Advertisement


Home > Politics - Political News
లోకేష్‌ వెంటపడుతున్న సాక్షి, వైకాపా...!

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ అండ్‌ పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి కమ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు కష్టాలొచ్చి పడ్డాయి. అదేమిటి? ఆయన మంత్రి అయ్యాడు కదా. హైదరాబాదులో ఇంద్రభవనంలాంటి అత్యాధునిక భవనం ఉంది. వేల కోట్ల వ్యాపారం ఉంది. కాబోయే ముఖ్యమంత్రని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి లోకేష్‌కు ఏం ఇబ్బందులుంటాయి? అనుకుంటారు జనం. 'వ్యక్తుల ప్రయివేటు బతుకులు వారి వారి ఇష్టం..పబ్లిక్‌లో నిలబడితే ఏమైనా అంటాం' అన్నారు కదా మహాకవి. లోకేష్‌ రాజకీయాల్లోకొచ్చి పబ్లిక్‌లో నిలబడటమే కాకుండా మంత్రి కూడా అయ్యాడు. కాబట్టి ఏమైనా అనే హక్కు ప్రజలకు, ప్రతిపక్షాలకు, మీడియాకు (వ్యతిరేక మీడియాకు) ఉంది. చినబాబు ముందు ఎమ్మెల్సీ అయి, తరువాత మంత్రి అయిన మరుక్షణం నుంచి ఆయన్ని మీడియా వెంటాడుతోంది. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా' అన్నట్లుగా ఈ మీడియాలోనూ సాక్షి మీడియా ఎక్కువ వెంటపడుతోంది. దాన్ని అనుసరించి వైఎస్సార్‌సీపీ నాయకులు వెంటపడుతున్నారు. సాక్షి సమాచారం అందిస్తే వైకాపా నాయకులు దాన్ని ఫాలో అయి విమర్శలు గుప్పిస్తున్నారు.  వైకాపా అధ్యక్షుడు జగన్‌కు-ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య వ్యక్తిగత కక్షలు ఉండటంతో టీడీపీకీ సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని (తప్పులను) సాక్షి మీడియా కొండంతలుగా ప్రచారం చేస్తోంది. వైకాపా నాయకులు రోజుల తరబడి దాన్ని సాగదీస్తారు.

ఇలా చేయడం మంచిదా? కాదా? అనేది మనం నిర్ణయించలేం. చిన్న విషయాలను (సిల్లీగా అనిపించేవి) కూడా వైకాపా నాయకులు పీకి పాకం పెట్టడం ఒక్కోసారి విసుగనిపిస్తోంది. ఇంతకూ వైకాపా, సాక్షి లోకేష్‌ను ఎందుకు వెంటాడుతున్నాయి? అతను మొన్ననే కదా మంత్రి అయ్యాడు. అవినీతి వ్యవహారాలేమీ బయటపడలేదు. అతని పనితీరు స్పష్టం కాలేదు. కాని 'నిన్ను వదల బొమ్మాళీ' అన్నట్లుగా లోకేష్‌ను వదలడంలేదు. ఈ బొమ్మాళీ లోకేష్‌ తెలుగు భాష. ఆయన భావ వ్యక్తీకరణ. ఈ రెండు ఆయనకు సరిగా లేకపోవడం సాక్షి, వైకాపా  వెంటాడటానికి కారణం. ఈ కాలంలో తెలుగు సరిగా రాకపోవడం సాధారణ విషయం. ఎందుకంటే తెలుగు అక్షరం నేర్చుకోకుండా చిన్నప్పటి నుంచి ఇంగ్లిషు మీడియంలోనే చదువుకుంటున్నారు కాబట్టి. కాకపోతే లోకేష్‌ చంద్రబాబు నాయుడి కుమారుడు కావడం ఆయనకు మైనస్‌ పాయింటైంది. తెలుగు చదవలేక, మాట్లాడలేక చినబాబు తరచుగా దొరికిపోతున్నాడు.

ఎమ్మెల్సీగా, మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ప్రమాణపత్రంలోని పదాలను ఉచ్చరించలేక ఇబ్బంది పడ్డాడు. అంబేద్కర్‌ జయంతి రోజును ఆయన వర్థంతిగా పేర్కొనడమే కాకుండా శుభాకాంక్షలు కూడా చెప్పాడు. అప్పటికే సోషల్‌ మీడియాలో జోకులు పేలుతుండగా, వైకాపా నాయకులు రెచ్చిపోయి విమర్శలు చేశారు. చంద్రబాబు కూడా క్లాసు పీకారట...! అయినప్పటికీ మరోసారి భావవ్యక్తీకరణ సరిగా చేయలేక నవ్వులపాలయ్యాడు. తాజాగా కాకినాడ నియోజకవర్గంలో కొన్ని పనులకు శంకుస్థాపన చేసిన లోకేష్‌ ఓ సభలో మాట్లాడుతూ ''రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ప్రతి పల్లెకూ తాగునీరు లేని ఇబ్బందిని ఏర్పాటు చేయడమే నా లక్ష్యం'' అని చెప్పాడు. మంచినీటిని అందరికీ అందించి ఇబ్బంది పడకుండా చూస్తానని చెప్పడం ఆయన ఉద్దేశం. కాని ఆయన  మాట్లాడిన వాక్యం తాగునీటి కోసం ఇబ్బంది పెడతానని చెప్పినట్లుగా ఉంది. లోకేష్‌ చేసిన ఈ భాషాపరమైన తప్పును పట్టుకొని వైకాపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. నగరి ఎమ్మెల్యే రోజా సంగతి చెప్పేదేముంది? 'లోకేష్‌కు తెలుగు రాదు. తెలుగు రాని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు' అని అదే పనిగా విమర్శిస్తోంది.

జగనేమో చంద్రబాబుకు ఇంగ్లీషు రాదని, అర్థం కాదని విమర్శిస్తుంటారు. లోకేష్‌ భాషాపరమైన, భావవ్యక్తీకరణ లోపాలను ఇతర ప్రతిపక్షాలు పెద్దగా పట్టించుకోవడంలేదు. నాయకులు లోపల నవ్వుకుంటున్నారేమోగాని సాగదీయడంలేదు. భాషాపరమైన లోపాలు చాలామంది నాయకులకు ఉన్నాయి. కాని లోకేష్‌ ప్రత్యేకత ఏమిటంటే అతనికి భావవ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌) లోపం కూడా ఉంది. పాజిటివ్‌గా మాట్లాడుతున్నానని అనుకొని నెగెటివ్‌గా మాట్లాడుతున్నాడు. కాని అలా మాట్లాడుతున్నానని గుర్తించలేకపోతున్నాడు. ప్రజాజీవితంలోకి వచ్చినప్పుడు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అందరూ గమనిస్తుంటారనే ఆలోచన ఉండాలి. అవసరమైతే మాట్లాడే విషయాన్ని ఇంట్లో ప్రాక్టీసు చేసుకొని రావాలి. అదీ చేతకాకపోతే సుబ్బరంగా ఎవరిచేతనైనా రాయించుకొని చదవాలి. ఇలా నవ్వులపాలు కావడంకంటే అదే మంచిదేమో...! చంద్రబాబు వెంటనే కుమారుడికి ట్యూషన్‌ పెట్టించడం మంచిది. లేకపోతే అతను తప్పులు చేస్తూనే ఉంటాడు. సాక్షి వెంటపడుతూనే ఉంటుంది. వైకాపా నాయకులు విమర్శలు ఆపరు.