార్టీని పక్కన కూర్చోబెట్టుకుని.

ఇక, లోకేష్‌గారి ప్రవచనాల విషయానికి మళ్ళీ వద్దాం. లోకేష్‌ మీద వచ్చినన్ని అవినీతి ఆరోపణలు బహుశా దేశంలో ఇంకే యువ నాయకుడి మీదా రాలేదనడం అతిశయోక్తి కాదేమో. నీరు, మట్టి, ఇసుక.. ఇలా ఏ స్కామ్‌ విషయంలో అయినా ముందుగా లోకేష్‌ పేరే విన్పించింది. కానీ, లోకేష్‌ తన మీద అసలు ఆరోపణలే రాలేదంటున్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం, తన శాఖకే ఎక్కువ అవార్డులు ఇచ్చి, ఇప్పుడు తనను అవినీతి పరుడని చెబుతోందంటూ నారాలోకేష్‌ ఒకింత నాటకీయంగా డైలాగులు పేల్చారు.

అవును మరి, అప్పట్లో కేంద్రాన్ని బతిమాలుకుని, పుత్రరత్నానికి క్రేజ్‌ తెచ్చేందుకు చంద్రబాబు 'అవార్డుల పబ్లిసిటీ' స్టంట్‌ చేశారాయె. ఆ ఫలితమే, ఇప్పుడు నారాలోకేష్‌ చెప్పుకోవడానికి ఈ అవార్డుల రూపంలో కన్పిస్తోంది. లేకపోతే, జనంలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలవలేక, దొడ్డిదారిన శాసనమండలికి ఎంపికై, మంత్రిపదవి చేపట్టిన నారా లోకేష్‌ని సమర్థుడని ఎలా అనగలం.?